Miss Universe 2020: మిస్‌ యూనివర్స్‌ మెక్సికన్‌ సుందరి
close
Published : 18/05/2021 08:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Miss Universe 2020: మిస్‌ యూనివర్స్‌ మెక్సికన్‌ సుందరి

మిస్‌యూనివర్స్‌ కిరీటం అందుకున్న 26 ఏళ్ల మెక్సికో భామ ఆండ్రియా మెజా... తన కలని సాకారం చేసుకోవడానికి ఐదేళ్లు ఓపిగ్గా ఎదురుచూసింది. ఈ సమయంలో ఎన్నో రంగాల్లో తనదైన ముద్ర వేసుకుంది. మెక్సికోలోని చిహువాహువా ప్రాంతానికి చెందిన ఈ అమ్మడికి చైనా మూలాలు కూడా ఉన్నాయి. ముగ్గురాడ పిల్లలున్న ఇంట్లో పెద్దమ్మాయి. సైన్స్‌పై ఇష్టంతో ఇంజినీరింగ్‌ చేసిన ఈమె సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా తన కెరీర్‌ని మొదలుపెట్టింది. ఉద్యోగం చేస్తూనే మోడలింగ్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. ఆ మరుసటి ఏడాదే మిస్‌ మెక్సికో కిరీటాన్ని సొంతం చేసుకుంది. మేకప్‌పై ఉన్న ఇష్టంతో మేకప్‌ ఆర్టిస్ట్‌గానూ రాణించడం మొదలుపెట్టింది. జంతుహింసను ఇష్టపడని ఈ అమ్మడు వేగాన్‌గా మారిపోయింది. దుస్తుల వ్యాపారంలోనూ పట్టు సాధించింది. మెజాకి ఇద్దరు చెల్లెళ్లతోపాటు నలభైమంది కజిన్స్‌ కూడా ఉన్నారు. పెద్ద కుటుంబంలో కలిసి ఉండటం అంటే ఇష్టం అనే మెజా బాధైనా, కోపమైనా... సంతోషమైనా పాడుతూనే చెబుతుంది.

పాటలంటే అంత ఇష్టం మరి. సొంతంగా సాఫ్ట్‌వేర్‌ సంస్థనీ, ఓ ఫిట్‌నెస్‌ క్లబ్‌నీ తెరవాలనేది తన లక్ష్యం అనే ఈ అమ్మడు నిరంతరం కొత్త ఆలోచనలు చేయడంలో అసలైన మార్పు ఉంటుందని అంటుంది. మెక్సికో మహిళా హక్కుల అంబాసిడర్‌గా పనిచేస్తోంది. నీ దేశానికి నాయకత్వం వహించే అధికారం ఇస్తే కొవిడ్‌ని ఎలా ఎదుర్కొంటావ్‌? అన్న ప్రశ్నకు... ‘ఒక్క ప్రాణం పోవడం కూడా నాకు ఇష్టం లేదు. పరిస్థితులు చేయిదాటకముందే లాక్‌డౌన్‌ ప్రకటిస్తా’ అంటూ సమాధానమిచ్చింది. ప్రస్తుతం మన సమాజం చాలా అభివృద్ధి చెందింది. దాంతో పాటే మూసధోరణులూ పెరిగాయి. అందం అంటే బాహ్య సౌందర్యం ఒక్కటే కాదు... మన ఆలోచనా విధానం, మన వ్యవహారశైలి వంటి వాటిలో ఉంటుంది అందం. మనల్ని తక్కువ చేయడానికి ఇతరులకు ఎప్పుడూ అవకాశం ఇవ్వద్దు అని కుండబద్దలు కొడుతుందీ మెక్సికన్‌ సుందరి.

మెక్సికోకు చెందిన అందాల భామ ఆండ్రియా మెజా(26) మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. 73 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొన్న 69వ విశ్వసుందరి పోటీల్లో భారత్‌కు చెందిన మిస్‌ ఇండియా ఎడలిన్‌ కాస్టిలినో నాలుగో స్థానంలో నిలిచారు. కరోనా విజృంభణ కారణంగా గత ఏడాది చివరిలో జరగాల్సిన మిస్‌ యూనివర్స్‌ 2020 పోటీలు ఆదివారం రాత్రి మియామిలోని ఓ హోటల్‌లో జరిగాయి. మిస్‌ యూనివర్స్‌ అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారం...26 ఏళ్ల మెక్సికన్‌ ఆండ్రియా మెజా ప్రథమ స్థానంలో నిలిచారు. మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని 2019 విజేత జోజిబిని (దక్షిణాఫ్రికా) నుంచి అందుకున్నారు.


Tags :

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని