తీరు మారకుంటే రాబోయేది మహమ్మారుల శకమే!

అంటువ్యాధుల్ని అరికట్టే విషయంలో ప్రపంచ దేశాల విధానాల్లో మార్పులు రాకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన మహమ్మారుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఓ అంతర్జాతీయ నివేదిక హెచ్చరించింది.....

Updated : 30 Oct 2020 13:32 IST

తప్పించుకునేందుకు ఉన్న మార్గాలివే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంటువ్యాధుల్ని అరికట్టే విషయంలో ప్రపంచ దేశాల విధానాల్లో మార్పులు రాకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన మహమ్మారుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఓ అంతర్జాతీయ నివేదిక హెచ్చరించింది. ప్రకృతి విధ్వంసానికి.. మహమ్మారుల ఆవిర్భావానికి మధ్య అవినాభావ సంబంధం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాబోయే మహమ్మారుల శకాన్ని తప్పించుకోవడానికి ఉన్న మార్గాలనూ సూచించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ‘ఇంటర్‌ గవర్నమెంటల్‌ సైన్స్‌ పాలసీ ప్లాట్‌ఫామ్‌ ఆన్‌ బయోడైవర్సిటీ అండ్‌ ఎకోసిస్టం సర్వీసెస్‌’(ఐపీబీఈఎస్‌) అత్యవసర వర్క్‌షాప్‌ నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 22 మంది నిపుణుల లోతైన విశ్లేషణల అనంతరం ఈ నివేదికను రూపొందించింది. ప్రపంచ దేశాల విధానం ‘ప్రతిచర్య నుంచి నివారణ’ దిశగా మారాలని సూచించింది. 

మరో 85వేల వైరస్‌లు..

నివేదిక ప్రకారం.. భవిష్యత్తులో ఉద్భవించే మహమ్మారులు మరింత తరచుగా, వేగంగా వ్యాప్తి చెందుతాయి. కొవిడ్‌-19 కంటే ఎక్కువ మంది మరణించే ప్రమాదం ఉంది. అంటువ్యాధుల్ని అరికట్టే అంశంలో ప్రపంచ దేశాల విధానాల్లో మార్పు రాకపోతే తీవ్ర పరిణామాలుంటాయి. 1918 నాటి గ్రేట్‌ ఇన్‌ప్లూయెంజా తర్వాత వచ్చిన మహమ్మారుల్లో కొవిడ్‌-19 ఆరోది. అన్ని మహమ్మారుల్లాగే కరోనా మూలమూ జంతువుల్లో తిష్ట వేసే సూక్ష్మజీవుల్లోనే ఉంది. కానీ, మానవ కార్యకలాపాల వల్లే ఇది విజృంభించింది. క్షీరదాలు, పక్షుల్లో ఇప్పటి వరకు గుర్తించని మరో 1.7 మిలియన్ల వైరస్‌లు ఉన్నాయి. వీటిలో కనీసం 85 వేల వైరస్‌లు మానవులకు సోకే సామర్థ్యం ఉంది. 

ఇవే మహమ్మారుల విజృంభణకు బాటలు..

కాలం గడుస్తున్న కొద్దీ వెలుగులోకి వస్తున్న కొత్త మహమ్మారుల పుట్టుక వెనుక పెద్ద రహస్యమేమీ లేదని ఐపీబీఈఎస్ ఛైర్మన్‌ డాక్టర్‌ పీటర్‌ డాస్‌జక్‌ అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య విధ్వంసానికి కారణమవుతున్న మానవ తప్పిదాలే మహమ్మారుల విజృంభణకూ ఆజ్యం పోస్తున్నాయన్నారు. భూ వినియోగం, వ్యవసాయ విస్తరణ, అస్థిర వాణిజ్య విధానం, ఉత్పత్తి-వినియోగం మధ్య భారీ వ్యత్యాసం ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తోందని తెలిపారు. దీంతో వన్యప్రాణులు, పశుసంపద, వ్యాధికారకాల మధ్య సంబంధాలు పెరుగుతున్నాయన్నారు. ఇదే మహమ్మారుల విజృంభణకు బాటలు వేస్తోందన్నారు. ప్రకృతి విధ్వంసానికి కారణమవుతున్న మానవ తప్పిదాలను అరికట్టడమే మహమ్మారుల శకాన్ని అంతం చేయడానికున్న ఏకైక మార్గమని స్పష్టం చేశారు.

నియంత్రణ కంటే నివారణకు 100 రెట్లు తక్కువ వ్యయం..

అంటువ్యాధులు ప్రబలిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే అవి రాకుండా అరికట్టడమే మేలని నివేదిక గుర్తుచేసింది. వ్యాక్సిన్లు, ఔషధాల ఆవిష్కరణ కచ్చితమైన పరిష్కారం కాదని.. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ పతనంతో పాటు ప్రాణనష్టం భారీ స్థాయిలో ఉంటుందని అభిప్రాయపడింది. జులై నాటికి కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 8-16 ట్రిలియన్‌ డాలర్లు కోల్పోయిందని అంచనా వేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2021 నాలుగో త్రైమాసికం ముగిసే నాటికి ఒక్క అమెరికాలోనే 16 ట్రిలియన్‌ డాలర్ల నష్టానికి కారణమయ్యే అవకాశం ఉందంది. మహమ్మారులు వచ్చిన తర్వాత నియంత్రించడానికయ్యే ఖర్చు కంటే రాకుండా నివారించడానికి 100 రెట్లు తక్కువ వ్యయం అవుతుందని తెలిపింది. 

నివేదిక సూచించిన విధానపరమైన పరిష్కారాలు..

* రాబోయే మహమ్మారుల ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి వాటి నివారణకున్న మార్గాలను విధానకర్తలకు సూచించేలా ఓ ఇంటర్‌ గవర్నమెంటల్‌ మండలిని ఏర్పాటు చేయాలి. ముప్పు ఉన్న ప్రాంతాల్ని గుర్తించి.. విజృంభణ వల్ల తలెత్తే ప్రతికూల పరిణామాల్ని అంచనా వేయాలి.

* ప్రజలు, జంతువులు, ప్రకృతికి లబ్ధి చేకూర్చేలా దేశాల మధ్య పరస్పర ఆమోదయోగ్యమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. 

* మెరుగైన ఆరోగ్య వ్యవస్థను సాధించేందుకు డబ్ల్యూహెచ్‌వో రూపొందించిన ‘వన్‌ హెల్త్‌’ విధానాన్ని వ్యవస్థీకృతం చేయాలి. తద్వారా మహమ్మారులను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి. 

* అభివృద్ధి, భూ వినియోగ ప్రాజెక్టులలో మహమ్మారుల విజృంభణ, దాని ప్రభావాన్ని అంచనా వేసే వ్యవస్థను రూపొందించాలి. ఇలాంటి ప్రాజెక్టుల వల్ల జీవవైవిద్యానికి ఉన్న ముప్పును ముందుగానే పసిగట్టి వాటి నివారణకు కావాల్సిన పరిష్కారాలను గుర్తించాలి.

* అంతర్జాతీయ వన్యప్రాణుల వ్యాపారం ద్వారా అంటువ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గించాలి. మహమ్మారుల విజృంభణకు కారణమవుతున్న జీవులతో వ్యాపారాన్ని నివారించాలి. 

* ప్రజల్లో అవగాహన పెంచి అంటువ్యాధుల నివారణ కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని