Ola Electric: ఈవీ రేస్‌: నాలుగో స్థానానికి ఓలా.. టాప్‌లో ఎవరంటే?

electric scooters: జూన్‌ నెలకు సంబంధించి విద్యుత్‌ వాహన రిజిస్ట్రేషన్ల డేటాను ‘వాహన్‌’ వెలువరించింది. ఇందులో ఒకినావా  (Okinawa) టాప్‌ ప్లేస్‌లో నిలిచింది.

Published : 02 Jul 2022 16:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చమురు ధరలు పెరగడం.. ప్రభుత్వం ఇచ్చే రాయితీ పెరగడం.. ఎలక్ట్రిక్‌ వాహనాల (electric scooters) ధరలు తగ్గుముఖం పట్టడం వంటి కారణాలతో ప్రజల్లో విద్యుత్‌ వాహనాలపై మోజు పెరుగుతోంది. దీనికి అనుగుణంగా ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు సైతం అందుబాటులోకి వస్తుండడంతో వీటి కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో విద్యుత్‌ వాహనాలు తయారు చేసే కంపెనీలు విరివిగా పుట్టుకొస్తున్నాయి. దీంతో వాటి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తాజాగా వీటి మధ్య ఏ స్థాయిలో పోటీ ఉందో తెలిపే గణాంకాలు విడుదలయ్యాయి. జూన్‌ నెలకు సంబంధించి విద్యుత్‌ వాహన రిజిస్ట్రేషన్ల డేటాను ‘వాహన్‌’ వెలువరించింది. ఇందులో ఒకినావా  (Okinawa) టాప్‌ ప్లేస్‌లో నిలిచింది.

విడుదలకు ముందే సంచలనాలకు మారుపేరుగా నిలిచిన ఓలా ఎలక్ట్రిక్‌ ఈ రేసులో వెనుకబడింది. జూన్‌ నెలలో 5,753 వాహన రిజిస్ట్రేషన్లతో నాలుగో స్థానానికి పరిమితమైంది. ఏప్రిల్‌ వరకు తొలి స్థానంలో కొనసాగిన ఈ కంపెనీ.. మే నెలలో తొలిసారి అగ్రస్థానాన్ని కోల్పోయి రెండో స్థానానికి పరిమితమైంది. మే నెలతో పోలిస్తే జూన్‌లో ఈ కంపెనీ రిజిస్ట్రేషన్లు మరింత పడిపోవడంతో నాలుగో స్థానానికి చేరింది. ఈ విషయంలో 6,782 రిజిస్ట్రేషన్లతో ఒకినావా తొలి స్థానం దక్కించుకుంది. ఏంపియర్‌ (6,199), హీరో ఎలక్ట్రిక్‌  (6,049) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఏథర్‌, రివోల్డ్‌, ప్యూర్‌ ఈవీ, బెన్లింగ్‌.. ఓలా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొత్తం 8 కంపెనీల జాబితాను వాహన్‌ పోర్టల్‌ ప్రచురించింది. బజాజ్‌ ఆటో, టీవీఎస్‌ ఈ జాబితాలో లేవు.

ఇక కంపెనీల విషయాన్ని పక్కనపెడితే జూన్‌ నెలలో మొత్తం 32,807 విద్యుత్‌ వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. మే నెలలో ఈ సంఖ్య 32,680. కంపెనీల మధ్య పోరు తీవ్రంగా ఉన్నప్పటికీ.. వాహనాల సంఖ్యలో మాత్రం పెద్దగా పెరుగుదల కనిపించ లేదు. ఇటీవల విద్యుత్‌ వాహన బ్యాటరీలు కాలిపోతున్న ఉదంతాల వల్ల వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు జంకుతున్నారని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఉదంతాల నేపథ్యంలో బ్యాటరీల్లో లోపాలను నిగ్గు తేల్చేందుకు కేంద్రం ఓ కమిటీని నియమించింది. కొన్ని కంపెనీలు భద్రతను పెద్దగా పట్టించుకోవడం లేదని కేంద్రం దృష్టికొచ్చింది. మరికొన్ని కంపెనీలు తక్కువ ధరకే వాహనాలను అందించేందుకు నాసిరకం బ్యాటరీలను వినియోగిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు