IND vs SA : కల చెదిరె..

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో అద్భుత   విజయాలు ఉత్సాహాన్నిస్తుండగా.. జట్టుగా సఫారీలు బలహీనపడడం అనుకూలంగా మారగా..దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్‌ విజయానికి టీమ్‌ఇండియాకు ఇంతకుమించిన అవకాశం ఉండదని భావించారంతా! కానీ కల చెదిరింది. పేలవ బ్యాటింగ్‌ కారణంగా ఓ గొప్ప అవకాశం భారత్‌ చేజారింది.

Updated : 15 Jan 2022 08:30 IST

1-2తో సిరీస్‌ చేజారె
మూడో టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌ పరాజయం

కేప్‌టౌన్‌

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో అద్భుత విజయాలు ఉత్సాహాన్నిస్తుండగా.. జట్టుగా సఫారీలు బలహీనపడడం అనుకూలంగా మారగా..దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్‌ విజయానికి టీమ్‌ఇండియాకు ఇంతకుమించిన అవకాశం ఉండదని భావించారంతా! కానీ కల చెదిరింది. పేలవ బ్యాటింగ్‌ కారణంగా ఓ గొప్ప అవకాశం భారత్‌ చేజారింది. తొలి టెస్టులో గెలిచి ఊరించి, రెండో మ్యాచ్‌లో ఓడిన కోహ్లీసేన.. చివరి టెస్టులోనూ భంగపడింది. మూడో రోజు ఆఖరికే విజయానికి బాటలు వేసుకున్న దక్షిణాఫ్రికా.. నాలుగో రోజు ఎలాంటి పొరపాటూ చేయలేదు.

తొలి టెస్టులో నెగ్గి సిరీస్‌ ఫేవరెట్‌గా మారిన టీమ్‌ ఇండియా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. పసలేని బ్యాటింగ్‌ వల్ల 1-2తో సిరీస్‌ను చేజార్చుకుంది.  చివరిదైన మూడో టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. నాలుగో రోజు, శుక్రవారం దక్షిణాఫ్రికా విజయానికి 111 పరుగులు అవసరంగా కాగా.. భారత బౌలర్లేమీ అద్భుతం చేయలేదు. 212 పరుగుల లక్ష్య ఛేదనలో, ఓవర్‌నైట్‌ స్కోరు    101/2తో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆతిథ్య జట్టు.. ఎలాంటి తడబాటు లేకుండా పని పూర్తి చేసింది. కీగన్‌ పీటర్సన్‌ (82; 113 బంతుల్లో 10×4), వాండర్‌డసెన్‌ (41 నాటౌట్‌; 95 బంతుల్లో 3×4), బవుమా (32 నాటౌట్‌;  58 బంతుల్లో 5×4) చక్కని బ్యాటింగ్‌తో తమ జట్టును విజయ తీరాలకు చేర్చారు. సిరీస్‌ ఆరంభానికి ముందే ప్రధాన పేసర్‌ నార్జ్‌ను కోల్పోయి, మధ్యలో డికాక్‌ అకస్మిక రిటైర్మెంట్‌తో దెబ్బతిన్న దక్షిణాఫ్రికాకు ఇది చిరస్మరణీయమే. వివాదాలతో తమ క్రికెట్‌ బోర్డులో సంక్షోభం లెత్తిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఈ సిరీస్‌ ఆడిన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. గట్టెక్కించడానికి గత కొన్నేళ్లుగా బౌలర్లపై అతిగా ఆధారపడుతున్న భారత బ్యాట్స్‌మెన్‌కు వాళ్లూ మానవమాత్రులేనని తెలిసొచ్చింది. అయితే బౌలర్లు ఉత్తమ ప్రయత్నమే చేశారనుకోండి. బ్యాట్స్‌మెన్‌ ప్రదర్శనే సరిపోలేదు. కీగన్‌ పీటర్సన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు లభించాయి. రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఈ నెల 19న పార్ల్‌లో ఆరంభమవుతుంది.

అలవోకగా..: రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియాను కట్టడి చేసిన దక్షిణాఫ్రికా.. మెరుగైన బ్యాటింగ్‌తో మూడో రోజు ఆఖరికే మ్యాచ్‌పై నియంత్రణ సాధించింది. కీగన్‌ పీటర్సన్‌తో మరోసారి అదిరే బ్యాటింగ్‌తో భారత్‌ను అడ్డుకున్నాడు. ఈ నేపథ్యంలో నాలుగో రోజు టీమ్‌ఇండియా ఏకైక ఆశ బుమ్రా, షమిల తొలి స్పెల్‌లే. అయితే పీటర్సన్‌ అనేక సార్లు గురి తప్పినా పరుగులు సాధిస్తూ స్కోరు బోర్డును నడిపించాడు. బుమ్రా యార్కర్లు వేయగా.. షమి సీమ్‌ను ఉపయోగించుకుంటూ బ్యాట్స్‌మెన్‌కు దూరంగా వెళ్లేలా బంతులేశాడు. అయితే దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ సహనంతో బ్యాటింగ్‌ చేశారు. పీటర్సన్‌కు వాండర్‌డసెన్‌ మంచి సహకారాన్నిచ్చాడు. ఎట్టకేలకు పీటర్సన్‌ను శార్దూల్‌ బౌల్డ్‌ చేయడంతో 54 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. శుక్రవారం భారత్‌కు దక్కిన ఏకైక వికెట్టదే. అప్పటికి స్కోరు 155. నిజానికి మ్యాచ్‌ ఆరంభమైన కొద్దిసేపటికే పీటర్సన్‌ ఔట్‌ కావాల్సింది. బుమ్రా బౌలింగ్‌లో అతడిచ్చిన తేలికైన క్యాచ్‌ను మొదటి స్లిప్‌లో పుజారా వదిలేశాడు. పట్టుంటే ఆట భిన్నంగా ఉండేదేమో! చివరికి పీటర్సన్‌ ఔటైనా అప్పటికే దక్షిణాఫ్రికా లక్ష్యం దిశగా సాగుతోంది. వాండర్‌డసెన్‌, బవుమా భారత్‌కు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. తడబాటు లేకుండా ఆడిన వాళ్లిద్దరు అభేద్యమైన నాలుగో వికెట్‌కు 52 పరుగులు జోడించి దక్షిణాఫ్రికాను విజయపథంలో నడిపించారు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 223
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 210
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 198

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: మార్‌క్రమ్‌ (సి) రాహుల్‌ (బి) షమి 16; ఎల్గర్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 30; పీటర్సన్‌ (బి) శార్దూల్‌ 82; వాండర్‌డసెన్‌ నాటౌట్‌ 41; బవుమా నాటౌట్‌ 32; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (63.3 ఓవర్లలో) 212/3; వికెట్ల పతనం:  1-23, 2-101, 3-155; బౌలింగ్‌: బుమ్రా 17-5-54-1; షమి 15-3-41-1; ఉమేశ్‌ యాదవ్‌ 9-0-36-0; శార్దూల్‌ ఠాకూర్‌ 11-3-22-1; అశ్విన్‌ 11.3-1-51-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని