Divorce: హుందాగా ప్రకటించినా సమంతనే ట్రోల్‌ చేశారు: నటి

కోలీవుడ్‌ నటుడు ధనుష్‌‌, ఆయన సతీమణి ఐశ్వర్య తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు సోమవారం ప్రకటించి అందర్నీ షాక్‌ గురి చేసిన విషయం తెలిసిందే. వాళ్లిద్దరూ మరలా కలవాలని కోరుకుంటూ...

Updated : 19 Jan 2022 13:33 IST

చెన్నై: కోలీవుడ్‌ నటుడు ధనుష్‌‌, ఆయన సతీమణి ఐశ్వర్య తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు సోమవారం ప్రకటించి అందర్నీ షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. వాళ్లిద్దరూ మళ్లీ కలవాలని కోరుకుంటూ పలువురు నెటిజన్లు వరుస ట్వీట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్‌.. ధనుష్-ఐశ్వర్యలతో మాట్లాడి తిరిగి వాళ్లని ఒక్కటి చేయండంటూ మలయాళీ నటి లక్ష్మి రామకృష్ణన్‌కు ట్వీట్‌ పెట్టాడు. దానిపై స్పందించిన లక్ష్మి వాళ్ల వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించవద్దని అన్నారు. అంతేకాకుండా కొంతమంది నెటిజన్లు కావాలనే నెగెటివిటీని సృష్టిస్తున్నారని ఆమె తెలిపారు. ఈ మేరకు ఇటీవల నటి సమంతపై వచ్చిన వ్యతిరేకతను ఆమె ఉదాహరణగా చెప్పుకొచ్చారు.

‘‘చట్టపరంగా విడాకులు తీసుకోవడానికి ముందు వేరే వాళ్లతో రిలేషన్‌ పెట్టుకుని పరస్పరం అనుచిత వ్యాఖ్యలు చేసుకోకుండా, మానసిక ప్రశాంతతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎంతో గౌరవప్రదంగా ధనుష్‌-ఐశ్వర్య విడిపోయారు. కాబట్టి వాళ్ల వ్యక్తిగత జీవితానికి మనం కూడా భంగం కలిగించవద్దు. దయచేసి ఇకనైనా వాళ్లని ఒంటరిగా వదిలేయండి’’ అని లక్ష్మి ట్వీట్‌ చేశారు.

కాగా, ఆమె పెట్టిన ట్వీట్‌పై స్పందించిన నెటిజన్‌.. ‘‘వాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. కానీ, ఈ విషయాన్ని వాళ్లు అధికారికంగా ప్రకటించకుండా సైలెంట్‌గా ఎవరి దారి వాళ్లు చూసుకోవాల్సింది. ఎందుకంటే వాళ్ల ప్రకటనతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయినా సెలబ్రిటీల్లో విడాకులు తీసుకోవడం ఇప్పుడు సర్వసాధారణమైన విషయం అయిపోయింది’’ అని ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌పై స్పందించిన లక్ష్మి.. ‘‘సమస్య ఏమిటంటే.. ఒకవేళ అధికారికంగా ప్రకటించకపోతే వాళ్ల అనుమతి లేకుండానే ఎన్నో తప్పుడు ప్రచారాలు జరుగుతాయి. ఉదాహరణకు నటి సమంతనే తీసుకోండి.. ఆమె ఎంతో హుందాగా తన విడాకులు గురించి ప్రకటించినప్పటికీ విపరీతంగా ట్రోల్‌ చేశారు. ఆమెపై వివాదాస్పద ఆరోపణలు చేశారు’’ అని సమాధానమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని