క్లిక్‌... క్లిక్‌... - Sunday Magazine
close

క్లిక్‌... క్లిక్‌...

‘చూసే కోణంలో చూస్తే సాలీడుల పుట్టుక కూడా చేయితిరిగిన చిత్రకారుడు గీసిన పెయింటింగులా అద్భుతంగానే ఉంటుంది...’ అని నిరూపించే ఈ ఫొటో తైవాన్‌కి చెందిన లంగ్‌ ట్సై వాంగ్‌ అనే ఫొటోగ్రాఫర్‌ తీసింది. ఇది ‘బిగ్‌ పిక్చర్‌ నేషనల్‌ వరల్డ్‌ ఫొటోగ్రఫీ కాంపిటీషన్‌(2021)’లో టెరెస్ట్రియల్‌ వైల్డ్‌లైఫ్‌ విభాగానికిగానూ ఫైనలిస్టుగా ఎంపికైంది.

కనుచూపు మేరలో ఎటు చూసినా నెలవంకల్లా ఒంపులు తిరిగిన తెల్లటి ఇసుక తిన్నెలు... ఆ మధ్యలో ఆకుపచ్చగా ప్రతిబింబించే నీటి కొలనులు. అంతేలేని ఆ చిత్రాన్ని చూడాలంటే బ్రెజిల్‌లోని ‘లెంకోయిస్‌ మరాన్‌హెన్సెస్‌’ నేషనల్‌ పార్కుకి వెళ్లాల్సిందే. 600 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న ఇది నిజానికి ఎడారిలానే ఉంటుంది. కాకపోతే, ఎడారితో పోల్చితే ఇక్కడ చాలా ఎక్కువ వర్షపాతం ఉంటుంది కాబట్టి అలా పిలవడంలేదు. అసలు విషయానికొస్తే... ఏటా వర్షాకాలంలో కురిసిన వానలకు ఈ ఇసుక తిన్నెల మధ్యలోకి నీరు చేరుతుంది. ఇక్కడి ఇసుక అడుగున రాతి పొర ఉండడంతో నీరు కిందికి ఇంకిపోదు. ఇక, దూరం నుంచి తీసిన ఫొటో కాబట్టి, ఇవి చిన్న చిన్న కొలనుల్లా ఉన్నాయి కానీ దగ్గరకెళ్తే ఒక్కోటి పెద్ద చెరువంత ఉంటాయి. అందుకే, ఏటా వర్షాకాలంలో వేలమంది పర్యటకులు ఈ చోటికి వచ్చి ఆ అందాలను చూస్తూ ఆ నీటిలో జలకాలాడుతూ సేదతీరుతారు. అయితే, వేసవిలో మాత్రం నీరంతా ఆవిరైపోతుంది.

ఎటు చూస్తే అటు... సేమ్యా!

ఊళ్లో అడుగుపెట్టగానే ఇళ్ల బయటా, వరండాలు, ఖాళీ ప్రదేశాలు, గోడలు... ఇలా ఎక్కడ చూసినా బంగారు దారాలు వేలాడుతున్నట్లుండే దృశ్యాలే కనిపిస్తాయి. వాటిని చూసిన వాళ్లెవరైనా సరే, ‘ఇక్కడేమైనా బంగారాన్ని పోగులుగా మలిచే పనులు చేస్తున్నారా’ అనుకుని, తీరా అవి బంగారు మెరుపులు కావు మనం తినే సేమ్యా అని తెలిసి ఆశ్చర్యపోవాల్సిందే. ఇవన్నీ వియత్నాంలోని ‘క్యు డా’ అనే ఊరి సంగతులు. 19వ శతాబ్దం నుంచీ ఇక్కడి ప్రజల పని సేమ్యా తయారు చేయడమే. ఊరంతా ఏడాది పొడుగునా ఆ పనిలోనే నిమగ్నమై ఉంటుంది. అందుకే ఆ ఊళ్లో ఎక్కడ చూసినా ఎండలో ఆరబెట్టిన పసుపు రంగు సేమ్యా చిత్రాలే దర్శనమిస్తాయి. కమ్మని రుచినిచ్చే సేమ్యానే ధగధగమని మెరుస్తూ ఈ ఊరికొచ్చే సందర్శకులకు కనువిందు చేస్తుందనడంలో ఆశ్చర్యమేముంది!

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న