logo

ఒకే ముఠా పనేనా!

విజయవాడ కమిషనరేట్‌లో రెండో పట్టణ, ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ల పరిధిలో దోపిడీ, యత్నం ఘటనల కేసుల్లో పురోగతి లేదు. ముఠాకు సంబంధించి వివరాలు దొరకలేదు. గతంలో ఈ తరహా ఘటనల్లో నిందితుల వేలిముద్రలతో సరిపోలలేదు.

Published : 06 Dec 2021 01:35 IST

మళ్లీ తెగబడే అవకాశం?
ఈనాడు, అమరావతి

గుంటుపల్లిలోని అపార్ట్‌మెంట్‌లోకి చొరబడుతున్న చడ్డీ గ్యాంగ్‌ (పాతచిత్రం)

విజయవాడ కమిషనరేట్‌లో రెండో పట్టణ, ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ల పరిధిలో దోపిడీ, యత్నం ఘటనల కేసుల్లో పురోగతి లేదు. ముఠాకు సంబంధించి వివరాలు దొరకలేదు. గతంలో ఈ తరహా ఘటనల్లో నిందితుల వేలిముద్రలతో సరిపోలలేదు. దీంతో కేసు ముందుకు సాగడం లేదు. పాల ఫ్యాక్టరీ సమీపంలోని అపార్ట్‌మెంట్లోని తాళం వేసిన ఓ ఫ్లాట్‌లో దొంగతనం చేశారు. సీసీ కెమెరాలోని దృశ్యాల ఆధారంగా నలుగురు పాల్గొన్నట్లు అంచనాకు వచ్చారు. గుంటుపల్లిలోని అపార్ట్‌మెంట్‌లోని మూడో ఫ్లోర్‌లో దోపిడీ యత్నంలో ఐదుగురు పాల్గొన్నారు. ఇక్కడ కూడా నిందితుల ఆనవాళ్లు నమోదయ్యాయి. వీటిని క్షుణ్ణంగా విశ్లేషించిన పోలీసులు రెండు చోట్లా ఒకే ముఠా తెగబడి ఉంటుందని భావిస్తున్నారు. ఘటనల్లోని ఫుటేజీల్లో ముగ్గురు దొంగలు రెండు చోట్లా పాల్గొన్నట్లు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు. వీరు స్థానికులా? లేక ఇతర రాష్ట్రాలకు చెందిన వారా? అన్నది స్పష్టంగా తేలలేదు.

* మొదటి ఘటనకు, రెండో దానికి మూడు రోజులు తేడా ఉంది. దీంతో మళ్లీ ఈ ముఠా ఏ ప్రాంతంలో తెగబడుతుందో అని అటు ప్రజలు, ఇటు పోలీసులు హడలుతున్నారు. వీరు ఇక్కడే మకాం వేశారా? లేక గస్తీ పెరిగిందని మరో చోటుకు వెళ్లారా? అన్నది అంతుచిక్కడం లేదు. రెండు ఘటనల్లో తెల్లవారుజామున 2 గంటల సమయంలో అపార్ట్‌మెంట్లలోకి చొరబడినట్లు రికార్డు అయింది. ఈ ప్రాంతాలు ఊరు చివర, దొంగతనం చేసి పారిపోవడానికి తేలికగా ఉన్నవే కావడం గమనార్హం. మళ్లీ ఈ ముఠా తెగబడితే శివారు ప్రాంతాలనే ఎంచుకునే అవకాశం ఉందన్న అంచనాతో పోలీసులు నిఘా పెంచారు. నున్న, సింగ్‌నగర్‌, భవానీపురం, గన్నవరం, పెనమలూరు, కంకిపాడు, ఇబ్రహీంపట్నం స్టేషన్ల పరిధిలోని అపార్ట్‌మెంట్ల వాచ్‌మెన్లు, నివాస ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

* అపార్ట్‌మెంట్ల వద్దకు వెళ్లి కాపలాదారులతో మాట్లాడుతున్నారు. రాత్రి సమయాలలో ముఖ్యంగా వేకువజామున మెలకువగా ఉండాలని, వెనుక వైపు నుంచి దొంగలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏదైనా అనుమానం వస్తే తమకు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని, చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయాలని సూచిస్తున్నారు. టార్చిలైట్‌తో ప్రధాన గేట్‌తో పాటు, వెనుక వైపు కూడా వెళ్లి తరచూ చూస్తుండాలని చెబుతున్నారు. మైకుల్లోనూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధారణంగా ఉండే గస్తీతో పాటు అదనంగా శివారు ప్రాంతాలకు సాయుధ బృందాలతో పహారాను పెంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు