
ప్రధానాంశాలు
టీకాల రాజధానిగా హైదరాబాద్
తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
భారత్ బయోటెక్‌కు జినోమ్‌వ్యాలీ ప్రతిభా పురస్కార ప్రదానం
ఘనంగా ప్రారంభమైన బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ ప్రపంచ టీకాల రాజధానిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. మున్ముందు ప్రపంచ జనాభా అంతటికీ టీకాలను అందించే స్థాయికి హైదరాబాద్ చేరుతుందన్నారు. ఇప్పుడు దేశాలన్నీ భారత్, హైదరాబాద్ వైపు చూడడం గర్వకారణమని పేర్కొన్నారు. 60కి పైగా దేశాల రాయబారుల సందర్శనతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జినోమ్‌వ్యాలీని సందర్శించడం నగర ప్రాధాన్యాన్ని చాటిందన్నారు. జీవశాస్త్రాల పెట్టుబడులను రూ. 7.50 లక్షల కోట్లకు పెంచే లక్ష్యంతో తెలంగాణ పురోగమిస్తోందని తెలిపారు. కరోనా ప్రభావం ఉన్నా 2020-21 సంవత్సరంలో జీవశాస్త్రాల రంగం రూ. 3,700 కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని, 14 వేలమందికి ఉపాధి కల్పించిందన్నారు. త్వరలోనే ప్రపంచస్థాయి ఔషధనగరిని, జీవ ఔషధ పరిశ్రమల సౌకర్యాల కేంద్రం బీహబ్‌ను ప్రారంభిస్తామన్నారు. కరోనా నివారణ కోసం భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ టీకా కొవాగ్జిన్ అభివృద్ధిలో భారత్ బయోటెక్ నిబద్ధత, కృషి ప్రశంసనీయమన్నారు. సోమవారం హైదరాబాద్ ఐటీసీ కాకతీయ హోటల్లో ఆయన బయోఆసియా అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు. భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు జినోమ్ వ్యాలీ ప్రతిభా పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు..
యోధులు, శాస్త్రవేత్తల కీలక పాత్ర
‘‘2020 ప్రపంచ మానవాళిపై పెనుప్రభావం చూపింది. కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక, సామాజిక సమస్యలకు తోడు 24.5 లక్షలమంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. విపత్కర సమయంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొల్పడంలో శాస్త్రవేత్తలు చేసిన కృషి ఎంతో గొప్పది. హైదరాబాద్ జీవశాస్త్రాల రంగానికి పర్యాయపదంగా మారింది. భారత్ బయోటెక్ దేశీయ టీకాను ఉత్పత్తి చేసి ప్రపంచానికి హైదరాబాద్ ప్రాధాన్యాన్ని తెలియజేసింది. టీకాల అభివృద్ధిలో బయోలాజికల్-ఇ, ఇండియన్ ఇమ్యూనోలాజికల్ పాలుపంచుకుంటున్నాయి. హెటిరో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ సైతం రష్యన్ టీకా ‘స్పుత్నిక్’ తయారీ చేపట్టాయి. అరబిందో ఫార్మా 450 మిలియన్ డోసుల సామర్థ్యంతో ప్రపంచ స్థాయి వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇంకోజెన్ థెరపిటిక్స్ తెలంగాణలో అభివృద్ధి చేసిన క్యాన్సర్ చికిత్స ఔషధం అంబ్రలిసిబ్.. మొదటిసారిగా అమెరికాకు చెందిన ఆహార, ఔషధ పరిపాలన సంస్థ అనుమతి పొందింది.
త్వరలో బీహబ్, ఔషధ నగరి
ప్రపంచంలోని 10 ప్రధాన ఔషధాల్లో 8 జినోమ్వ్యాలీలోనే ఉత్పత్తి అవుతున్నాయి. త్వరలోనే ఇక్కడ జీవ ఔషధ పరిశ్రమల సౌకర్యాల సంస్థ బీహబ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇక్కడ వైద్యపరికరాల ఉత్పత్తి పార్కులో 40 పరిశ్రమలు నడుస్తున్నాయి. మెడ్‌ట్రానిక్ తదితర సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. దేశానికి మణిహారంగా నిలిచే ఔషధనగరికి త్వరలోనే శంకుస్థాపన చేస్తాం. డిజిటల్ వైద్యకేంద్రం, జీన్థెరపీ, రసాయనాల కేంద్రాలు, విశ్వవిద్యాలయం ఇందులో ఉంటాయి. బయో ఆసియా సదస్సుతో ప్రపంచ ఆరోగ్య రంగానికి మరింత మెరుగులు దిద్దేందుకు అందరూ కలిసి రావాలి’’ అని కేటీఆర్ కోరారు.
ప్రతిభా పురస్కారం ప్రదానం
భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు జినోమ్ వ్యాలీ ప్రతిభా పురస్కారం (ఎక్స్‌లెన్స్ అవార్డు)ను మంత్రి కేటీఆర్ అందజేశారు. జీవశాస్త్రాల రంగంలో అత్యుత్తమ సేవలందించిన వారికి బయో ఆసియా సదస్సు సందర్భంగా ఈ పురస్కారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. కరోనా టీకా కొవాగ్జిన్‌తో పాటు రేబిస్, జపనీస్ ఎన్సెఫలైటిస్, పోలియో, టైఫాయిడ్ టీకాలను అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ప్రాణాలను కాపాడడానికి చేస్తున్న కృషికి గాను ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు నిర్వాహకులు తెలిపారు.
సైటివాతో అవగాహన ఒప్పందం
ఈ సదస్సు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రసిద్ధ ఔషధ సంస్థ సైటివా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ జినోమ్‌వ్యాలీలో జీవ ఔషధ కేంద్రం ఏర్పాటు చేస్తుంది. ఇందులో వృత్తిపరమైన శిక్షణ, సాంకేతిక, సలహా సేవలు, మౌలిక వసతుల సాయం వంటివి అందిస్తుంది.
హైదరాబాద్ నుంచే 65 శాతం వ్యాక్సిన్లు: కృష్ణ ఎల్ల
ఈ సందర్భంగా కృష్ణ ఎల్ల మాట్లాడుతూ, ‘‘ఆ పురస్కారం మాకు మాత్రమే కాదు. ఔషధ, జీవశాస్త్రాల వ్యవస్థకు దక్కిందని భావిస్తున్నాను. ప్రస్తుతం 65 శాతం టీకాలు హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. అది భారత్ బయోటెక్ నుంచైనా.. బయోలాజికల్-ఇ, శాంతా బయోటెక్ నుంచైనా వస్తున్నాయి. కానీ సరైన ప్రచారం మాత్రం రావడం లేదు. హైదరాబాద్‌కు రావల్సినంత గుర్తింపు లభించడం లేదు. భవిష్యత్తులో ఎలాంటి మహమ్మారులకైనా టీకాలు హైదరాబాద్ నుంచే వస్తాయని భరోసా ఇస్తున్నా. టీకాల ఉత్పత్తిలో అతిపెద్ద సమూహం హైదరాబాద్‌లో తప్ప ఎక్కడా లేదు.
చైనాతో పాటు ఎక్కడా ఇది కనిపించదు. జినోమ్‌వ్యాలీ అత్యుత్తమమైంది. ప్రపంచానికి టీకాల కేంద్రంగా మారింది’’ అని అన్నారు. ప్రారంభోత్సవంలో తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నరసింహారెడ్డి, జీవశాస్త్రాల సంచాలకుడు శక్తి నాగప్పన్, డాక్టర్ రెడ్డీస్ ఛైర్మన్ సతీష్‌రెడ్డి, నోవార్టిస్ గ్లోబల్ హెడ్ నవీన్ గుల్లపల్లి తదితరులు పాల్గొన్నారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- అమ్మా.. నాన్న.. అన్న... అన్నీ ఆమె!
- ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది!
- గ్లామర్ ఫొటోలతో ఫిదా చేస్తోన్న తారలు
- అమెరికా అప్పెంతో తెలుసా?
- వనస్థలిపురంలో కారు బీభత్సం
- కిమ్ ఆంక్షలు.. రష్యా దౌత్యవేత్తల తిప్పలు
- థ్యాంక్స్ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి
- టీమ్ఇండియా ఇలా చేయదు కదా..!
- తరగతి గదిలో ఉపాధ్యాయురాలిపై చాకుతో భర్త దాడి