
ప్రధానాంశాలు
ఎన్ఐఏ కోర్టు పరిధిలోనే ఉండాలని షరతు
ముంబయి: ఈనాడు, హైదరాబాద్: ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయిన సామాజిక ఉద్యమకారుడు, కవి వరవరరావు (82)కు బాంబే హైకోర్టు ఆరు నెలల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. క్షీణిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని, వయసును, ఆసుపత్రుల్లోని వసతుల లేమిని దృష్టిలో ఉంచుకొని మానవతా దృష్టితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జస్టిస్ ఎస్.ఎస్.షిందే, జస్టిస్ మనీశ్ పటాలేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోన్న ఎల్గార్ పరిషద్ కేసులో నిందితుడైన వరవరరావు 2018 ఆగస్టు 28 నుంచి కస్టడీలో ఉన్నారు. పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. బెయిల్ గడువు ముగిసే వరకూ ముంబయిలోని ఎన్ఐఏ కోర్టు పరిధిలోనే ఉండాలని, సహ నిందితులతో మాట్లాడరాదని ధర్మాసనం షరతులు విధించింది. పోలీస్ స్టేషన్‌కు పక్షం రోజులకోసారి వాట్సప్ వీడియో కాల్ చేయాలని, తన నివాసం వద్ద పెద్ద సంఖ్యలో సందర్శకులను గూమిగూడనీయరాదని స్పష్టం చేసింది. కేసుకు సంబంధించి ఎలాంటి ప్రకటనలూ ఇవ్వరాదని పేర్కొంది.
ఇదీ నేపథ్యం
మహారాష్ట్రలోని బీమా-కోరేగావ్‌లో 2018 జనవరిలో చోటుచేసుకున్న అల్లర్లలో మావోయిస్టుల కుట్ర ఉందని పుణెలో పోలీసులు కేసు నమోదు చేశారు. 2017 డిసెంబరు 31న ఎల్గార్ పరిషద్ అనే సంస్థ పుణెలో నిర్వహించిన కార్యక్రమం వెనుకా మావోయిస్టులు ఉన్నారని, ఇక్కడ జరిగిన ప్రసంగాలే మర్నాడు బీమా కోరేగావ్ అల్లర్లకు కారణమయ్యాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించి 2018 జూన్‌లో దేశవ్యాప్తంగా ఆరుగుర్ని అరెస్టు చేశారు. ఇందులో ఢిల్లీకి చెందిన పౌరహక్కుల నేతలు రోనా విల్సన్, రోనా జాకొబ్, దళిత హక్కుల నాయకుడు ఎల్గార్ పరిషద్‌కు చెందిన సుధీర్ ధవాలె, షోమ సేన్, మహేష్ రౌత్, న్యాయవాది సరేంద్ర గాడ్లింగ్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా విల్సన్ ఇంట్లో మూడు లేఖలు స్వాధీనం చేసుకున్నామని, వాటిలోని ఒకదాన్లో ప్రధాని మోదీరాజ్‌కు చరమగీతం పాడేందుకు వీలైతే రాజీవ్‌గాంధీ తరహాలో అంతమొందించాలని ఉందని పోలీసులు వెల్లడించారు. మరో లేఖలో వరవరరావు పేరు ఉందని, దేశవ్యాప్తంగా దాడులు జరిపే బాధ్యతలను వరవరరావుకు అప్పగించారని పోలీసులు తెలిపారు. ఈ లేఖ ఆధారంగా 2018 ఆగస్టులో ఆయనను అరెస్టు చేసి తీసుకెళ్లారు. తర్వాత సుప్రీంకోర్టు వరవరరావు సహా అరెస్టయిన మిగతావారికీ గృహ నిర్బంధం విధించింది. ఈ గడువు ముగియడంతో వరవరరావును 2018 నవంబరు 17న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన మహారాష్ట్ర జైల్లోనే ఉంటున్నారు. అక్కడే ఆయన అనేకమార్లు అనారోగ్యానికి గురయ్యారు. కరోనా కూడా సోకడంతో ఆయనను విడుదల చేయాలని కుటుంబ సభ్యులు, పౌరహక్కుల నాయకులు అనేకమార్లు న్యాయస్థానాలను, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- అమ్మా.. నాన్న.. అన్న... అన్నీ ఆమె!
- ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది!
- గ్లామర్ ఫొటోలతో ఫిదా చేస్తోన్న తారలు
- అమెరికా అప్పెంతో తెలుసా?
- వనస్థలిపురంలో కారు బీభత్సం
- కిమ్ ఆంక్షలు.. రష్యా దౌత్యవేత్తల తిప్పలు
- థ్యాంక్స్ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి
- టీమ్ఇండియా ఇలా చేయదు కదా..!
- తరగతి గదిలో ఉపాధ్యాయురాలిపై చాకుతో భర్త దాడి