చీర కొంటే మ్యాచింగ్‌ నగలు ఫ్రీ! - Sunday Magazine
close

చీర కొంటే మ్యాచింగ్‌ నగలు ఫ్రీ!

చీరకు నప్పే జాకెట్‌ ఉంటే సరిపోతుందా... వాటికి మ్యాచింగ్‌ గాజులు, నెక్లెస్‌, పోగులు ఉంటేనే కదా అసలు ఫ్యాషన్‌ అంటారు ఈతరం భామలు. అలాంటి వారికోసమే ఇప్పుడు చీరాజాకెట్‌తో పాటు మ్యాచింగ్‌ ఆభరణాలూ ఓ సెట్‌గా వచ్చేస్తున్నాయి.
బంగారు నగలు ఎన్ని ఉన్నా రోజువారీ ఆఫీసులకూ చిన్న చిన్న పార్టీలకూ ఫంక్షన్లకూ వాటిని మరీ ఎక్కువ వేసుకెళ్లలేం. అవి సంప్రదాయ వేడుకలూ పండుగలకే ఎక్కువ బాగుంటాయి మరి. రోజువారీకి సింపుల్‌గా కాస్త ట్రెండీగా చీరను కట్టుకోవాలనుకుంటే దానికి మ్యాచింగ్‌గా ఉండే ఫంకీ నగలు పెట్టుకుంటేనే అందంగా ప్రత్యేకంగా కనిపిస్తాం. అందుకే, ఫ్యాషన్‌ని ఫాలో అయ్యే అమ్మాయిలు ‘చీర కట్టాలంటే మ్యాచింగ్‌ జ్యువెలరీ ఉండాల్సిందే’ అంటారు. పార్టీలూ ఫంక్షన్లకు వెళ్లాలంటే అవి మరీ తప్పనిసరి.

ఒకప్పుడు చీర కొని దానికి మ్యాచింగ్‌ జాకెట్‌ కోసం చూసుకునేవారు. ఇప్పుడు జాకెట్లు ఎలాగూ చీరలోనే వచ్చేస్తున్నాయి కాబట్టి అదో సమస్య కాదు. లేదంటే నచ్చినట్లు డిజైనర్‌ జాకెట్లను కుట్టేందుకు లెక్కలేనన్ని బొటిక్‌లు ఉండనే ఉన్నాయి. అసలు ఇబ్బందంతా ఆ చీరకు సరిగ్గా సరిపోయే ఆభరణాలు కొనుక్కోవడమే. కానీ ప్రతి చీరకూ అలా కొనాలంటే ముందు అంత సమయం ఉండదు. ఏదోలా ప్రయత్నించినా అచ్చం ఆ చీరా జాకెట్లలోని రంగులతోనే ఫంకీ నగలు దొరకడం అంటే మామూలు విషయం కాదు. ప్రయత్నిస్తుంటే ఎప్పటికో అనుకోకుండా దొరకాల్సిందే. అమ్మాయిల ఈ ఫ్యాషన్‌ కష్టాన్ని తీర్చేందుకే అన్నట్లు కొన్ని దుకాణాలు ఇప్పుడు చీరలతో పాటు మ్యాచింగ్‌గా ఫంకీ నగల్నీ జత చేరుస్తున్నాయి. వీటికి విడిగా డబ్బులు చెల్లించాల్సిన పనీ లేదు. దీన్లో వాళ్ల చీరల అమ్మకాలను పెంచుకోవాలనే ఆలోచన కూడా ఉందనుకోండీ.

అవే రంగులతో...
కాటన్‌, రా సిల్క్‌, లినెన్‌ తరహా ఫ్యాన్సీ చీరలకు మ్యాచింగ్‌గా వస్తున్న ఈ నగల సెట్‌లలో అచ్చంగా ఆయా రంగుల్లోనే ఉండేలా సిల్కు దారాలతో చేసినవి ఒకరకం. అలా కాకుండా చెక్క లేదా టెర్రకోట పూసలకు సరిగ్గా చీర లేదా బ్లౌజుకి నప్పేలా రూపొందించినవి మరోరకం. వీటిలో నెక్లెస్‌తో పాటు, గాజులు, చెవి దుద్దులు కూడా వస్తున్నాయి. ఇక, లినెన్‌ చీరల్లాంటి వాటికైతే ఆక్సిడైజ్డ్‌ సిల్వర్‌తో చేసిన నగల్నీ జత చేస్తున్నారు. ఈ చీరా నగల సెట్‌లు ఆన్‌లైన్‌లోనూ దొరుకుతున్నాయి. ఇంకెందుకాలస్యం... మీరూ చూడండి ఓసారి.

 

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న