
ప్రధానాంశాలు
తెరాస అధినేత, సీఎం కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్, వరంగల్ -నల్గొండ- ఖమ్మం ఎమ్మెల్సీ స్థానాలు తెరాసకు అత్యంత ప్రతిష్ఠాత్మకమని.. వాటిలో కచ్చితంగా విజయం సాధించాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంత్రుల నుంచి కార్యకర్తల స్థాయి వరకు ప్రతి ఒక్కరు పట్టుదలతో పనిచేయాలని, అత్యధిక మెజారిటీతో గెలిచేందుకు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని ఆయన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, తెరాస పార్లమెంటరీ పక్ష నేత కె.కేశవరావు, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిరంజన్‌రెడ్డి, సబితారెడ్డి, మల్లారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్.. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని మంత్రులు, ప్రజాప్రతినిధులకు పరిచయం చేశారు. అనంతరం ఆయన వరంగల్-ఖమ్మం- నల్గొండ జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులతో ఎన్నికలపై ఫోన్లో దిశానిర్దేశం చేశారు.
విస్తృత ప్రచారం నిర్వహించాలి
‘‘తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు దేశానికి మార్గదర్శకంగా నిలిచినా.. కాంగ్రెస్ పార్టీ ఆయనను తగిన విధంగా గౌరవించలేదు. ఆయనకు భారతరత్న పురస్కారంతో పాటు ఇతర గౌరవాలను ఇవ్వాలని భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇతర పార్టీల వైఖరి ఎలా ఉన్నా మనం పీవీని సముచితంగా గౌరవించుకుంటున్నాం. ఆయన చరిత్ర భవిష్యత్తు తరాలకు తెలిసేలా కార్యక్రమాలు చేపట్టాం. తెలంగాణలో పీవీ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఆయన కుమార్తె వాణీదేవిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించాలని నిర్ణయించాం. వరంగల్- ఖమ్మం- నల్గొండ స్థానంలో ప్రస్తుత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి బలమైన అభ్యర్థి కావడంతో ఆయనను పోటీకి నిలిపాం. ఈ రెండు స్థానాలూ మనకు అత్యంత ముఖ్యమైనవి. వీటిలో గెలిచి.. తెరాస సత్తాపై అనుమానాలను పటాపంచలు చేయాలి. పట్టభద్రులు తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. విపక్షాలు దుర్బుద్ధితో చేసే విమర్శలను పట్టించుకోరు. తెరాసకు అండగా ఉంటారు. ఎమ్మెల్సీ అభ్యర్థులపై విస్తృత ప్రచారం నిర్వహించాలి. పట్టభద్రుల ఓటర్ల జాబితాతో ప్రతి ఓటరు ఇంటికి వెళ్లి కలవాలి. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలియజేయాలి. పార్టీ నేతలను ఊరికొకరి చొప్పున బాధ్యులుగా నియమించాలి. ప్రచారానికి మరో 20 రోజుల సమయమే ఉన్నందున అందరూ బాధ్యతలను పంచుకోవాలి’’ అని కేసీఆర్ సూచించారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికల వ్యూహం అమలుపై కేటీఆర్ త్వరలో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తారని సీఎం తెలిపారు. జిల్లాలవారీగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రచార కార్యక్రమాలను రూపొందించుకొని ముందుకు సాగాలన్నారు.
మహిళా శక్తిని నిరూపించండి
‘అన్ని కోణాల్లో ఆలోచించి ఎంపిక చేశాం. సుశిక్షితమైన పార్టీ యంత్రాంగం వెంటే ఉంటుంది. నేతలతో పాటు లక్షల మంది కార్యకర్తలున్నారు. ఎన్నికల్లో పీవీని గుర్తుకు తేవాలి. ప్రత్యర్థులను తిప్పికొట్టి మహిళా శక్తిని నిరూపించాలి’’ అని వాణీదేవికి కేసీఆర్ సూచించారు. అనంతరం ఆమెకు బీఫాం అందజేశారు. పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు, ఇతర కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాణీదేవి, ప్రభాకర్‌రావులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
పీవీ ఘాట్‌కు నివాళులు
సోమవారం ఉదయం వాణీదేవి నెక్లెస్‌రోడ్‌లోని పీవీ ఘాట్‌కు చేరుకుని నివాళులర్పించారు. నామినేషన్ పత్రాలను పీవీ ఘాట్ వద్ద ఉంచి ఆశీర్వాదం తీసుకున్నారు. గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కూడా ఆమె నివాళులర్పించారు. అనంతరం నామినేషన్ దాఖలుకు ఊరేగింపుగా జీహెచ్ఎంసీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. వాణీదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకొని తెలుగుజాతి ఖ్యాతిని పెంచాలని మంత్రి తలసాని కోరారు. వాణీదేవికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, తెరాస ప్రవాస విభాగం సమన్వయకర్త మహేశ్ అభినందనలు తెలిపారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- అమ్మా.. నాన్న.. అన్న... అన్నీ ఆమె!
- గ్లామర్ ఫొటోలతో ఫిదా చేస్తోన్న తారలు
- ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది!
- అమెరికా అప్పెంతో తెలుసా?
- వనస్థలిపురంలో కారు బీభత్సం
- కిమ్ ఆంక్షలు.. రష్యా దౌత్యవేత్తల తిప్పలు
- థ్యాంక్స్ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి
- టీమ్ఇండియా ఇలా చేయదు కదా..!
- తరగతి గదిలో ఉపాధ్యాయురాలిపై చాకుతో భర్త దాడి