Google: గూగుల్‌ 23వ వార్షికోత్సవం నేడు.. ప్రత్యేక ‘డూడుల్‌’ చూశారా!

అంతర్జాలంలో ఏదైనా వెతకాలంటే ముందుగా మనకు గుర్తొచ్చే సెర్చ్‌ ఇంజన్‌లలో ‘గూగుల్‌’ ఒకటి. ఇంటర్నెట్‌, సాఫ్ట్‌వేర్‌ సంబంధిత సేవలతో దూసుకెళ్తున్న ఈ అమెరికన్‌ సంస్థ.. సోమవారం 23వ వార్షికోత్సవం జరుపుకొంటోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని...

Published : 27 Sep 2021 11:41 IST

కాలిఫోర్నియా: అంతర్జాలంలో ఏదైనా వెతకాలంటే ముందుగా మనకు గుర్తొచ్చేది ‘గూగుల్‌’. ఇంటర్నెట్‌, సాఫ్ట్‌వేర్‌ సంబంధిత సేవలతో దూసుకెళ్తున్న ఈ అమెరికన్‌ సంస్థ.. సోమవారం 23వ వార్షికోత్సవం జరుపుకొంటోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని కంపెనీ తన హోమ్‌పేజీలో ఉంచిన కేక్‌ ‘డూడుల్‌’ నెటిజన్లను ఆకట్టుకుంటోంది! కేకు ఉంచి, గూగుల్‌ ఆంగ్ల అక్షరమాలలో ‘ఎల్‌’ అక్షరాన్ని ఆ కేకుపై కొవ్వొత్తిలా కనిపించేలా దీన్ని రూపొందించారు. దీంతోపాటు 23వ వార్షికోత్సవానికి సూచికగా కేకుపై 23 అని ఉంది. ‘ఒక్క అవకాశం జీవితాన్నే మార్చుతుందని అంటారు. అదే గూగుల్‌ విషయంలో ఇద్దరు కంప్యూటర్‌ శాస్త్రవేత్తలు కలిసి మొత్తం ఇంటర్నెట్‌ గమనాన్ని, లక్షలాది జీవితాలను మార్చారు. హ్యాపీ బర్త్‌డే గూగుల్‌!’ అని రాసుకొచ్చారు.

150కు పైగా భాషల్లో..

అమెరికాకు చెందిన లారీ పేజ్‌, సర్జీ బ్రిన్‌ స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థులుగా ఉన్నప్పుడు 1998 సెప్టెంబరు 4న ఈ సంస్థను స్థాపించారు. క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చిన ఈ సంస్థ.. నేడు వరల్డ్‌ టాప్‌ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. రోజూ ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా భాషల్లో బిలియన్ల కొద్దీ శోధనలు జరుగుతున్నాయి. 20కి పైగా డేటా సెంటర్లు నిరంతరాయ సేవలు అందిస్తున్నాయి. ఈ సంస్థకు 2015లో భారత్‌కు చెందిన సుందర్ పిచాయ్ సీఈఓగా నియమితులైన విషయం తెలిసిందే. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. గూగుల్‌ మొదటి ఏడేళ్లు సెప్టెంబరు 4నే వార్షికోత్సవం నిర్వహించింది. కానీ, రికార్డుల ఆధారంగా 2005 నుంచి సెప్టెంబర్ 27కి మార్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని