
తాజా వార్తలు
ఉత్తేజాన్ని నింపేలా.. ఆశలు చిగురించేలా..
కనువిందు చేస్తున్న పోలీసు స్టేషన్లు
ఇంటర్నెట్ డెస్క్: పోలీసు స్టేషన్ అంటేనే గంభీర వాతావరణం ఉంటుంది. ఠాణాను చూస్తే చాలా మంది బయపడుతుంటారు. దానిని ఓ సమస్యాత్మక ప్రదేశంగా భావిస్తుంటారు. తమిళనాడులోని రాణిపేట జిల్లాలో ఉన్న ఠాణాలు మాత్రం అందుకు భిన్నంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. రంగురంగుల బొమ్మలతో అలరిస్తుంటాయి. దీని వెనక ఓ విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి గొప్ప ఆలోచన ఉంది. గతంలో రాణిపేట జిల్లాకు ఎస్పీగా పనిచేసిన మిల్వగనన్ ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. రాణిపేట గతంలో వెల్లూరు జిల్లాలో ఉండేది. 2019లో వెల్లూరును మూడు జిల్లాలుగా విభజించడంతో రాణిపేట జిల్లాగా ఏర్పడింది. ఈ జిల్లాకు మొదటి ఎస్పీగా మిల్వగనన్ పనిచేశారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడి పోలీసింగ్‌లో ఆయన పలు మార్పులు తీసుకొచ్చారు. అందులో భాగమే ఠాణాల సుందరీకరణ.
పోలీసు స్టేషన్ అనేది ఓ కఠిన ప్రదేశంగా ఉండకూడదని మిల్వగనన్ పేర్కొంటారు. క్షణికావేశంలో తప్పులు చేసిన వారి జీవితం జైల్లోనే మిగిలిపోకూడదని ఆయన అంటారు. ఈ పెయింటింగ్‌లు వారి జీవితాల్లో ఉత్తేజాన్ని నింపాలని, ఆశలు చిగురించేలా చేయాలని ఆయన అభిప్రాయం. రాణిపేట జిల్లాలోని 22 పోలీసు స్టేషన్లను పెయింటింగ్‌లతో అలంకరించేలా చేశారు. రూ.5 లక్షలతో ప్రారంభించిన ఈ వినూత్న కార్యక్రమంలో ప్రముఖ రంగుల తయారీ సంస్థ నిప్పన్ కూడా పాలుపంచుకుంటోంది. వాటితోపాటు స్టేషన్ల విజిటింగ్ గదుల్లో లైబ్రరీలు, మహిళా పోలీసు స్టేషన్లలో మినీ పార్కులు కూడా ఏర్పాటు చేశారు. మిల్వగనన్ ఆలోచనను, దానిని ఆచరణలో పెట్టేందుకు చేసిన కృషిని సామాజిక కార్యకర్తలు, జిల్లా వాసులు కొనియాడుతున్నారు.