logo

అటవీ సంపద జోలికొస్తే సహించేది లేదు

వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మన జిల్లాలో ఉన్న అటవీ సంపదను కొల్లగొడుతుంటే సహించేది లేదు.. అటవీ సంపదను కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎస్పీ సీహెచ్‌ విజయరావు అన్నారు. చిల్లకూరు మండలం బూదనం వద్ద 55మంది కూలీలతోపాటు ముగ్గురు ప్రధాన నిందితులు, 45 ఎర్రచందన దుంగలను

Published : 24 Jan 2022 06:12 IST

ఎస్పీ సీహెచ్‌ విజయరావు l 55 మంది కూలీలు, ముగ్గురు ప్రధాన నిందితుల అరెస్టు


వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ విజయరావు.. చిత్రంలో ఏఎస్పీ వెంకటరత్నం, గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తదితరులు

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మన జిల్లాలో ఉన్న అటవీ సంపదను కొల్లగొడుతుంటే సహించేది లేదు.. అటవీ సంపదను కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎస్పీ సీహెచ్‌ విజయరావు అన్నారు. చిల్లకూరు మండలం బూదనం వద్ద 55మంది కూలీలతోపాటు ముగ్గురు ప్రధాన నిందితులు, 45 ఎర్రచందన దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయా వివరాలను ఆదివారం చెముడుగుంటలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఎస్పీ వెల్లడించారు. మొత్తం 45ఎర్రచందన దుంగలు, 31 సెల్‌ఫోన్లు, రెండు వాహనాలు, 24 గొడ్డళ్లు, 3 బరిసెలు, 2రంపాలు, రూ.75,230 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆయా వివరాలను ఎస్పీ వెల్లడించారు. చిత్తూరు జిల్లా వీబీపురం మండలం ఆరె గ్రామానికి చెందిన ఒల్లూరు దాము గతంలో ఆయిల్‌ ట్యాంకర్లు నడిపి నష్టం రావడంతో కుప్పన్న సుబ్రహ్మణ్యం వద్ద లారీ క్లీనర్‌గా పనిచేస్తూ జీవనాన్ని గడుపుతున్నాడు. ఈ క్రమంలో అయిదు నెలల క్రితం దాముకు పుదుచ్చేరికి చెందిన పెరుమాళ్లు వెలుమలైతో పరిచయమైంది. ఎర్రచందనం అక్రమ రవాణాకు తెరలేపారు. ఈ క్రమంలో ఈ నెల 20న వీరు ముగ్గురితోపాటు పుదుచ్చేరికి చెందిన రాధాకృష్ణన్‌ పళని కొంతమంది కూలీలను తీసుకుని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో దొరికే ఎర్రచందనం దుంగలను విక్రయించి సొమ్ము చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కూలీలను ఐషర్‌ వాహనంలో తీసుకురాగా, ప్రధాన నిందితులు ముగ్గురు ఒక కారులో బయల్దేరి చిత్తూరు జిల్లా రైల్వేకోడూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌ని తీసుకుని గూడూరు నుంచి రాపూరు అడవుల్లోకి వెళ్లారు. 21న సాయంత్రం దుంగలతోపాటు వాహనాల్లో చెన్నై వైపు తరలిస్తుండగా చిల్లకూరు మండలం బూదనం గ్రామం వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. అయితే, కూలీలు పోలీసులపై తిరగబడగా, అతి కష్టమ్మీద వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరికైనా సమాచారం తెలిసినా మాకు తెలియజేయాలనీ, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఎర్రచందన అక్రమార్కులను పట్టుబడటంలో ప్రతిభ కనబరిచిన గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, గ్రామీణ సీఐ పి.శ్రీనివాసరెడ్డి, వెంకటగిరి సీఐ నాగమల్లేశ్వరరావు, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకట రత్నం, శ్రీనివాసరావు, ఎస్‌డీ డీఎస్పీ కోటారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని