Punjab polls: పంజాబ్‌ ప్రజల ప్రియనేస్తం చన్నీ: సిద్ధూ

చరణ్‌జిత్‌ చన్నీని పంజాబ్‌ ప్రియనేస్తంగా అభివర్ణించారు రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ సిద్ధూ. అందరూ ఆయనను ఆదరించాలని కోరారు......

Published : 07 Feb 2022 01:39 IST

చండీగఢ్‌: పంజాబ్‌ కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా ఎవరనే ప్రతిష్టంభనకు తెరదించుతూ అధిష్ఠానం ఆదివారం అభ్యర్థిని ప్రకటించింది. ప్రస్తుత సీఎం చరణ్‌జిత్‌ చన్నీనే సీఎం అభ్యర్థిగా ఉంటారని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఎలాంటి ప్రయోగాలకూ పోకుండా పోటీలో ఉన్న నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూని పక్కనపెడుతూ.. చన్నీ వైపే అధిష్ఠానం మొగ్గుచూపింది. అయితే సీఎం అభ్యర్థిగా చన్నీని రాహుల్‌ ప్రకటించగానే.. సిద్ధూ చిరునవ్వులు చిందిస్తూ చన్నీ చేతిని పైకెత్తి చూపడం విశేషం.

అంతకుముందు సిద్ధూ మాట్లాడుతూ.. చరణ్‌జిత్‌ చన్నీని పంజాబ్‌ ప్రియ నేస్తంగా అభివర్ణించారు. అందరూ ఆదరించాలని కోరారు. అయితే తాను ఏ పదవి కోసం ఆరాటపడలేదని, రాష్ట్ర ప్రజల జీవితాలు మెరుగుపడాలని మాత్రమే కృషిచేశానని ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ పేర్కొన్నారు. ‘నా 17 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ పదవి కోసం తలవంచలేదు. కానీ పంజాబ్‌ ప్రజల జీవితాలు బాగుపడాలని తపించా’ అని పేర్కొన్నారు.

ప్రస్తుత అయిదు రాష్ట్రాల ఎన్నికల సమరంలో.. కాంగ్రెస్‌ పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. ఈ స్థానానికి సీఎం చన్నీ, సిద్ధూ మధ్యే పోటీ నెలకొంది. ఈ ఇద్దరి మధ్య ఉన్న పొరపొచ్చాలను తొలగిస్తూ.. అధిష్ఠానం వీరికి సర్దిచెప్పినట్లు తెలుస్తోది. దీంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇరువురు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్‌) ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం.. చన్నీని అభ్యర్థిగా ఎంచుకుంది. అయితే సిద్ధూని పక్కనపెట్టడంతో పార్టీలో అంతర్గత తలెత్తే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని