Global NCAP: గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ ధ్రువీకరించిన భద్రమైన భారత కార్లివే..!

భారత్‌లో గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ రేటింగ్స్‌లో సత్తా చాటిన తొలి 10 కార్లలో ఏడు కేవలం రెండు కంపెనీలకు చెందినవే కావడం గమనార్హం...

Updated : 30 Jul 2022 16:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రయాణికుల భద్రతకు హామీనిచ్చేలా త్వరలో భారత్‌లోనూ కొత్త కారు మదింపు పద్ధతి భారత్‌ ఎన్‌క్యాప్‌ (New Car Assessment Programme)ను ప్రవేశపెడతామని ఇటీవల కేంద్రం ప్రకటించింది. క్రాష్‌ టెస్టింగ్‌ (Crash Test) ద్వారా కార్ల భద్రతా ప్రమాణాలను పరీక్షించి స్టార్‌ రేటింగ్‌ (Star Rating) ఇవ్వనున్నారు. అయితే, ఇప్పటికే గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌, యూరో ఎన్‌క్యాప్‌ పేరిట రేటింగ్‌ ఇస్తున్న అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. వీటిలో భారత్‌లో తయారైన కార్లూ మంచి రేటింగ్‌ పొందాయి.

(ఇదీ చదవండి: మన కార్లకు స్టార్ రేటింగ్‌ ఎప్పటి నుంచంటే..?)

భారత్‌లో గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ రేటింగ్స్‌లో సత్తా చాటిన తొలి 10 కార్లలో ఏడు కేవలం రెండు కంపెనీలకు చెందినవే కావడం గమనార్హం. జూన్‌ నాటికి ఉత్తమ రేటింగ్‌ పొందిన కార్లలో టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రాకు చెందినవే ఎక్కువ ఉన్నాయి. 10 కార్ల జాబితాలో టాటా పంచ్‌, ఎక్స్‌యూవీ300, ఆల్ట్రోజ్‌, నెక్సాన్‌, ఎక్స్‌యూవీ 700 ఉన్నాయి. ఇవన్నీ 5 స్టార్‌ రేటింగ్‌ పొందిన కార్లు. తర్వాతి ఐదు కార్లు 4 స్టార్‌ రేటింగ్‌ పొందాయి. ఈ జాబితాలో హోండా జాజ్‌, టయోటా అర్బన్‌ క్రూజర్‌, మహీంద్రా మరాజో, ఫోక్స్‌వ్యాగన్‌ పోలో, మహీంద్రా థార్‌ ఉన్నాయి. పిల్లల భద్రత విషయానికి వస్తే ఎక్స్‌యూవీ700 అత్యుత్తమైనదిగా నిలిచింది. తర్వాత థార్‌, పంచ్‌, ఎక్స్‌యూవీ300, టయోటా అర్బన్‌ క్రూజర్‌ ఉన్నాయి.

గ్లోబల్‌ ఎన్‌సీఏపీ యూకేలో స్వతంత్రంగా పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థ. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోని కార్లలో భద్రతా ప్రమాణాలను విశ్లేషించి మరింత మెరుగుపర్చేందుకు దీనిని 2011లో స్థాపించారు. ప్రమాద తీవ్రత పరీక్షల నిర్వహణ విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇది పనిచేస్తుంది. ఈ క్రమంలో వివిధ దేశాల నియంత్రణ సంస్థల ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొంటుంది.

ఈ సంస్థ 0-5 స్టార్‌ రేటింగ్స్‌ను ఇస్తుంది. పెద్దలు, పిల్లలు కూర్చొనే సీట్లకు లభించే భద్రతను లెక్కగడుతుంది. తయారయ్యే అన్ని కార్లు ఐక్యరాజ్య సమితి క్రాష్‌ టెస్ట్‌ ప్రమాణాలను దాటేట్లు చూడటం, పాదచారులకు భద్రతను కల్పించేలా మార్పులు, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ను ప్రోత్సహించడం వంటివే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గ్లోబల్‌ ఎన్‌సీఏపీ వెబ్‌సైట్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని