
తాజా వార్తలు
షకిబ్ ఐపీఎల్‌కు అనుమతి అడిగేసరికి..
బంగ్లాదేశ్ కొత్త నిబంధన!
ఢాకా: బంగ్లదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ ఐపీఎల్లో ఆడేందుకు అనుమతివ్వాలని కోరడంతో ఆ జట్టు క్రికెట్ బోర్డు విస్తుపోయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా బంగ్లా ఏప్రిల్‌లో శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో షకిబ్లాంటి కీలక ఆల్‌రౌండర్ ఐపీఎల్ కోసం అనుమతి కోరడం ఆ క్రికెట్ బోర్డును విస్మయానికి గురిచేసింది. దీంతో ఆటగాళ్ల వార్షిక ఒప్పందంలో ఈ ఏడాది నుంచి కొత్త నిబంధనలు తీసుకురావాలని బంగ్లా బోర్డు నిర్ణయించింది. భవిష్యత్‌లో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ పేర్కొన్నారు.
‘2021 నుంచి ఆటగాళ్ల వార్షిక ఒప్పందంలో కొత్త క్లాజ్(నిబంధన) తీసుకొస్తున్నాం. అందులో ఏ ఆటగాడు ఏ ఫార్మాట్ ఆడాలని అనుకుంటాడో స్పష్టంగా పేర్కొని ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఇతర ఈవెంట్లు ఏమైనా ఉంటే ముందే తెలియజేయాలి. జట్టు కోసం ఎప్పుడు అందుబాటులో ఉంటారో స్పష్టంగా చెప్పాలి. ఇది రాతపూర్వకంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇంతకుముందు ఆటగాళ్లు ఇతర లీగుల్లో పాల్గొనడానికి వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడేది. ఇప్పుడా పరిస్థితి లేదు. రాతపూర్వకంగా ముందే పేర్కొనాలి. దాంతో భవిష్యత్‌లో వారిని మేం అనుమతించలేదని, లేదా బలవంతంగా పెట్టుకున్నామని మాటలు రాకూడదు’ అని నజ్ముల్ వివరించారు.
ఇక షకిబ్ ఐపీఎల్ విషయంపై మాట్లాడిన ఆయన.. ‘మేము కావాలనుకుంటే అతడిని ఆపకపోయేవాళ్లమా?అలా అయితే, లంకతో టెస్టులు ఆడుతుండే కదా! కానీ, మాకలా అవసరం లేదు. ఎవరైతే దేశం కోసం ఆడాలని అనికుంటారో, ఎవరైతే ఆటపై ఇష్టంతో ఉంటారో వాళ్లే కావాలి. మూడేళ్ల కింద షకిబ్ టెస్టులు ఆడనంటే.. అతడికి జట్టు పగ్గాలు అప్పగించాం’ అని బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, షకిబ్ 2011 నుంచి 2017 వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు. 2012, 2014 సీజన్లలో ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో అదే జట్టు మళ్లీ అతడిని కొనుగోలు చేసింది. రూ.3.2 కోట్లకు సొంతం చేసుకుంది.