close

సంపాదకీయం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మొండిజబ్బుకు మెరుగైన చికిత్స

త్వరలో రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల్ని ప్రైవేటీకరించనున్నట్లు ఇటీవల బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మల చేసిన ప్రకటన- జాతీయీకరణ అనంతరం అర్ధ శతాబ్దం దరిమిలా దిశ మార్పుపై దేశంలో చర్చోపచర్చలు రేకెత్తించింది. ప్రైవేటీకరణకు ప్రతిపాదిత బ్యాంకుల జాబితా కూర్పు వార్తల్ని ఆర్థికశాఖ సహాయమంత్రి ఖండిస్తుండగా- బ్యాంకుల తలరాత మార్చే నిమిత్తం రెండు చట్టాల్లో సంస్కరణలు ఈ ఏడాది తథ్యమని మరోపక్క గట్టిగా వినవస్తోంది. నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏలు) భారీగా పేరుకుపోతున్న తరుణంలో ప్రభుత్వరంగ బ్యాంకులకు మూలధనం బదలాయించేకన్నా, జనావళికి మౌలిక వసతులపై వ్యయీకరణ మెరుగన్న అమాత్యుల వాణి- ప్రభుత్వ ఆలోచనా ధోరణిని ప్రస్ఫుటీకరిస్తోంది. నిరుడు యెస్‌ బ్యాంక్‌, ఈమధ్య లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ సమస్యల్లో చిక్కుకుని చతికిలపడ్డ తీరు- ప్రైవేటు రంగానా ఎన్‌పీఏల తాకిడిని కళ్లకు కడుతోంది. ఐడీబీఐ సహా దేశంలోని 19 ప్రైవేటు బ్యాంకుల్లో ఎన్‌పీఏలుగా వ్యవహరించే మొండి బాకీల రాశి రెండు లక్షల కోట్ల రూపాయలకు పైబడినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ అంశాన్నే లేవనెత్తుతున్న ఏఐబీఈఏ(అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం)- పారు బాకీల పేరిట ప్రైవేటీకరణకు మొగ్గే బదులు పెద్ద బకాయిలు వసూలయ్యేలా ప్రభుత్వం నుంచి సమధిక సహకారాన్ని అర్థిస్తోంది. పారు బాకీలుగా ఖర్చు రాసేసిన వాటిలో రూ.2.33 లక్షల కోట్లను నాలుగేళ్ల వ్యవధిలో ప్రభుత్వరంగ బ్యాంకులు తిరిగి రాబట్టుకోగలిగినట్లు ఆర్థిక శాఖే ఆమధ్య పార్లమెంటుకు నివేదించింది. ప్రభుత్వ తోడ్పాటు జతపడి సాధ్యమైనంతవరకు మొండి బకాయిలు వసూలైతే, అంతకన్నా కావాల్సింది ఏముంది?
దివాలా చట్టం తెచ్చినా ఎన్‌పీఏల పరిష్కరణ ఒక కొలిక్కి రాలేదన్న రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ సారథి దువ్వూరి సుబ్బారావు, ‘ధనహర్తా ఆఫ్‌ మలేసియా’ బాణీలో ‘బ్యాడ్‌ బ్యాంక్‌’ ఏర్పాటుకు ఆరు నెలల క్రితం ఓటేశారు. పేరుకుపోయిన మొండి బాకీల్ని ఒక సంస్థకు బదలాయించి వసూళ్ల ప్రక్రియను క్రమబద్ధీకరించే వ్యవస్థను నెలకొల్పడం ఎంత ముఖ్యమో, పెద్దయెత్తున పారు పద్దుకు దారితీసిన పరిస్థితుల్ని చక్కదిద్ది బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టడం అంతే కీలకం. ఉద్దేశపూర్వక ఎగవేతదారుల చిత్రాల్ని ప్రభుత్వరంగ బ్యాంకులు విస్తృత ప్రచారంలోకి తేవాలన్న ఆర్‌బీఐ ఆదేశాలు వాస్తవిక కార్యాచరణలో నీరోడుతున్నాయి. తిరిగి చెల్లించే సామర్థ్యం, సంకల్పం కొరవడ్డాయని తెలిసీ ఘరానా ఆర్థిక నేరగాళ్లకు కోట్లకు కోట్లు దోచిపెట్టిన ఇంటిదొంగలు, విధిద్రోహుల నిర్వాకాలే మొండి బాకీల పెను సంక్షోభానికి ప్రధాన కారణం. సిబ్బంది చేతివాటం కారణంగా సగటున ప్రతి నాలుగు గంటలకో బ్యాంక్‌ మోసం చోటుచేసుకుంటున్నదని లెక్కలు తేల్చీ, సరైన దిద్దుబాటు చర్యలు తీసుకునే బాధ్యతను గాలికొదిలేసిన ఆర్‌బీఐ అలసత్వమూ క్షమించరానిది. ఒక కేసు విచారణలో భాగంగా రుణాల మంజూరుకు సంబంధించి మార్గదర్శకాలు, విధివిధానాలను శాసన నిర్మాతలు, రిజర్వ్‌ బ్యాంక్‌ సాకల్యంగా సమీక్షించి అవసరమైన మరమ్మతు చర్యలు చేపట్టాల్సిందిగా కర్ణాటక ఉన్నత న్యాయస్థానం మొన్నీమధ్యే నిర్దేశించింది. తక్షణం జరగాల్సిందే అది! ఏడాదిన్నర క్రితం హేతుబద్ధీకరణ యోచనతో ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్యను 27నుంచి 12కు కుదించిన కేంద్రం- లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లకు నెలవైన వ్యవస్థ భావి గతిరీతులపై ఆచితూచి ముందడుగేయాలి. బ్యాంకింగ్‌ అనేది దేశార్థికానికి చెందిన వ్యూహాత్మక రంగం. దాని మెరుగుదలకు, బాగుసేతకు ఉద్దేశించిన చర్యలూ అంతే వ్యూహాత్మకంగా దీర్ఘకాలిక దృష్టితో పదును తేలడం జాతికి ప్రాణావసరం!

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న

రుచులు