యువతలో మార్పు తీసుకొస్తాం : పోలీస్‌ కమిషనర్‌
eenadu telugu news
Published : 28/10/2021 03:02 IST

యువతలో మార్పు తీసుకొస్తాం : పోలీస్‌ కమిషనర్‌

మహిళా మిత్ర సభ్యులు, మహిళా పోలీసులతో మాట్లాడుతున్న పోలీస్‌ కమిషనర్‌ బి.శ్రీనివాసులు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : గంజాయికి అలవాటు పడిన యువతలో మార్పు తీసుకువచ్చేందుకు విజయవాడ పోలీస్‌శాఖ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని నగర పోలీస్‌ కమిషనర్‌ బి.శ్రీనివాసులు పేర్కొన్నారు. ఏడాదిన్నరగా విజయవాడ కమిషనరేటు పరిధిలో మత్తు పదార్థాలకు, ప్రధానంగా గంజాయికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సదరు యువతను గుర్తించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ చేస్తున్నామని చెప్పారు. గంజాయి తాగుతూ గతంలో పట్టుబడిన యువతకు వారి తల్లిదండ్రులకు బుధవారం మధ్యాహ్నం లబ్బీపేటలోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటరులో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. సీపీ బి.శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. చాలా మంది తల్లిదండ్రులకు తమ పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారనే విషయం తెలియదన్నారు. ఏడాదిన్నర కాలంలో 560 మంది అలవాటు పడినట్లు గుర్తించామన్నారు. వారిలో మార్పు తీసుకువచ్చేందుకు సైకాలజిస్టులతో కౌన్సెలింగ్‌ ఇప్పిస్తున్నామని తెలిపారు. అవసరమైన వారిని డీ ఎడిక్షన్‌ సెంటర్లకు పంపుతున్నట్లు వివరించారు. బాధితుల్లో చాలా మంది విద్యార్థులే ఉన్నారని, మొదటి తప్పుగా భావించి వారిపై కేసులు పెట్టకుండా కౌన్సెలింగ్‌ ద్వారా మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మరోసారి పట్టుపడితే కేసులు పెడతామని హెచ్చరించారు. గంజాయి సరఫరా చేస్తున్న 550 మందిపై 240 కేసులు నమోదు చేసి, అరెస్టులు చేసామని తెలిపారు. రెండేళ్లలో 8 వేల కిలోల గంజాయి పట్టుకున్నామని, ఇది విజయవాడకు సరఫరా అయ్యేది కాదని విజయవాడ మీదుగా వెళ్లేదని వివరించారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గత రెండు వారాల్లో 27 కళాశాలలకు వెళ్లి మత్తు పదార్థాలతో కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారని చెప్పారు. సైకాలజిస్ట్‌ డాక్టర్‌ టి.ఎస్‌.రావు మత్తు పదార్థాలతో జరిగే నష్టాన్ని యువతకు వివరించారు. కార్యక్రమంలో డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, సీఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అసాంఘిక శక్తుల సమాచారం ఇవ్వండి

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : బాల్య వివాహాలు, బాల కార్మికులు, వరకట్న వేధింపులతో బాధపడుతున్న మహిళలు, మహిళలను వేధించే వారి సమాచారం మహిళా పోలీసులు, మహిళామిత్ర సభ్యులు పోలీసు అధికారులకు తెలియజేయాలని పోలీస్‌ కమిషనర్‌ బి.శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి ఆయన అన్ని పోలీస్‌స్టేషన్లలోని మహిళామిత్ర సభ్యులు, మహిళా పోలీసులతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ.. ఒంటరి మహిళలు, వృద్ధులపై జరిగే లైంగిక వేధింపుల నివారణ, భద్రత కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ మొబైల్‌ యాప్‌ ఆవశ్యతను ఇంటింటికి వెళ్లి తెలియజేయాలన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, అనుమానాస్పద వ్యక్తులు, నేరస్థులు, రౌడీల కార్యకలాపాలు, దొంగలు, దొంగ సొత్తు కొనేవారి గురించి పూర్తి సమాచారం సేకరించి ఆయా స్టేషన్‌ అధికారులకు ఇవ్వాలని పేర్కొన్నారు. అడ్మిన్‌ డీసీపీ మేరీప్రశాంతి, దిశ ఏసీపీ వి.వి.నాయుడు, సీఐ వాసవి, వాసవ్య మహిళా మండలి సభ్యురాలు డాక్టర్‌ కీర్తి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని