గులాబీ రంగులో తాగేస్తున్నారు! - Sunday Magazine
close

గులాబీ రంగులో తాగేస్తున్నారు!

కొన్ని రంగులు చూడ్డానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. వాటిని చూసినప్పుడు తెలియకుండానే ఏదో ఆనందం, ఉత్సాహం కలుగుతాయి. అది తినేవాటికీ చక్కగా సరిపోతుందనీ ముఖ్యంగా గులాబీరంగు జ్యూస్‌లూ పానీయాలూ తీసుకుంటే ఎంతో శక్తిమంతంగానూ ఆనందంగానూ ఫీలవుతారనీ చెబుతున్నాయి తాజా పరిశీలనలు. అందుకే ఈమధ్య అనేక కంపెనీలు తమ ఉత్పత్తుల్ని గులాబీ రంగులో తయారుచేసేస్తున్నాయ్‌.

పండ్లన్నీ ఎక్కువగా ఎరుపూ పసుపూ లేదా నారింజ రంగులోనే కదా ఉంటాయి. వాటితో చేసిన జ్యూస్‌ కూడా ఆయా రంగుల్లోనే ఉంటుంది. కానీ ఈ గులాబీ రంగు ఎలా వచ్చిందబ్బా అనిపిస్తోంది కదూ. నిజమే కానీ పుచ్చ, బొప్పాయి, డ్రాగన్‌, ద్రాక్ష, నిమ్మ, గ్రేప్‌ ఫ్రూట్‌, బెర్రీలూ, జామ... వంటి పండ్లలో ఆ వర్ణంలో పండేవీ ఉన్నాయి. వాటితోనే ఈ గులాబీరంగు జ్యూసుల్నీ తయారుచేసేస్తున్నారు. రెండుమూడు రకాల జ్యూస్‌లు కలపడం ద్వారానూ ఎనర్జీ డ్రింకుల్ని ఆ రంగులోకి మార్చేస్తున్నాయి కొన్ని కంపెనీలు.
ఇంతకీ గులాబీవర్ణమే ఎందుకూ అంటే... ఆ రంగు పానీయాన్ని తాగినవాళ్లు ఒకలాంటి హాయిని పొందడంతోపాటు ఉత్సాహంతో పనిచేయడాన్ని అమెరికాలోని వెస్ట్‌ మిన్‌స్టర్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు గమనించారట. ఆటలు ఆడేవాళ్లూ ఈ రంగు కాఫీ, టీ, పాలు లేదా జ్యూస్‌, షర్బత్‌ ఏది తాగినా అలసట అంతా మరిచి ఆనందంగా ఆడతారని చెబుతున్నారు. పైగా మిగిలిన వాటిలానే ఆ రంగు పండ్లలోనూ ఆంథోసైనిన్లూ పీచూ... వంటి పోషకాలనేకం ఉంటాయి. ఫినాలిక్‌ ఆమ్లం, బీటాసైనిన్‌... వంటివి రక్తప్రసరణను మెరుగుపరచడంతోపాటు చక్కెరనిల్వల్నీ తగ్గిస్తాయి. దాంతో న్యూట్రాసూటికల్స్‌ కంపెనీలు ఈ రంగులోనే ముఖ్యంగా డ్రాగన్‌ పండుతోనే ఎనర్జీ డ్రింకుల్ని రూపొందించే పనిలో పడ్డాయి. స్టార్‌బక్స్‌ ఇప్పటికే జ్యూస్‌, లాటె కా,ˆ టీ... వంటివెన్నో తయారుచేస్తోంది. పైగా కొబ్బరిపాలూ స్ట్రాబెర్రీ, అకై బెర్రీల్ని కలిపిన రిఫ్రెషింగ్‌ డ్రింక్‌కి ఇన్‌స్టాలో లైక్‌లు రావడంతో పింక్‌ క్రేజ్‌ మరీ ఎక్కువైంది.

ఇక, పింక్‌ కలర్‌ లెమనేడ్‌ అయితే 19వ శతాబ్దం నుంచీ వాడుకలో ఉంది. అప్పట్లో అమెరికాలోని ఓ సర్కస్‌ కంపెనీ స్టాల్‌కి చెందిన బంక్‌ అలెన్‌ ఓసారి నిమ్మరసంతో షర్బత్‌ చేస్తున్నప్పుడు- దాల్చినచెక్కతో చేసిన క్యాండీలు కొన్ని పొరబాటున ఆ నీళ్లలో పడిపోవడంతో నీళ్లు గులాబీరంగులోకి మారాయట. అప్పటికే గుమిగూడిన కస్టమర్లకు మళ్లీ కొత్తగా చేసే సమయం లేక దాన్ని అలాగే అందించాడట. ఆ రంగూ రుచీ నచ్చేయడంతో అది సూపర్‌ డ్రింకుగా మారిపోయిందట. అప్పటినుంచీ అమెరికాలోని సర్కస్‌ల దగ్గర పింక్‌ లెమనేడ్‌ పాపులర్‌ డ్రింక్‌ అయి పోయింది. ఎలా వస్తేనేం... నాటి నుంచి గులాబీ రంగు నిమ్మ షర్బత్‌ మాత్రం మార్కెట్లో ఉందనేది వాస్తవం. కాబట్టి గులాబీరంగు పండ్లు లేకున్నా ఆ రంగు షర్బత్‌ని ఇంట్లోనే చేసుకోవచ్చన్నమాట. ఎర్రని పండ్ల రసంలో కాస్త పాలు కలిపి చేసినప్పుడూ లేత గులాబీరంగులో మారిపోతుంది. నీలిరంగు శంఖుపూల టీలో నిమ్మరసం పిండి గులాబీ రంగుని తీసుకురావచ్చు. కాబట్టి అతిథులకి పింక్‌ డ్రింక్‌తో ఆరోగ్యంతోపాటు ఆనందాన్నీ అందించవచ్చు. ఏమంటారు?

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న