close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వాకిలే పాఠశాల.. రూపాయికే చదువు!

పట్నా: వయసు మీద పడ్డాక ఎవరైనా ఏం చేయాలనుకుంటారు? ఇంట్లోనే సేద తీరుతూ మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేయాలనుకుంటారు.. అంతేకదా..? బిహార్‌కు చెందిన లోకేష్‌ శరణ్‌ మాత్రం అందుకు మినహాయింపు! ఉపాధ్యాయుడిగా ఎంతోమంది చిన్నారుల మెరుగైన భవిష్యత్తుకు బాటలు పరిచిన ఆయన.. 61 ఏళ్ల వయసులోనూ ఆ పనిని కొనసాగిస్తున్నారు. ఒకే ఒక్క రూపాయిని ఫీజుగా తీసుకుంటూ పేద విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. సమస్తీపుర్‌కు చెందిన లోకేష్‌ బీఎడ్‌ పూర్తిచేశారు. తన తండ్రి ఏర్పాటుచేసిన పాఠశాలలోనే ఆయన చాలాకాలం పాటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. చదువుకు దూరమవుతున్న చిన్నారులపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఓ నివేదిక కూడా సమర్పించారు. ఆయన కృషిని గుర్తించిన ఓ పత్రిక యాజమాన్యం పాత్రికేయుడిగా అవకాశమిచ్చింది. దీంతో ఓ వైపు పాఠాలు బోధిస్తూనే, మరోవైపు జర్నలిస్టుగా ఆయన పనిచేశారు. అయితే- ఫీజులు తక్కువగా తీసుకోవడంతో పాఠశాలలో తగిన మౌలిక వసతులు కల్పించలేకపోయారు. క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గింది. కొన్నేళ్ల కిందట బడిని మూసివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత పాత్రికేయ ఉద్యోగం నుంచి లోకేష్‌ పదవీ విరమణ పొందారు. పేద పిల్లలకు చదువు చెప్పాలన్న ఆశయం ఆయన్ను ఖాళీగా కూర్చోనివ్వలేదు. అందుకే తన ఇంటి ముందు వాకిలిలో ఓ తరగతి గదిని నిర్మించారు. వేల రూపాయల ఫీజులు కట్టలేక చదువుకు దూరమవుతున్న విద్యార్థులకు అందులో పాఠాలు బోధిస్తున్నారు. చేతిరాత మెరుగుపర్చుకునే శిక్షణ ఇస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు. ప్రతిగా పిల్లల నుంచి నుంచి కేవలం ఒక్క రూపాయిని తన ఫీజుగా తీసుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో అదే రుసుముతో ఆయన ఆన్‌లైన్‌ తరగతులనూ నిర్వహిస్తుండటం విశేషం. ఇక తన కుమారుడికి ఎక్కడికి బదిలీ అయినా.. అతణ్ని చూసేందుకు వెళ్లిన ప్రతిసారీ స్థానిక పాఠశాలల్లో వారం రోజుల పాటు పాఠాలు చెబుతుంటారట లోకేష్‌.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు