close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఠాణాలో కొక్కొరోకో..

అనగనగా ఇదొక కోడి.. మామూలు కోడి కాదు పందెం పుంజు. పందెంలో పాల్గొనకుండానే ఒకరి మృతికి కారణమైంది. చనిపోయింది మరో కోడిపుంజు కాదు ఏకంగా ఓ వ్యక్తి. దీంతో పోలీసులు నాలుగురోజులుగా దానిని తెచ్చి తమ సంరక్షణలో ఉంచారు. కొంతమంది ఆకతాయిలు పోలీస్‌ ఠాణా ఆవరణలోని కోడిని ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచి ‘కోడిని అరెస్టుచేసిన పోలీసులు’ అంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో పోలీసులు పందెం కోడిపుంజులా రోషంతో మండిపడుతున్నారు. ఇంతకీ జరిగింది ఏమిటంటే.. ఈనెల 22న జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తునూర్‌లోని ఎల్లమ్మ ఆలయ సమీపంలో పలువురు వ్యక్తులు కోడి పందేల నిర్వహణకు సిద్ధమయ్యారు. వెల్గటూర్‌ మండలం కొండాపూర్‌కు చెందిన తనుగుల సతీష్‌ కోడి కాలికి కత్తి కట్టి, మరో కాలికి కడుతుండగా అది తప్పించుకునేందుకు యత్నించింది. అప్పటికే మరో కాలికి కట్టి ఉన్న పదునైన కత్తి.. సరిగ్గా సతీష్‌ మర్మాంగాలకు తగిలడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించాడు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగినా ‘వ్యక్తి మృతికి కారణమైన’ కోడిని పోలీసులు తమ ‘అదుపులోకి తీసుకున్నారు.’ దీనిపై గొల్లపల్లి ఎస్సై బి.జీవన్‌ను వివరణ కోరగా దర్యాప్తులో భాగంగా ప్రస్తుతం దానిని కోళ్లఫారంలో ఉంచి సంరక్షిస్తున్నామని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- గొల్లపల్లి, న్యూస్‌టుడే


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు