logo

‘మాలపల్లి’కి మంచి రోజులు

భారత జాతీయోద్యమ స్ఫూర్తితో ఆవిర్భవించిన మాలపల్లి నవలకు మంచి రోజులు వచ్చినట్టున్నాయని పలువురు సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు ఆనందించిన శుభ సందర్భం ఆదివారం గుంటూరు జాషువా విజ్ఞాన కేంద్రంలో జరిగింది.

Published : 06 Dec 2021 02:56 IST

ఉన్నవ దంపతుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న మాణిక్యవరప్రసాద్‌ తదితరులు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: భారత జాతీయోద్యమ స్ఫూర్తితో ఆవిర్భవించిన మాలపల్లి నవలకు మంచి రోజులు వచ్చినట్టున్నాయని పలువురు సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు ఆనందించిన శుభ సందర్భం ఆదివారం గుంటూరు జాషువా విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఒక వ్యక్తికి, ఒక సంస్థకు శతజయంతి ఉత్సవాలు, సంబరాలు జరగడం తెలిసిందే. ఒక పుస్తకానికి శతజయంతి జరగడం అరుదైన అంశం. అలా జరిగిందంటే ఆ పుస్తకంలోని అంశాలు సజీవమైనవని అక్కడికొచ్చిన వారంతా అనుభూతి చెండమే కారణం. సభ ముగిశాక కూడా చాలా సమయం ఆ ప్రాంగణంలోనే ఉండి మాలపల్లి, ఉన్నవల విశేషాలను చర్చించుకోవడం ఆ కార్యక్రమ విలువకు నిదర్శనం.
  మరో భగవద్గీతలా..
‘మాలపల్లి నవల సర్వకాల ప్రాధాన్యం, ప్రాసంగికత కలిగి ఉంది. శ్రీశ్రీ మహాప్రస్థానం, గుర్రం జాషువా గబ్బిలం, ఉన్నవ మాలపల్లి కలిపి ఒక పుస్తకంగా ప్రచురిస్తే దాన్ని భగవద్గీత, బైబిల్‌ లాగా అందరికీ పంచుతానని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. స్థానిక బ్రాడీపేట 2/7లోని జాషువా విజ్ఞాన కేంద్రంలో సాహిత్య అకాడమీ, అమరావతి సామాజిక అధ్యయన కేంద్రం సంయుక్త నిర్వహణలో ఆజాదీ కా అమృతోత్సవ్‌ సందర్భంగా మాలపల్లి నవల శతజయంతి ఉత్సవ సభ ఆదివారం జరిగింది. ప్రారంభ సభకు సుప్రసిద్ధ కవి కె.శివారెడ్డి అధ్యక్షత వహించారు. డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మాట్లాడుతూ గాంధీజీ సిద్ధాంతాలన్నిటినీ ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి నవలలోని పాత్రల్లో చూడొచ్చన్నారు. గాంధీ ఉన్నవలో ఆవహించి నవల రాసినట్టు కనిపిస్తుందన్నారు. గాంధీ సిద్ధాంతాలను నేటి సమాజం ఇంకా బాగా అర్థం చేసుకోవాలన్నారు. సమావేశంలో ఆంధ్రజ్యోతి సంసాదకుడు కె.శ్రీనివాస్‌ కీలకోపన్యాసం చేశారు.
సంస్కరణోద్యమ నిధి
మాలపల్లి నవల సంస్కరణోద్యమ నిధి లాంటిదని ప్రారంభ సమావేశానంతరం జరిగిన మూడు సమావేశాల్లోని వక్తలు వివరించారు. అనంతరం జరిగిన సమావేశానికి డాక్టర్‌ పాపినేని శివశంకర్‌ అధ్యక్షత వహించారు. వై.ఎస్‌.కృష్ణేశ్వరరావు ‘మాలపల్లి-తాత్విక, ప్రాపంచిక దృక్పథం’ అనే అంశంపై, పెనుగొండ లక్ష్మీనారాయణ ‘మాలపల్లి-సమకాలీన సమాజ చిత్రణం’ అనే అంశంపై, కొప్పర్తి వెంకటరమణమూర్తి ‘మాలపల్లి కులరహిత సమాజ చిత్రణ’ అనే అంశంపై ప్రసంగించారు. రెండో సమావేశంలో కాత్యాయనీ విద్మహే ‘తెలుగు సాహిత్యంలో బృహన్నవలలు మాలపల్లి స్థానం’, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ‘ప్రత్యామ్నాయ ప్రాపంచిక దృక్పథం-కక్కడు నుంచి జగ్గడు’ అనే అంశాలపై ప్రసంగించారు. తర్వాతి సమావేశానికి పి.ఎ.దేవి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ప్రజాకవి గోరటి వెంకన్న, విశిష్ట అతిథిగా ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు పాల్గొని మాలపల్లి నవల విలువలను, విశేషాలను వివరించారు. తొలుత ఉన్నవ దంపతుల చిత్రపటాన్ని సభకు శ్రీశారదానికేతనం పక్షాన డాక్టర్‌ కేవీ రంగనాయకమ్మ ఉన్నవ వంశానికి చెందిన హేమ సమర్పించారు. అతిథులు చిత్రపటానికి పూలమాలలు అలంకరించి నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని