వెంకన్న మొక్కు తీర్చుకునేందుకు ఓ తల్లి పడ్డ ఆరాటం.. మీరు చదివారా? - Sunday Magazine
close

వెంకన్న మొక్కు తీర్చుకునేందుకు ఓ తల్లి పడ్డ ఆరాటం.. మీరు చదివారా?

ఘటన

 వలివేటి నాగచంద్రావతి

తిరుమలగిరి, అలిపిరి నడకదారి, కరోనా రోజులు... మొన్న మొన్నే లాక్‌డౌన్‌ సడలించారు. అంచేత జనమింకా పలచ పలచగానే ఉన్నారు ఈ దారిలో. మొట్టమొదటి మెట్టు ముందు కర్పూరం వెలిగించి నమస్కరించాను. ‘వట్టికాళ్లతో నీ కొండ ఎక్కుతాను. నీముందు మోకరిల్లుతాను. నా మొర విను’ ఇరవై ఏళ్ల కిందట సంకట సమయంలో నీకు నేను చేసిన వాగ్దానమిది...

ఒక్క చుక్క రక్తం లేనట్టుగా పాలిపోయి ఇవ్వాళో రేపో అన్నట్టుగా నా బిడ్డ మంచం మీదపడి ఉన్నాడు. స్పెషలిస్టులు కూడా సమయం మించిపోయిందంటూ చేతులెత్తేశారు. ఆయుర్వేదం, హోమియోపతీ, నాటుమందూ అంటూ ఎవరేమి చెప్పినా అటు పరిగెత్తాం. ఒక్కొక్కరూ పెదవి విరుస్తుంటే నిరాశ అనే గాడాంధకారంలో మునిగిపోయాము.

‘భగవాన్‌, నాకీ కోరిక తీర్చు. నాయీ అభిలాష నెరవేర్చు. నీకది చేయిస్తాను. నీకిది సమర్పిస్తాను అని ప్రతి చిన్నవాటికీ నీతో బేరాలాడిన దాన్ని కదూ... శరణు కోరటానికి నాకిప్పుడు నువ్వు తప్ప ఈ లోకంలో ఎవ్వరూ లేరయ్యా. నీముందు దోసిలి ఒగ్గి వేడుకుంటున్నాను. నా బిడ్డని నాకు దక్కించు’ అన్నాను.

పదిరోజుల్లో నువ్వు నీ దయాగుణాన్ని నిరూపించుకున్నావు. కానీ నేనే నీకిచ్చిన మాటని ఇంతవరకూ నిలబెట్టుకోలేకపోయాను.

పార్ధు కోలుకుని లేచి తిరగటం మొదలు పెట్టేదాకా నాకు నిద్రాహారాలు లేవు. దిగులూ, మానసిక క్షోభతో రెండు మూడు నెలలు నేనుకూడా మనిషిని కాలేకపోయాను. కాస్త తేరుకోగానే కొండ ఎక్కే ప్రోగ్రాం గురించి మాట్లాడాను. కానీ అప్పుడే సుజాత నా కడుపున పడింది. అబ్బెబ్బే లేత నెలలు- కొండ ఎక్కడం మంచిది కాదన్నారు. నెలలు ముదిరాక ఇక కొండ ఎక్కడమే కుదరదన్నారు. ఆ తరువాత చంటిపిల్లతో కష్టమన్నారు.

ఆ తరువాత కూడా కాదనలేని కారణాలెన్నో. అత్తామామల వృద్ధాప్యం, వాళ్లకేవో ఆరోగ్య సమస్యలు, వాళ్లని వదిలి మేము వెళ్లలేకపోవటం... ఇలా ఎప్పుడూ ఏవో ఆటంకాలూ, అవరోధాలూ. ఏళ్లుగడిచిపోతున్నాయి. ఈ లోపల మా కిరీటి పుట్టు వెంట్రుకలప్పుడూ, మా పార్ధు పెళ్లి జరిగినప్పుడు పసుపు బట్టలతో రెండోసారీ నీ కొండకి వచ్చాం. పైకి నడిచి వెళ్దామంటే ఒక్కరికీ ఓపిక లేదంటారు. నేను ఒక్కదాన్నే వెళ్తానంటే ససేమిరా ఒప్పుకోరు. అప్పుడల్లా నీ దర్శనం చేశానేకానీ నిన్ను నేరుగా చూడలేక సిగ్గుతో మొహం తిప్పుకున్నానయ్యా, నన్ను నమ్ము.

ఎవరెవరో ఏవేవో సలహాలిచ్చారు. ఉపాయాలు చెప్పారు. స్వామివారి హుండీలో అపరాధం సొమ్మువేసి చెంపలేసుకో అని ఒకరు... బస్సులో పైదాక వెళ్లి, కొన్ని అడుగులు ముందు దిగి నడిచి పైకి వెళ్లు, నడిచి కొండ ఎక్కినట్టే అవుతుందని ఒకరు... ఏడుకొండలు చెక్కిన వెండి ఫొటో కొని భగవంతుడికి సమర్పించు అని ఒకరు...

ఆరోజు నీముందు అలనాటి గజేంద్రునిలా మోకాళ్లపైన సాగిలపడినప్పుడు నా మానసిక స్థితి ఎలా ఉంది? నా పార్ధుని బతికించు కోవటం కోసం నా ప్రాణాలు అడిగినా ధారపోయటానికి సిద్ధంగా ఉన్నాను. ఏం చేసయినా సరే వాణ్ణి నా ఒడినుంచి దూరం చేసుకోకూడదనే తపన, ఆరాటం నిండిన తనువుతో కదిలిపోతూ ఉన్నాను.

ఇప్పుడా గడ్డుకాలం గట్టెక్కిపోయింది కదా అని పక్కదారులు వెతకనా? కప్పదాట్లు వెయ్యనా? ఉహుఁ, నేనంత మోసగత్తెను కాను. దేవుడికేమిటి మనిషి కేమిటి ఎవరైనా నా ఊపిరి ఆగేలోపున ఇచ్చిన మాట నిలబెట్టుకునే తీరుతాను.

ఇన్నేళ్ల నా ప్రయత్నం ఫలించింది. ఉహుఁ సాధించుకున్నాను.

పార్ధు కొడుకు- నా మనవడు- మౌళి వడుగు... తిరుమల గిరిమీద. ఈ కరోనా కారణంగా మా కుటుంబం మాత్రమే పైకి వెళ్లి శుభకార్యం ముగించుకుని రావాలని నిర్ణయం. అరవై ఏళ్లొచ్చాయి నాకు. అంతకంతకూ ఓపిక అడుగంటుతోంది. ఈసారి ఈ సదావకాశాన్ని వదులుకోదలచలేదు. ఒక్కొక్కళ్లనీ కాళ్లావేళ్లా పడి బతిమలాడుకున్నాను. ‘ఒక్కరు నావెంట వస్తే చాలు నా రుణం తీరుతుంది’ అని... ఒక్కరూ ముందుకు రాలేదు. మాకు టైం లేదు, వంద కాకపోతే వెయ్యి హుండీలో వెయ్యి అనే అన్నారందరూ.

ఉహుఁ ఇక వాళ్లతో పెట్టుకోదలచుకోలేదు.

* * *

తిరుపతిలో దిగాం అందరం. సత్రంలో స్నానాలు చేసి చుట్టుపక్కల దేవాలయాలు కొన్ని చూసి వచ్చాం. భోజనాలు అవగానే అందరూ విశ్రాంతికి ఒరిగారు.

అదే సమయం. ఒక కాగితం మీద నా ప్రయాణం గతి రాసి పార్ధు జేబులో పెట్టాను. ఒక మంచినీళ్ల బాటిల్‌ మాత్రం తీసుకుని బయటకు వచ్చాను. ఆటోమీద సరాసరి అలిపిరిలో దిగాను.

నాకు లగేజీ ఏమీ లేకపోవటం అదృష్టం. మావాడు ఆన్‌లైన్‌లో తీసుకున్న దర్శనం టికెట్‌ నా దగ్గరే ఉంది. అంచేత ఎక్కడా ఆలస్యం చేయకుండా మెట్లదగ్గర కొచ్చేశాను.

మొదటి మెట్టుమీద కర్పూరం వెలిగించి నమస్కారం చేశాను. ‘భగవాన్‌ నీమ్రోల నిలిచి జరిగిన ఆలస్యానికి క్షమాపణ చెప్పుకునేందుకు ఇక ఎంతో సమయం పట్టదని తలుచుకుంటేనే మనసు ఆనందంతో పొంగిపోతోందయ్యా’ అనుకున్నాను పులకింతతో.

మెట్లెక్కడం మొదలుపెట్టాను. శ్రీవారి పాదాల మండపం దర్శించుకుని ముందుకు సాగాను. రాజగోపురం దాటి, స్వామి మత్స్యావతారం, కూర్మావతారం, మైసూరు గోపురం దాకా వచ్చేశాను. గజేంద్రమోక్షం కూడా దాటాను. ఏకధాటిన నడిచానేమో చాలా అలుపనిపించింది. పక్కగట్టుమీద రొప్పుతూ కూర్చుండిపోయాను. పక్కనంతా అడవి. చల్లటిగాలి ఆహ్లాదకరమైన వాతావరణం. చాలా హాయనిపించింది.

కరోనా మూలంగా పక్కన ఉండే షాపులన్నీ మూసేసి ఉన్నాయి. నడిచే పాదచారులు కూడా చాలా తక్కువగా ఉన్నారు. నా కనుచూపు మేరలో పది, పదిహేను మంది మాత్రమే కనిపిస్తున్నారు. అందరూ వయసులో ఉన్నట్టే ఉన్నారు. చకచకా నడుస్తూ మెట్లెక్కుతూ కనుమరుగవుతున్నారు.

ఇంకా ఇలా కూర్చుంటే ఎలాగ? లేచాను. మళ్లీ నడక మొదలుపెట్టాను. ఈసారి ఉత్సాహంగా కాదు- నీరసంగా. స్వామివారి అవతారాల ముందు కూడా నిలవకుండా దణ్ణం పెట్టి కదులుతున్నాను.

గాలిగోపురం దాకా నడిస్తే దారి సులువవుతుందని చెప్పారు. కానీ... అంతదాకా నడవటానికి ఎంతసేపు పడుతుందో. పైగా దారివెంట వచ్చేవాళ్లు కూడా ఎవరూ కనబడటం లేదు. టైమయితే నా దగ్గర లేదు కానీ మబ్బుగా ఉండటం మూలాన త్వరగా చీకటి పడుతుందేమోనని అనిపిస్తోంది. అదో రకం బెదురుగా ఉంది.

ఇంతలో వెనకనుంచి అడుగుల చప్పుడు. అమ్మయ్య, వెనక్కి తిరిగి చూశాను. చిరుగుల చీరా, చింపిరి జుట్టూ, మెడలో జోలె. తను యాత్రికురాలు కాదు. ముష్టిదయి ఉంటుంది. ఎవరో ఒకతోడు. దగ్గరగా వస్తుంది కదా అని ఆగాను. ఉహుఁ రాలేదు. తనూ ఆగింది. అనుమానం వచ్చింది. మొహం కేసి పరకాయించి చూశాను ప్రసన్నంగా. దాని మొహంలో సుముఖత లేదు. నావంక చురచురా చూసింది. వేలెత్తి బెదిరించింది. తెల్లబోయాను. ఇదేమిటి? నేనేం చేశాను దీన్ని?

మెడలో రెండు పేటల గొలుసూ, చేతులకు మూడు జతల గాజులూ ఉన్నాయి నా ఒంటిమీద. అది వయసులో ఉంది. నన్నొక తోపు తోస్తే పడేలా ఉన్నాను నేను. గుండె దడదడలాడింది. నడక వేగం పెంచాను. చూశాను- వెనకే వస్తుందది.

‘‘అయ్యో అవ్వా, ఈ మంచినీళ్లు తాగండి’’ అని సొమ్మసిల్లిన నా మొహం మీద నీళ్లు చల్లారెవరో. తేరుకుని చూశాను, మంచినీళ్ల బాటిల్‌ అందిస్తున్నదెవరా అని. ఆ చింపిరి తల ముష్టిది కాదు. ఎవరో నలుగురున్న కుటుంబం. నన్ను లేపి కూర్చోబెట్టారు. వాళ్లని చూడగానే ప్రాణాలు లేచి వచ్చాయి నాకు.

‘‘ఈ వయసులో ఒక్కరూ రావటమేమిటమ్మా, జాగ్రత్త కావద్దూ’’ వారిలో పెద్దాయన మందలిస్తున్నాడు. నా సమస్యలు వాళ్లకేమి తెలుస్తాయి?

దరిదాపుల్లో ఆ చింపిరిజుట్టు కనిపించలేదు. ధైర్యంగా వాళ్లతోపాటూ అడుగులు కదిపాను. వాళ్లంత వేగంగా నడవటం నాకు అంత సులభంగా లేదు. కాళ్లు చాలా నొప్పులుగా ఉన్నాయి. పాదాలయితే మండిపోతున్నాయి.

కానీ నాకోసం వాళ్లనీ నెమ్మదిగా నడవమనటం సబబుకాదు కదా. ఎలాగొచ్చామో కానీ గాలిగోపురం దాకా వచ్చేశాం. ఇంకొంత దూరం కూడా కాళ్లీడ్చుకుంటూ కష్టపడి నడిచాను.

కాలి నొప్పితోపాటూ నడుమునొప్పీ అందుకుంది. కాలు తీసి కాలు వేయటం ప్రాణాంతకంగా ఉంది. శరీరం పదే పదే విశ్రాంతి కోరుతోంది. కూర్చున్నాను. ఉహుఁ కూలబడిపోయాను.

‘‘అమ్మా, మీరు కాసేపు కూర్చుని బయలు దేరటం మంచిది. ఈ ముందు మార్గం కొంత పూర్తి కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. ఆ పక్కనే నడకదారి గుండా కొంతదూరం జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. ఆ తరువాతంతా ఘాటు రోడ్డే. కార్లూ అవీ వస్తూ పోతూనే ఉంటాయి. భయముండదు. మీకు దర్శనం రేపు కాబట్టి మీరు నిదానంగా వెళ్లొచ్చును. మిమ్మల్ని వదిలి వెళ్లాలని లేదుగానీ మాకు ఎనిమిదింటికి దర్శనం. తొందరగా వెళ్లాలి, క్షమించండి’’ అంటూ ఒక్కొక్కరూ నమస్కారం చేసి ముందుకు వెళ్లిపోయారు.

నిజమే ఎవరి తొందర వాళ్లది. ఒకరి కోసం ఒకరు ఎందుకు ఆగుతారు?

చేతి సంచిలోంచి బామ్‌తీసి మోకాళ్లకీ పిక్కలకీ, కొబ్బరినూనె అరికాళ్లకీ రాసుకున్నాను. గుక్కెడు మంచినీళ్లు తాగాను. పదినిమిషాలు ఒక గట్టుకి ఆనుకుని కళ్లుమూసుకున్నాను.

ఆయాసం అదుపులోకి వచ్చింది. నొప్పులు కొద్దిగా సర్దుకున్నాయి. ఇప్పుడు నడవాల్సింది అడవిలో కాలిదారి వెంట. ప్రయత్నించి లేచి నిలుచున్నాను. కాళ్లు జలజలలాడాయి. నిలదొక్కుకున్నాను. దూరంగా కారు హారన్లు వినిపిస్తున్నాయి. వెనక్కి తిరిగి ఎవరన్నా కనిపించకపోతారా అని ఆశపడుతూ చూశాను. కనిపించింది. ఎవరు? ఆ చింపిరి జుట్టు. చకచకా అడుగులు వేస్తూ నావైపే వస్తూ ఉంది.

పై ప్రాణాలు పైనే పోయినట్టయింది. చావు భయం పవర్‌ఫుల్‌ ఇంజక్షన్‌లా నా కాళ్లకి బలాన్నిచ్చింది. గబగబా నడుద్దామని చూశాను. పెద్దరాయి ఏదో కాళ్లకి తట్టుకుంది. కళ్లు తిరిగాయి. ఒళ్లు తూలింది. స్పృహ తప్పి పడిపోతున్నప్పుడు చూశాను- చింపిరిజుట్టు రెండు చేతులూ కర్కశంగా నా మెడవైపు రావటాన్ని. పూర్తిగా తెలివి తప్పిపోయింది.

* * *

నా రెండు దవడలూ నొక్కి నోరు తెరిపించి చిక్కటి ద్రవం లాంటిదేదో ధారగా పోస్తున్నారెవరో. వెచ్చగా కమ్మగా నోటిలోంచి కడుపులోకి దిగుతోన్న ఆ పదార్థం అమృతంలా జీవం కోల్పోతున్న నా నవనాడుల్నీ ఉత్తేజపరుస్తోంది.

‘‘ఇక నోరుముయ్యవా ఏం? నాకని ఉంచుకున్న జావకూడా నీకే తాగబెట్టాను. ఇంకా చాల్లేదా ఏమి?’’ ఓ కంచుకంఠం ఖంగుమంది. అయినా భయమనిపించలేదు. నా ప్రాణదాత గొంతు అది. తెరిపిళ్లు పడని కళ్లు బలవంతానా కొద్దిగా తెరిచి చూశాను.

ఎదురుగా సత్తుగిన్నెతో కూర్చున్నది ఎవరు? చింపిరిజుట్టు... ఉహుఁ మనసులో కూడా కించపరిచేందుకు ఒప్పుకోలేక పోయాను. మెల్లగా లేచి కూర్చున్నాను.

పాడుపడిన మండపంలా ఉంది. మూడురాళ్లు పెట్టి చితుకుల మంటమీద కుండల్లో ఏదో వండుకుంటున్నారు మరో ఇద్దరు. పాతగుడ్డలు పరిచిన పక్కమీద ఇద్దరు చంటిపిల్లలు కాళ్లూ చేతులూ కదిలిస్తూ ‘ఊ...ఊ’ అంటున్నారు.

బిడ్డల తల్లి నన్ను ఏదో చేస్తుందని ఎంత చెడుగా ఆలోచించాను. నా మెడలో గొలుసూ నా చేతుల గాజులూ అలానే ఉన్నాయి. పశ్చాత్తాపం మొదలయింది. పైపై రూపాన్ని చూసి గుణాన్ని అంచనా వేయటం ఎంత తప్పు!

‘‘నన్ను చంపటానికొచ్చిన మృత్యువు అనుకున్నాను నిన్ను. ఎంత మంచిదానివి నువ్వు. నీకంటే పెద్దదాన్ని నమస్కారం చేయలేను. నువ్వెప్పుడూ చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను’’ దగ్గరగా ఉన్న తన చేయి పట్టుకున్నాను కృతజ్ఞతగా.

మామూలుగా ఉన్నదల్లా నవ్వబోయి ఆగిందో నిమిషం. ‘‘చంపుదామని అనుకోలేదు గానీ ఓ దెబ్బకొట్టి పక్కతుప్పల్లోకి తోసేద్దామనుకున్నాను- నీ గొలుసూ గాజులూ లాగేసుకుని.’’
బిత్తరపోయాను...

‘‘నీ వెనక నడుస్తున్నంత సేపూ అదే ఆలోచన. ఎక్కడ వీలు దొరుకుతుందా ఆ పనికి అని. ఏం లాభం? తీరా నీమీద చేతులేద్దామని ఎత్తానోలేదో నువ్వు మెడ వాల్చేశావు. వాల్చేముందు ఓ చూపు చూశావు నువ్వు. అప్పటిదాకా నేననుకున్నదేమిటో తెలుసా. వయసుమళ్లిన ముసలిది ఇంక ఏమయిపోతే ఏమిలే అని. నీ చూపు ‘ఆ మాట అనటానికి నువ్వెవరూ’ అన్నట్టనిపించింది. ఏం చేయను? మనసు చెప్పిన మాట వినాలిగా. వీళ్లని కేకేసుకొచ్చి నిన్నిక్కడికి చేర్చేసరికి తాతలు దిగి వచ్చారు.’’

‘‘దేవుడి మండపంలో పెద్దోళ్లు చెప్పే నీతికథలూ సూక్తులూ వినొద్దు అని అందుకే నీకు చెప్పేది’’ పొయ్యి దగ్గర కాషాయం కట్టుకున్న అతను నవ్వుతూ అన్నాడు.

‘‘ఇదిగో, ఏ పాపం చేసినా ఈ ముదనష్టపు పిల్లల కోసమే. అదెవత్తో ఆ చెట్టుచాటున కనేసి చచ్చింది. అందరిలాగా అయ్యోపాపం అనేసి ఒదిలేయచ్చుగా... ఉహుఁ ఏ కుక్కలో లాక్కుపోతాయేమోనని అనుమానం, బాధ. అలా ఈ లంపటాలని అంటించుకున్నాను.

ఈ కరోనా భయం మూలాన ఈ దారిన నడిచేవాళ్లూ లేరు, ధర్మం చేసేవాళ్లూ లేరు. నా పొట్ట నిండటమే కష్టమవుతోంది. ఏదో ఒరగబెట్టేలా తీసుకొచ్చాను. ఈ రెండు పొట్టల్నీ ఎలా నింపను? మూడురోజులు అయింది వాళ్లకి పాలు పట్టి. నాతోపాటూ వాళ్లకీ గంజే పట్టిస్తున్నాను. పిచ్చి బొందలు సరిగ్గా మింగటమే లేదు. అందుకే ఇవాళ తెగించాలనుకున్నాను. ఇదిగో ఇలాగయింది.’’

పొయ్యి దగ్గరున్న అతను చిన్న స్టీలుగ్లాసుతో టీ తీసుకొచ్చి ఇచ్చాడు.

‘‘ఏమ్మా, టీ తాగాక బయలుదేరగలవా? మళ్లీ మీవాళ్లు ఎదురుచూస్తూ ఉంటారేమో?’’ గోళ్లతో తల గీరుకుని ముడివేసుకుంటూ అంది ఆమె.

పొద్దువాలుతోంది. లేస్తే మళ్లీ తూలుతానేమో? ధైర్యం చాలట్లేదు.

‘‘నువ్వు నాతోపాటూ రాగలవా?’’ అడిగాను ప్రాధేయతగా, ఆశగా.

‘‘అన్నా పిల్లల్ని చూస్తావుండండి. అమ్మని దిగబెట్టి గంటలో తిరిగొస్తా’’ చెప్పింది సమాధానంగా.

ఏమాత్రం సంకోచం లేకుండా తనతోపాటూ బయలుదేరాను. నా భుజాల చుట్టూరా ఆలంబనగా తన చెయ్యి వేసింది. తన నడుంచుట్టూరా నా చెయ్యి వేయించుకుంది.

ఘాటు రోడ్డు దాటాం. మోకాళ్లపర్వతం కూడా నాకు కష్టం లేకుండా ఒక్కొక్క మెట్టూ ఎక్కిస్తూ జాగ్రత్తగా పూర్తి చేయించింది. చివరి మెట్టు చేరిపోయాము.

అప్పుడు గుర్తుకొచ్చింది. తొందరపడుతూ వెనక్కి తిరిగి చూశాను. చుట్టుపక్కల ఎక్కడా చింపిరి తలంటూ కనిపించలేదు.

* * *

మౌళి ఉపనయన కార్యక్రమం శుభప్రదంగా ముగిసింది. అందరం దైవ దర్శనానికి బయలుదేరాం. నా చూపులు తనకోసం ఆరాటంగా గాలిస్తున్నాయి.

ఆలయానికి వచ్చేశాం. ద్వారాలు దాటి స్వామి ముందర నిలిచాను. ‘నీ రుణం తీర్చుకోగలిగేను ప్రభూ’ కళ్లుమూసి సంతృప్తిగా అనుకున్నాను.

‘‘అదెలా?’’

‘అన్నది ఎవరు?’ కళ్లు తెరిచాను.

స్వామి తలమీద చింపిరిజుట్టు క్షణం కనిపించి మాయమయింది.

నిశ్చేష్టురాలినయ్యాను.

‘మళ్లీ రుణపడిపోయావు కదా!’ అంటున్నాడు భగవంతుడు గంభీరంగా.

అవునుకదా... కానీ ఈ రుణమెలా తీర్చుకోను?

ప్రసాదం తీసుకుని బయటకు వచ్చాం. మా వాళ్లంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ‘అక్కడికి వెళదాం, ఇక్కడ ఇవి కొందాం’ అంటూ సందడి చేస్తున్నారు.

నేను వాళ్లతో కలవలేకపోతున్నాను. మనసు చాలా భారంగా, నిర్లిప్తంగా ఉంది.

‘‘అమ్మగారూ’’ అన్న పిలుపు... చటుక్కున తలెత్తి చూశాను. ఎదురుగా ఉన్న జనాల్లో ఆ చింపిరితల... చంకలో పిల్లాడితో... వెతక బోయిన తీగ కాలికి తగిలినట్టు. నాలుగంగల్లో దగ్గరగా వెళ్లాను. ఉహుఁ తనుకాదు.

హతాశురాలినయ్యాను. ‘‘బిడ్డకి పాలు తాగించాలి తల్లీ’’ సత్తు పళ్లెమొకటి ముందుకు జాపింది. ఎవరయితేనేం- తనకుగాని పిల్లలకోసం ఎంతకయినా తెగించాలనుకున్న ఆమెలోని మాతృహృదయం నాకు ఈమె కళ్లలో కూడా కనిపిస్తోంది. పర్సు తెరిచి, ఇక్కడ బిచ్చగాళ్లకు వెయ్యాలని తెచ్చుకున్న చిల్లర పక్కకి తోసి వందరూపాయల నోటు తీసి పళ్లెంలో ఉంచాను.

మనసు శాంతించలేదు. ‘ఇంతేనా ఇంతేనా’ అంటోంది.

తళుక్కుమని తోచిందో ఆలోచన.

పాలులేక ఏ పేదరాలి పసిబిడ్డ ఏడుపు విన్నా అక్కడ ‘చింపిరితల’ ఉందేమోనని నా ఆశ. అందుకనే నాలుగు ఆవుల్ని కొన్నాను. గోశాల కట్టించాను. పాలు కొనలేని ప్రతి పేదరాలూ ఈ గోశాలలో తమ చంటిబిడ్డలకు పాలు పట్టుకుంటారు.

తిరుపతికి మరీ దూరం కాదు మా ఊరు. నా ఈసేవ వృథా కాదు. ఎప్పటికయినా ‘ఆ చింపిరితల- పిల్లల్నెత్తుకుని ఇక్కడకు వస్తుంది... నా రుణభారం తీరుతుంది... అన్నది నా ప్రగాఢ విశ్వాసం.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న