ఒక్కో టాప్‌కూ ఒక్కో పలాజో! - Sunday Magazine
close

ఒక్కో టాప్‌కూ ఒక్కో పలాజో!

జీన్సూ, పటియాలా, లెగ్గింగూ, జెగ్గింగూ... అంటూ ఫ్యాషన్‌ రంగంలో రెడీమేడ్‌ ప్యాంటు రకరకాల రూపాలెత్తుతూ వస్తోంది.  ఆ మార్పులో భాగంగానే పలాజో ప్యాంటూ వచ్చి చేరింది. అయితే కాస్త భిన్నంగా ఉండే ఈ పలాజో మిగతా వాటిలా పాత ట్రెండ్‌ జాబితాలోకి వెళ్లిపోకుండా నయా లుక్కుతో నేటితరాన్ని మెప్పించడానికి ఎప్పటికప్పుడు బోలెడన్ని వెరైటీల్లో దొరికేస్తోంది.

డ్రెస్‌ స్టైలిష్‌గా కనిపించడమే కాదూ సౌకర్యవంతంగానూ ఉండాలనుకునేవారి మొదటి ఛాయిస్‌ కచ్చితంగా పలాజోనే అని చెప్పుకోవచ్చు. అందుకే ఈ ప్యాంటు మార్కెట్లోకి వచ్చిన దగ్గర్నుంచీ హాట్‌ ఫ్యాషన్‌గానే ఉంది. వీటిల్లోనే క్యాజువల్‌ వేర్‌తోపాటూ పార్టీలకూ, ప్రత్యేక వేడుకలకూ వేసుకెళ్లేలా ఎన్నో డిజైన్లు ఉన్నాయి. ఫ్యాషన్‌ ఫాలోవర్స్‌కి ఏట్రెండ్‌ అయినా సరే, కొంతకాలానికి బోర్‌కొట్టేస్తుందనే ఉద్దేశంతో ఫ్యాషన్‌ నిపుణులు కొత్తకొత్త మోడల్‌ డ్రెస్సుల్ని తీసుకొస్తుంటారు. అలా వచ్చిన లెగ్గింగూ, పటియాలా... వంటి ప్యాంట్లకి ఎక్కడో ఒక దగ్గర ఫుల్‌స్టాప్‌ పడిందేమో కానీ పలాజో విషయంలో మాత్రం అలా జరగ లేదు. ఈతరం అవసరాల్ని బట్టి ఒక మోడల్‌ తర్వాత ఒకటి చేరుతూ వస్తోంది.

కుర్తీ, అనార్కలీ, టీషర్టూ, మోడ్రన్‌ టాప్సూ, చొక్కాలూ... ఇలా పైన వేసుకునే దుస్తుల్లో ఎన్నో వెరైటీలున్నట్టే ఈ పలాజోల్లోనూ చాలా రకాలు వచ్చేశాయి. పొట్టి టాప్‌కి జోడీగా మామూలు పలాజో ప్యాంటు ఏం బాగుంటుంది మీరే చెప్పండి. అందుకే దాని కింద కాస్త ట్రెండీగా ఉండే బెల్ట్‌ పలాజో వేసుకుంటే లుక్కు అదిరిపోతుంది. అదే పొడవైన లాంగ్‌ ఫ్రాక్‌కి స్కర్ట్‌ పలాజో జత చేశారంటే క్లాసిక్‌ కాంబినేషన్‌లా మారిపోయి చూడ్డానికి అందంగా కుర్తీస్కర్టులా కనిపించకుండా ఉంటుందా!

పైగా ఇదైతే మామూలు స్కర్ట్‌ కన్నా నడవడానికి వీలుగా ఉంటుందనడంలో సందేహం లేదు. వదులుగా జాలువారుతూ కుచ్చులు కుచ్చులతో ఉండే ఫ్రిల్డ్‌ పలాజో సాదా టాప్‌కి కూడా కొత్తదనాన్ని తెచ్చిపెట్టేస్తుంది. మోకాలు కిందవరకూ ఉండే దుస్తులకి ధోతీ పలాజోనీ ఎంచుకుంటే చక్కగా కనిపించదూ! వీటితోపాటూ సంప్రదాయ కుర్తీలకూ, ట్రెండీ షర్టులకూ సరిపోయే స్లిట్‌, రాప్‌ పలాజోలూ ఉన్నాయి. క్రేప్‌, డెనిమ్‌, లెనిన్‌, శాటిన్‌, సిల్క్‌, జార్జెట్‌, కాటన్‌... ఇలా ఎన్నో రకాల క్లాతుల్లో విభిన్నమైన ప్రింట్లలో ఆకట్టుకుంటున్నాయి. కావాలంటే మన టాప్స్‌కి మ్యాచింగ్‌గా విడిగా దొరికే పలాజోల్ని తీసుకుని సెట్‌ చేసుకోవచ్చు. లేదంటే టాప్‌తో కలిపి సెట్లలా అందుబాటులో ఉన్న వాటినీ ఎంచుకోవచ్చు. ఇంతకీ మీ దగ్గర ఎన్నిరకాల పలాజోలున్నాయి మరి!

Advertisement

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న