logo

భవిష్యత్తుతో ఆటలు

జిల్లా అభివృద్ధిలో కీలకంగా ఉన్న రాష్ట్ర క్రీడా పాఠశాల నిర్వహణ గాడితప్పుతోంది. కరోనా, నిధుల కొరత, సిబ్బంది లేమి.. తదితర కారణాలతో ఇప్పటికే పలుమార్లు మూతపడగా.. తాజాగా జీతాలు లేవని కొందరిని తొలగించడంతో మరోసారి గేట్లు పడ్డాయి.

Published : 24 Jan 2022 04:37 IST

మళ్లీ మూతపడిన రాష్ట్ర క్రీడా పాఠశాల

మధ్యలోనే ఆగిపోయిన నిర్మాణ పనులు

విజయనగరం క్రీడలు, న్యూస్‌టుడే: జిల్లా అభివృద్ధిలో కీలకంగా ఉన్న రాష్ట్ర క్రీడా పాఠశాల నిర్వహణ గాడితప్పుతోంది. కరోనా, నిధుల కొరత, సిబ్బంది లేమి.. తదితర కారణాలతో ఇప్పటికే పలుమార్లు మూతపడగా.. తాజాగా జీతాలు లేవని కొందరిని తొలగించడంతో మరోసారి గేట్లు పడ్డాయి. సిబ్బంది లేకుండా నడపలేమని, పర్యవేక్షణ కష్టతరమవుతోందని జిల్లా అధికారులు కూడా చేతులెత్తేశారు. ఈక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

పరిస్థితి ఇదీ..

క్రీడల్లో రాణించే ప్రతిభావంతులైన పిల్లలకు విద్యతో పాటు వివిధ క్రీడా అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు గత ప్రభుత్వ హయాంలో విజ్జీ మైదానంలో సుమారు రూ.20 కోట్లతో క్రీడా పాఠశాలను ఏర్పాటుకు నిర్ణయించారు. తొలి విడతగా పది శాతం నిధులు మంజూరయ్యాయి. ఇంతలో కొందరు చేరగా, వారికి ఇబ్బంది లేకుండా విజ్జీ ప్రాంగణంలోనే ఒక తాత్కాలిక భవనాన్ని తీసుకొని తరగతులు సైతం ప్రారంభించారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. తరగతులు మాత్రం కొనసాగేవి. ఈక్రమంలో కరోనా రావడంతో విద్యార్థులను ఇళ్లకు పంపేశారు. ఇటీవల రాజీవ్‌ మైదానం వేదికగా మళ్లీ ప్రారంభించారు. నిధులు లేవని మళ్లీ ఆపేశారు.

తొలగింపు: విద్యాశాఖ ద్వారా ఇద్దరు ఉపాధ్యాయులను, క్రీడాశాఖ ద్వారా పలువురు శిక్షకులను తీసుకున్నారు. 2018లో పాఠశాల నిర్వహణ నిమిత్తం 11 మందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. తాజాగా జీతాలు ఇవ్వడానికి బడ్జెట్‌ లేదని ఈ 11 మందిలో ఏడుగురిని తొలగించారు.

ఇబ్బంది లేదు..

ప్రస్తుతానికి సెలవులు ఇచ్చాం. త్వరలోనే ప్రారంభిస్తాం. జీతాలు, బడ్జెట్‌ వివరాలను ఉన్నతాధికారులకు పంపించాం. ఇక నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగిస్తాం. పాఠశాల నిర్మాణానికి సంబంధించి కూడా స్పష్టమైన ఆదేశాలు రానున్నాయి. - ఎస్‌.వెంకటేశ్వరరావు, క్రీడా శాఖ ముఖ్య శిక్షకుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని