
తాజా వార్తలు
సన్‌రైజర్స్ అభిమానులకు శుభవార్త
తిరిగి బరిలోకి దిగుతున్నా: వార్నర్
ఇంటర్నెట్‌డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు శుభవార్త. ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ ఆడనున్నట్లు తెలుస్తోంది. గజ్జల్లో గాయం నుంచి కోలుకోవడానికి ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని వార్నర్ సోమవారం తెలిపిన సంగతి తెలిసిదే. దీంతో రెండు నెలల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 14వ సీజన్‌కు అతడు అందుబాటులో ఉండడని జోరుగా ప్రచారం సాగింది. అయితే తాజాగా తన గాయంపై వార్నర్ స్పష్టత ఇచ్చాడు.
గాయం తీవ్రత మరో కొన్ని నెలలు ఉంటుందని, అప్పటివరకు మైదానాన్ని వీడాల్సిన అవసరం లేదని తెలిపాడు. వచ్చే నెలలోనే బరిలోకి దిగుతున్నట్లు ట్వీట్ చేశాడు. ‘‘నిన్న రాత్రి నేను చేసిన వ్యాఖ్యలకు స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. గజ్జల్లో నొప్పిని పూర్తిగా అధిగమించడానికి కనీసం మరో ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుంది. కానీ మార్చి 4 నుంచే న్యూసౌత్‌వేల్స్ జట్టు తరఫున తిరిగి బరిలోకి దిగుతున్నా’’ అని వార్నర్ ట్వీట్ చేశాడు. ఈ వ్యాఖ్యలతో వార్నర్ ఐపీఎల్ ఆడతాడని స్పష్టంగా తెలుస్తోంది.
కాగా, భారత్‌తో జరిగిన రెండో వన్డేలో వార్నర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ చేస్తుండగా గజ్జల్లో గాయమవ్వడంతో నొప్పితో విలవిలలాడుతూ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత టీ20 సిరీస్‌కు దూరమైనా, చివరి రెండు టెస్టులకు తిరిగొచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమయ్యాడు.