ఇవి.. కేకు ‘మొక్క’లు! - Sunday Magazine
close

ఇవి.. కేకు ‘మొక్క’లు!

పచ్చని మొక్కలన్నా రంగురంగుల్లో విరిసే పువ్వులన్నా ఇష్టపడని వాళ్లుండరు. అయితే వాటిని చూసి ఆనందిస్తారేగానీ అందంగా ఉంది కదాని ఆ కుండీలోని మట్టినో లేదా పూలకొమ్మనో కోసుకుని తినరు కదా. కానీ ఈ మొక్కల్నీ కుండీల్నీ అందులోని మట్టినీ ఎంచక్కగా తినొచ్చు. ఎందుకంటే ఇవి మొక్కల్లాంటి కేకులు!

సింధు పుట్టినరోజు... బంధువులూ స్నేహితులూ ఫోనులో విషెస్‌ చెప్పారు. కొందరు బహుమతులు పంపిస్తే, మరికొందరు స్వయంగా తెచ్చారు. అయితే వాటన్నింటిలోకీ తన బెస్ట్‌ ఫ్రెండ్‌ బిందు తెచ్చిన కానుక మీదే సింధు చూపు నిలిచిపోయింది. ఎందుకంటే అది ఆమెకెంతో ఇష్టమైన కెలాడియం క్రోటన్‌ మొక్క. అవునండీ, సింధుకి మొక్కలంటే ప్రాణమని తెలిసిన ఆమె ఫ్రెండ్‌ ఈసారి ఆ మొక్కని తెచ్చి ఇచ్చింది. సింధు ఆనందానికి అంతే లేదు. అయితే దాన్ని అక్కడున్న టీపాయ్‌మీద పెట్టి, ఆ కుండీలోని మట్టిలో క్యాండిల్స్‌ గుచ్చి, చేతికి ఓ చిన్న చాకు కూడా ఇచ్చి ‘కట్‌ చెయ్యి’ అంది బిందు. ‘మొక్కని కోయమంటుందేమిటా’ అనుకుంటూ దగ్గరకు వెళ్లింది సింధు. అప్పుడుగానీ అర్థం కాలేదు... అది నిజం మొక్క కాదు, కేకు అని. అప్పటికీ ఓ పట్టాన నమ్మలేకపోయింది సరికదా, ఆ కేకుని కోయడానికి ఎంతకీ మనసు రాలేదు. అందరి కోరిక మేరకు ఎట్టకేలకు ఆ కేకు కళాకారులకు హ్యాట్సాఫ్‌ చెబుతూ ఆ కుండీని కోసింది సింధు. ఒక్క సింధు అనే కాదు, ఈ కేకు మొక్కల్ని చూసి ఆశ్చర్యపోతున్న వాళ్లెందరో.

అవునుమరి, ఆకాశానికి అంచుల్లేనట్లే కళాకారుల సృజనకీ హద్దుల్లేవు. అందునా బేకరీ ఆర్టిస్టులు చేస్తోన్న ప్రయోగాలు ఒకటీ రెండూ కాదు... వేనవేల రూపాల్లో కేకుల్ని అత్యద్భుతంగా రూపొందిస్తున్నారు. అసలివి కేకులేనా అన్నట్లు చేస్తోన్న ఆ జాబితాలోకి ఇప్పుడు పచ్చని ప్రకృతీ చేరిందన్నమాట. పెరట్లో అందంగా కనిపించే పూలమొక్కలూ ఇంటిలోపల పెంచుకునే క్రోటన్లూ ముచ్చటపడి పెంచే బోన్సాయ్‌ చెట్లూ ఖరీదైన ఆర్కిడ్‌ ప్లాంట్లూ... ఇలా కోరిన రూపాల్లో కేకుల్ని తయారుచేస్తూ ఉద్యానప్రియుల్ని అలరిస్తున్నారు. కుండీ, అందులోని మట్టి నుంచి మొక్క వరకూ అన్నీ తినేవే. బేస్‌ కేకు కుండీ లోపల ఉంచి, దాని పైన ఓరియో బిస్కెట్లనీ చాక్లెట్టు కేకునీ పొడిలా చేసి వేస్తే అది అచ్చం మట్టిలానే ఉంటుంది. ఇక కుండీ పై భాగంతోపాటు పచ్చని మొక్కలూ పువ్వులూ అన్నీ సేంద్రియ రంగులూ, పంచదార, జెలాటిన్‌, క్రీమ్‌, వెన్న, మొక్కజొన్న సిరప్‌ కలిపి చేసినవే కాబట్టి హాయిగా చప్పరించేయవచ్చన్నమాట. కొందరయితే పంచదారకు బదులు అల్యులోజ్‌, స్వెర్వ్‌, స్ల్పెండా... వంటి జీరో క్యాలరీ స్వీటెనర్లనీ వాడుతున్నారు. మరి ఈ రకమైన కేకులతో మనకిష్టమైనవాళ్లని సర్‌ప్రైజ్‌ చేసేద్దామా?!

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న