UP Election 2022: సమాజ్‌వాదీ పార్టీకి షాక్‌.. భాజపాలో చేరిన ములాయం కోడలు

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీల్లో అసమ్మతులు, చేరికలు ఊపందుకున్నాయి.

Updated : 19 Jan 2022 11:00 IST

లఖ్‌నవూ: అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections 2022) సమీపిస్తున్న వేళ ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీల్లో అసమ్మతులు, చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ(SamajWadi Party)కి షాకిస్తూ.. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ (Mulayam Singh Yadav) కోడలు అపర్ణ యాదవ్‌ (Aparna Yadav) భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. ములాయం చిన్న కుమారుడు ప్రతీక్‌ సతీమణి అపర్ణ యాదవ్‌.. భాజపా తీర్థం పుచ్చుకున్నారు. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేతలు ఆమెకు కండువా కప్పి భాజపాలోకి ఆహ్వానించారు. 

2017లో జరిగిన ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్​వాదీ పార్టీ తరఫున పోటీ చేశారు అపర్ణ యాదవ్‌. కానీ, భాజపా అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే, ఇటీవలి కాలంలో భాజపా ప్రభుత్వ విధానాలను సమర్థిస్తూ వస్తున్నారు. దీంతో ఆమె కాషాయ కండువా కప్పుకుంటారని గత కొన్ని రోజుల నుంచి ప్రచారం మొదలైంది. ఈ ఊహాగానాలను నిజం చేస్తూ నేడు ఆమె భాజపాలో చేరారు.

గత కొద్దిరోజులుగా కీలకమైన బీసీ నేతలు భాజపా నుంచి బయటకు వెళ్లిన నేపథ్యంలో.. అపర్ణ యాదవ్ చేరిక భాజపాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా.. ఎస్పీకి నాయకత్వం వహిస్తున్న కుటుంబంలోని వ్యక్తి రావడం.. భాజపాకు లాభం చేకూర్చనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సైనీ సహా పలువురు ఎమ్మెల్యేలు తమ అనుచరులతో కలిసి ఇటీవల సమాజ్​వాదీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. బీసీ ఓట్లతో భాజపా అధికారంలోకి వచ్చిందని, ఇన్నేళ్లయినా ఆ వర్గాన్ని పట్టించుకోలేదని వారు ఆరోపించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలను వెల్లడించనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా పరిగణించే యూపీ ఎన్నికల్లో యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భాజపా, ఎస్పీ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉండనున్నట్లు వినిపిస్తున్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి కూడా గెలుపు ఖాయమని భాజపా ధీమాతో ఉంది. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ కూడా తిరిగి రాష్ట్ర పగ్గాలు చేపట్టాలని పట్టుదలగా కన్పిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని