అలంకరణకు పూల అక్షరాలు! - Sunday Magazine
close

అలంకరణకు పూల అక్షరాలు!

పుట్టినరోజు, పెళ్లిరోజు... లాంటి వేడుకలకు ఇంట్లోనే మనకు తోచినట్లూ అలంకరించుకుంటాం. కానీ ఏదో మామూలు డెకరేషన్‌ కన్నా అది పుట్టిన రోజు చేసుకుంటున్న వారికోసమే ప్రత్యేకంగా చేసినట్లూ ఉండాలంటే ఈ ‘ఫ్లవర్‌ లెటర్‌ లైట్లు’ ఉండాల్సిందే. వేరు వేరు ఆంగ్ల అక్షరాల ఆకారంలో ఉండే ఈ లైట్లలో సహజమైన పువ్వుల్లానే ఉండే సిల్క్‌ పూలను అమర్చుతారు. వాటి వెనుక లైట్లు ఉంటాయి. కాబట్టి కావల్సిన పేరు వచ్చే అక్షరాలను కొని అలంకరిస్తే అటు పూల అందాలూ ఇటు లైట్ల కాంతులూ కలగలిసి ఆత్మీయుల కళ్లు వెలుగులీనేలా చేస్తాయి. ఇవి చిన్నారుల ఫొటో షూట్‌లకు కూడా చాలా బాగుంటాయి.


కూల్‌డ్రింక్‌ సువాసనలతో లిప్‌బామ్‌!

లిప్‌బామ్‌లో రకరకాల పరిమళాలను వెదజల్లేవి ఎన్నో వచ్చాయి. వాటిలో సరికొత్తవే ఈ ‘కూల్‌డ్రింక్‌ ఫ్లేవర్డ్‌’ లిప్‌బామ్‌లూ లిప్‌స్టిక్‌లూ. కోకాకోలా, పెప్సీ, ఫాంటా, మౌంటెయిన్‌ డ్యూ... లాంటి శీతలపానీయాల సువాసనలతో వచ్చే ఈ లిప్‌బామ్‌లు చూడ్డానిక్కూడా అచ్చం బుల్లి బుల్లి కూల్‌డ్రింక్‌ బాటిళ్లలా ఉంటాయి. మరికొన్ని మామూలు లిప్‌స్టిక్‌లానే ఉన్నా వాటిమీదా ఆయా శీతలపానీయాల బ్రాండ్‌ పేర్లు ఉండడంతో పాటు, అయిదారు లిప్‌బామ్‌లు కలిపి ఒక పెద్ద కూల్‌డ్రింక్‌ టిన్‌లో వస్తుంటాయి. ఇవి మనదగ్గరా ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి.


ఈ ఫ్యాన్‌ చాలా స్మార్ట్‌

హాక్సన్‌... బ్లేడుల్లేకుండా సన్నటి గొట్టంలా ఉండే ఈ ఎయిర్‌ ఫ్యానుని గోడకు అమర్చుకోవచ్చు. కావాల్సినప్పుడు తీసి, టేబుల్‌ ఫ్యానులా అవసరమైన చోట నిలబెట్టుకోనూ వచ్చు. రిమోట్‌ లేదా నోటిమాట ద్వారా ఆన్‌, ఆఫ్‌ చేసుకోగలిగే హాక్సన్‌ ఫ్యాను నుంచి చల్లటి లేదా వేడి గాలి ఏది కావాలంటే అది వస్తుంది. అంతేకాదు, ఇది ఎయిర్‌ ప్యూరిఫయర్‌గానూ బెడ్‌లైట్‌గానూ కూడా పనిచేస్తుంది. లైటు వెలుతురుని పెంచి, తగ్గించుకునే వీలూ ఉంది. ఇక, బ్లూటూత్‌తో పనిచేసే దీని స్పీకర్‌తో ఎంచక్కా ఫోన్‌ మాట్లాడుకోవచ్చు, సంగీతమూ వినొచ్చు. ఇది అలారంలానూ పనిచేస్తుంది. వావ్‌ అనిపిస్తోంది కదూ..


రోబో అసిస్టెంట్‌!

మనం ఇంట్లో లేనప్పుడు ఇంటిని చూసుకునేందుకూ ఏ వంట పనిలోనో ఉన్నప్పుడు హాల్లో ఆడుకుంటున్న పిల్లల్ని కనిపెట్టుకుని ఉండేందుకూ... ఇలా రకరకాల పనులు చేసేందుకు ఎవరైనా మనతోనే ఉంటే బాగుంటుంది కదా... ఆ పనులన్నిటినీ ఎంతో బాగా చేసేస్తుందట అమెజాన్‌ సంస్థ రూపొందించిన ఆస్ట్రో రోబో. చూడ్డానికి మరుగుజ్జు మనిషిలా ఉండే ఈ రోబో తల భాగంలో ఉండే పదంగుళాల టచ్‌ స్క్రీన్‌ కావాలనుకున్నప్పుడు ఫోన్‌లానూ మారిపోతుంది. నోటితో చెబితే చాలు, ఇది ఎవరికైనా వీడియో కాల్‌ చేసేస్తుంది. అంతేకాదు, సెన్సర్లతో పనిచేస్తూ ఇంట్లో మనం ఎటు వెళ్తే అటు వెంటే తిరుగుతుంది కాబట్టి, ఎంచక్కా పనులు చేసుకుంటూనే వీడియోకాల్‌ మాట్లాడేయొచ్చు. సంగీతమూ వినొచ్చు. ఇందులో సినిమాలూ చూడొచ్చు. దీన్ని చిన్నపిల్లల దగ్గర ఉంచితే వాళ్లు పక్కకు వెళ్తుంటే వెంటనే మనల్ని అప్రమత్తం చేస్తుంది. అంతేకాదు, మనం ఇంట్లో లేనప్పుడు ఇంట్లో ఏదైనా అలికిడి అయితే, ఆ చోటుకి వెళ్లి అక్కడి దృశ్యాన్ని చూపిస్తూ యజమానికి వీడియోకాల్‌ చేసేస్తుంది ఆస్ట్రో. ఇక, వంటగదిలో ఉండి, దీని వెనక ఉండే బుట్టలో కూల్‌డ్రింకుల్లాంటివి పెట్టి అతిథులకు ఇచ్చి రమ్మంటే అదే తీసుకెళ్లిపోతుంది. ఇలా పగలంతా రకరకాల పనులు చేశాక, రాత్రి దాని చోటుకెళ్లి చార్జ్‌ చేసుకుంటుంది ఈ రోబో.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న