విభిన్న ఇతివృత్తాలు - Sunday Magazine
close

విభిన్న ఇతివృత్తాలు

మకాలీనత ఉన్న సాంఘిక ఇతివృత్తం ఒకటి. పౌరాణిక ఘట్టాలను ఆధునిక దృక్పథంతో మలిచిన వస్తువు మరొకటి... రెండు నాటకాలూ ఆలోచింపజేస్తాయి. ప్రపంచీకరణతో సమాజంపై జరుగుతున్న ‘దాడి’ ఎంత తీవ్రమైనదో మొదటిది శక్తిమంతంగా చెప్తుంది. నిస్సహాయతతో ఓ యువకుడు బలవన్మరణానికి సిద్ధపడితే దాన్ని రియాలిటీ షోగా వ్యాపార ప్రయోజనానికి వాడుకునే అమానవీయతను తేటతెల్లం చేస్తుంది. సాటి మనిషి విషాదంలో ఆనందం వెతుక్కునే క్షీణ సమాజ పోకడపై విమర్శనాస్త్రమిది. అందరికీ తెలిసిన ‘దేవయాని’ కథను కొత్త కోణంలో చెప్పారు. స్త్రీల ఔన్నత్యాన్నీ, గురువుల ఘనతనూ గొప్పగా చిత్రించారు. రెండు రచనల్లోనూ నాటకీయతా, సముచిత సంభాషణలూ, పాత్రల చిత్రణలో భావోద్వేగాలూ ఆకట్టుకుంటాయి.

- సీహెచ్‌.వేణు

దాడి, దేవయాని(నాటకాలు)
రచన: సింహప్రసాద్‌
పేజీలు: 156; వెల: రూ. 80/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


రచయిత్రి జ్ఞాపకాలు

ప్రఖ్యాత ఉర్దూ రచయిత్రి జీలానీ బానూ తన బాల్యం, నాటి సాహిత్య వాతావరణం గురించి వివరించిన పుస్తకం ఇది. యూపీ నుంచి హైదరాబాద్‌ వచ్చి స్థిరపడిన కవీ పండితుడూ అయిన తండ్రి హైరత్‌ బదాయూనీకి కైఫీ ఆజ్మీ, మజ్రూహ్‌ సుల్తాన్‌పురీ, షకీల్‌ బదాయూనీ, మఖ్దూం మొహియుద్దీన్‌ లాంటి హేమాహేమీలందరూ స్నేహితులు. వారు తమ ఇంటికి వచ్చి సాహిత్యచర్చలూ విందుల్లో పాల్గొనడం వాళ్లను అనుకరించడానికి పిల్లలు ప్రయత్నించడం, గజళ్లతో అంత్యాక్షరీ ఆడుకోవడం లాంటి విషయాలెన్నో ఇందులో ఉన్నాయి. ఆడపిల్లల మీద ఆంక్షల్ని చూస్తూ పెరిగిన తనలో చిన్ననాటి నుంచే ప్రశ్నించే ధోరణి అలవాటై సృజనాత్మక సాహిత్యంవైపు మళ్లించిన తీరును ఆసక్తికరంగా చెప్పారు రచయిత్రి.

- శ్రీ

తెరిచిన పుస్తకం
రచన: జీలానీ బానూ
అనువాదం: మెహక్‌ హైదరాబాదీ
పేజీలు: 91; వెల: రూ. 105/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


ఉత్కంఠభరితం

ప్రముఖ వైద్యుడు రమేశ్‌చంద్రని కలుసుకోవడానికి లండన్‌ నుంచి వచ్చిన ప్రచురణకర్త రిచర్డ్‌ విమానాశ్రయం దగ్గరే హత్యకు గురవుతాడు. పోలీసులు ఆ కేసు పరిష్కరించవలసిందిగా డిటెక్టివ్‌ ఇంద్రజిత్‌ను కోరతారు. హంతకుడికి సంబంధించి లభించిన ఒకే ఒక్క క్లూ- అతడు మామూలు మనిషి కాదనీ, అడవి మనిషి కావచ్చనీ. నెల్లూరు నుంచి వైద్యం కోసం మద్రాసు వచ్చిన శంకర్రావు హఠాత్తుగా మాయమవుతాడు. అతడు సంతకం చేసిన చెక్కుల ద్వారా బ్యాంకు నుంచి డబ్బు డ్రా అవుతూనే ఉంటుంది. ఒక రిటైర్డు జడ్జి ఇంటి ఆవరణలో గొరిల్లాలాంటి ఒక భయంకర ఆకారం కనిపించి భయపెడుతుంది. ఈ వరస సంఘటనలన్నిటికీ లింకు ఏమిటీ, ఇంద్రజిత్‌ వాటిని ఎలా పరిష్కరించాడూ అన్నదే ఉత్కంఠగా చదివించే ఈ నవల. 

 - పద్మ

ఇంద్రజిత్‌ (డిటెక్టివ్‌ నవల)
రచన: కనకమేడల
పేజీలు: 351; వెల: రూ. 275/-
ప్రతులకు: ఫోన్‌- 8522002536


వందేళ్ల ఉత్తరాంధ్ర చరిత్ర!

చరిత్రని సృజన సాహిత్యంలోకి తేవడమంటే ఓ ఏనుగుని మచ్చిక చేసుకోవడంలాంటిదే! అదీ సామాన్యుల కోణంలో- వారి సామాజిక రాజకీయ సాంస్కృతిక అంశాలని సృశిస్తూ రాయడమంటే ఓ మావటీడుకున్నంత ఓపికా సాహసమూ ఉండాలి. తనదైన కథాకథనాలూ పాత్ర నిర్మాణాలనే అంకుశంతో ఆ ఏనుగుని నవలగా బంధించి మన కళ్లముందుంచారు రచయిత. వందేళ్ల ఉత్తరాంధ్ర చరిత్రని నారాయుడు, రాధేయ కుటుంబాల ద్వారా అక్షర చిత్రంలా గీసి చూపారు. శ్రీకాకుళం ఉద్యమానికి అటూ-ఇటూ యాభై ఏళ్ల సామాజిక చరిత్రని ఈ నవలలో చూడొచ్చు. భూస్వామ్యానికి వ్యతి
రేకంగా పిడికిలి బిగించిన సామాన్య జనాన్ని... ముందుకు నడిపించాల్సిన పోరాట రాజకీయాలు నీరుగారిపోయే విషాద దృశ్యం ఇందులో ఉంది. 1990ల తర్వాతి ప్రలోభ రాజకీయాలు అభివృద్ధి పేరుతో ప్రజల్ని మానసికంగా నిర్వీర్యం చేసిన విధ్వంసానికీ సాక్ష్యం
ఇది!

  - అంకిత


 

బహుళ (నవల)
రచన: అట్టాడ అప్పల్నాయుడు
పేజీలు: 467; వెల: రూ. 300/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు.


Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న