UP Election 2022: మనసు మార్చుకున్న అఖిలేశ్‌.. పోటీ ఎక్కడి నుంచంటే..?

త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల తేదీ దగ్గరపడుతున్నకొద్దీ మరింత రసవత్తరంగా మారుతున్నాయి.

Published : 19 Jan 2022 12:01 IST

లఖ్‌నవూ: త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఏ స్థానంలో నిల్చోవడం లేదని చెప్పిన సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) అధినేత అఖిలేశ్‌ యాదవ్(Akhilesh Yadav).. తాజాగా మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆయన అజంగఢ్‌లోని గోపాల్‌పూర్‌(Gopalpur) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌(Yogi Adityanath) మొదటిసారి రాష్ట్ర ఎన్నికల్లో పోటీ పడనున్నట్లు ప్రకటించిన తర్వాత ఈ వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం అఖిలేశ్‌ యాదవ్ అజంగఢ్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. గతంలో యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ.. లెజిస్లేటివ్ కౌన్సిల్‌ నుంచి ప్రాతినిధ్యం వహించారు. దాంతో ఇప్పుడు బరిలో నిలిస్తే.. ఆయన కూడా మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడినట్లవుతుంది. అలాగే ఒకటి కంటే ఎక్కువ సీట్ల నుంచి ఎన్నికల్లో పాల్గొనాలని యోచిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మరోపక్క యోగి గోరఖ్‌పూర్ సదర్(Gorakhpur Sadar) నుంచి పోటీ చేయనున్నారు. ఇదే అఖిలేశ్‌పై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. 

ఈ ఎన్నికల వేళ.. యూపీలో ఫిరాయింపులు జోరందుకున్నాయి. అధికార భాజపా నుంచి కీలక ఓబీసీ నేతలు సమాజ్‌వాదీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ అధినేతకు ఇంటి నుంచే గట్టి షాక్ తగిలింది. అఖిలేశ్ సోదరుడి సతీమణి అపర్ణ యాదవ్ ఈ రోజు భాజపాలో చేరారు. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేతలు ఆమెకు కండువా కప్పి భాజపాలోకి ఆహ్వానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని