ఆట బొమ్మలు అద్దెకు ఇవ్వబడును! - Sunday Magazine
close

ఆట బొమ్మలు అద్దెకు ఇవ్వబడును!

ఓ బొమ్మను బోలెడు డబ్బు పెట్టి కొనిచ్చినా సరే... వారం రోజుల తరువాత దాన్ని పక్కన పడేసి మరొకటి కావాలంటారు పిల్లలు. అలాగని వారం లేదా పదిరోజులకోసారి ఓ కొత్త బొమ్మను కొనివ్వాలంటే మాటలు కాదు కదా... డబ్బుకు డబ్బూ వృథాతోపాటూ ఇంట్లో ఎక్కడ చూసినా ఆటవస్తువులే కనిపిస్తాయి. ఈ ఇబ్బందులేవీ లేకుండా ఉండాలంటే ఈసారి వాళ్లు అడిగిన బొమ్మను తెచ్చి ఇచ్చి, బోర్‌ కొట్టిందన్నప్పుడు తిరిగి ఇచ్చేస్తే సరి. ఎందుకంటే ఇప్పుడు చాలా సంస్థలు ఆట వస్తువుల్ని అద్దెకు ఇస్తున్నాయి మరి.

ఆరేళ్ల చింటూ కనిపించిన ప్రతి బొమ్మా కావాలంటాడు. వద్దంటే ఏడుపు మొదలుపెడతాడు. ఏడుస్తున్నాడు కదాని కొనిస్తే వారం పదిరోజులకే అది విరిగిపోయి ఏ మంచం కిందో, బల్ల అడుగునో కనిపిస్తుంది. బబ్లూకు కార్లంటే ఇష్టం. దాంతో చిన్నప్పటినుంచీ కేవలం కార్ల బొమ్మలే కొనుక్కునేవాడు. ఇప్పుడు అతడి దగ్గర చిన్న కారు బొమ్మ నుంచీ... పిల్లలకోసమే ప్రత్యేకంగా తయారుచేసిన ఎలక్ట్రిక్‌ కార్‌ వరకూ అన్నీ ఉన్నాయి. బబ్లూ పెద్దవాడైపోవడంతో వాటిని ఏం చేయాలో తెలియక అన్నింటినీ అటక ఎక్కించాల్సిన పరిస్థితి. పిల్లలున్న ఇళ్లల్లో ఎదురయ్యే ఇలాంటి ఇబ్బందుల్ని గుర్తించిన కొన్ని సంస్థలు చిన్నారులకు అవసరమైన, వాళ్లకు ఇష్టమైన ఆట వస్తువుల్ని అద్దెకు ఇస్తున్నాయి ఇప్పుడు. ఆట వస్తువులు అద్దెకు అనగానే చిన్న కారుబొమ్మ లేదా బిల్డింగ్‌బ్లాక్స్‌ లాంటివి మాత్రమే ఇస్తారనుకోకండి. వాళ్ల వయసును బట్టి అన్నిరకాల బొమ్మల్నీ తీసుకుని వద్దనుకున్నప్పుడు వెనక్కి ఇచ్చేయొచ్చు. ఉదాహరణకు మరీ పసి పిల్లల కోసం మీట నొక్కితే పాటపాడే సాధారణ పిల్లి బొమ్మ నుంచీ ఖరీదైన వాకర్‌ వరకూ తీసుకోవచ్చు. అలాగే వాళ్లు పెరిగేకొద్దీ సైకిళ్లూ, రిమోట్‌తో నడిచేకార్లూ, పేద్ద టెడ్డీబేర్‌లూ, ప్లేహౌస్‌లు, ప్లేపెన్‌లు, ఇంతవరకూ చూడని బిల్డింగ్‌బ్లాక్స్‌... ఒకటేమిటి ఏది కావాలంటే అది అద్దెకు దొరుకుతుంది. వాటిల్లో విజ్ఞానం పెంచే ఆటవస్తువులూ, యూనోకార్డ్స్‌, బిజినెస్‌ మోనోపోలీ వంటివీ ఉంటాయి. అన్నింటికీ మించి ఈ రోజుల్లో పిల్లలు నడపగలిగిన ఖరీదైన ఎలక్ట్రిక్‌ కార్లూ, బైకుల్ని కూడా అద్దెకు తెచ్చుకోవచ్చు. 

ఎలా ఇస్తారంటే...

సాధారణంగా లైబ్రరీలో పుస్తకాలను అద్దెకు తెచ్చుకుని చదువుకున్నాక ఎలా తిరిగి ఇచ్చేస్తామో అదేవిధంగా ఆటవస్తువుల్నీ తెచ్చుకోవచ్చు. అయితే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఉదాహరణకు దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌... వంటి ప్రాంతాల్లో బొమ్మల్ని అద్దెకు ఇచ్చే ‘ఖిలోనేవాలా’ అనే సంస్థ బొమ్మల్ని అద్దెకు ఇచ్చేందుకు కొంత మెంబర్‌షిప్‌ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్‌ కట్టించుకుంటుంది. ఎలాగంటే నాలుగువందల రూపాయలు మెంబర్‌షిప్‌ ప్లాన్‌తోపాటు డిపాజిట్‌ కడితే రెండుసార్లు నాలుగువేల రూపాయలు ఖరీదు చేసే ఆటవస్తువుల్ని తీసుకోవచ్చు. మరికాస్త ఎక్కువ డబ్బు కట్టినట్లయితే... అందుకు పదిరెట్ల ధరలో కోరుకున్న ఆటవస్తువులు ఇంటికే వస్తాయి. హైదరాబాద్‌లోని రెంట్‌మీ టాయ్స్‌, ఖరీదైన కార్లూ, బైక్‌లూ అద్దెకు ఇచ్చే షాప్‌లు కూడా ఇలాంటి నిబంధనల్నే పాటిస్తాయి. బొమ్మల్ని ఏ మాత్రం పాడుచేయకుండా తిరిగి ఇచ్చేస్తే గనుక... సెక్యూరిటీ డిపాజిట్‌ వెనక్కి వచ్చేస్తుంది. కాబట్టి... ఇకమీదట పిల్లలు అడిగిన ప్రతి బొమ్మనూ కొనిచ్చేయకుండా ఇలా అద్దెకు తెస్తే వాళ్లకి కూడా కొత్తకొత్త బొమ్మలతో ఆడుకున్నట్లూ ఉంటుంది, మీకూ డబ్బు ఆదా అవుతుంది. బాగుంది కదూ!


మీకు తెలుసా!

నెలాఖరుకి జేమ్స్‌బాండ్‌ సినిమా ‘నో టైమ్‌ టు డై’ రిలీజవుతోంది కదా! ఆ బాండ్‌ పాత్ర వాడుతున్న చిన్న పిస్తోల్‌ వెనక ఓ విశేషముందండోయ్‌! హిట్లర్‌ 1945లో ఆత్మహత్య చేసుకోవడానికి వాడిన ‘వాల్తేర్‌ పీపీకే’ తుపాకీ స్ఫూర్తితోనే దీన్ని డిజైన్‌ చేశారట మరి!


‘సులేఖ’ మళ్లీ వచ్చింది

స్వతంత్రోద్యమంలో విదేశీ వస్తు బహిష్కరణ గురించి మహాత్మా గాంధీ రోజూ పత్రికలకూ, నేతలకూ ఉత్తరాలు రాసేవారు. అలాంటపుడు విదేశీ సిరాను ఉపయోగించడం గాంధీజీకి నచ్చేది కాదు. అదే విషయాన్ని బెంగాల్‌కు చెందిన శాస్త్రవేత్త, ఆవిష్కర్త సతీష్‌చంద్ర దాస్‌ గుప్తాకు చెప్పారు. ఆ పిలుపుతో స్వదేశీ సిరాను అభివృద్ధి చేశారాయన. ఉద్యమంలో భాగంగా జైలుకెళ్లి వచ్చిన నానీగోపాల్‌, శంకరాచార్య మైత్ర సోదరులకు ఆ ఫార్ములా చెప్పి ఉత్పత్తి ప్రారంభించ మన్నారు గుప్తా. గాంధీజీ ఆశీస్సులు తీసుకుని 1934లో రాజ్‌షాహీ(బంగ్లాదేశ్‌లో ఉంది) కేంద్రంగా స్వదేశీ సిరా తయారీని ప్రారంభించారు మైత్ర సోదరులు. దీనికి అన్ని వర్గాల నుంచి ఆదరణ లభించటంతో 1939 నాటికి కోల్‌కతాలోనే కర్మాగారాన్ని నిర్మించి ఉత్పత్తి పెంచారు. ఈ సిరాకు విశ్వకవి ఠాగూర్‌ ‘సులేఖ’ పేరు పెట్టారని చెబుతారు. ఉద్యమ సమయంలోనే కాదు, స్వతంత్రం వచ్చాకా సులేఖ సిరాకు దేశవిదేశాల్లో గిరాకీ ఉండేది. ఒక దశలో మూడు కర్మాగారాల నుంచి రోజుకు కోటి ఇంక్‌ బాటిల్స్‌ తయారుచేసేవారు. ఆఫ్రికాలో రెండు ఫ్యాక్టరీలు నిర్మించడంలో సులేఖ సాయం తీసుకుంది ఐక్యరాజ్య సమితి. తన సినిమాలూ, నవలల్లో ‘సులేఖ’ను ప్రస్తావిస్తుండేవారు సత్యజిత్‌ రే. ఇంత చరిత్ర ఉన్న సులేఖ... సమ్మె కారణంగా 1988లో మూతపడింది. వివాదాలన్నీ ముగియడంతో 2006లో ‘సులేఖ’ సేవలు మళ్లీ మొదలయ్యాయి. ఈసారి కొద్ది మొత్తంలో సిరాతోపాటు నోబుల్‌ బుక్స్‌, ఇళ్లను శుభ్రపరిచే ఉత్పత్తులూ, సోలార్‌ ఛార్జింగ్‌ లాంతర్లూ తెచ్చారు. సోలార్‌ ప్లాంట్ల నిర్మాణంలో రాణిస్తున్నారు. ప్రస్తుతం రాయల్‌ బ్లూతోపాటు నలుపూ, ఎరుపు రంగు ఇంకు బాటిళ్లను అమ్ముతున్నారు. ప్లాస్టిక్‌ పెన్నులకు బదులు ఫౌంటెయిన్‌ పెన్నుల్ని ఆదరిస్తే పర్యావరణానికీ మేలంటారు సంస్థ ఎండీ కౌశిక్‌ మిత్ర.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న