రైల్వేస్టేషన్‌లో పట్టుబడిన దొంగ సరకు
eenadu telugu news
Updated : 28/10/2021 05:35 IST

రైల్వేస్టేషన్‌లో పట్టుబడిన దొంగ సరకు

ఈనాడు, అమరావతి

పన్నులు చెల్లించని సరకు

విజయవాడ రైల్వేస్టేషన్‌ మీదుగా పన్నులు చెల్లించకుండా తరలించే సరకు రవాణా మళ్లీ జోరందుకుంది. కొవిడ్‌ నేపథ్యంలో అధికారులు కూడా కొంత ఉదాసీనంగా ఉండడంతో మళ్లీ దొంగ సరకు రవాణా పెరిగింది. తాజాగా విజయవాడ రైల్వేస్టేషన్‌లో 70 టన్నుల సరకును రాష్ట్ర పన్నుల శాఖ విజయవాడ 2 డివిజన్‌కు చెందిన అధికారులు బుధవారం గుర్తించి పట్టుకున్నారు. ఒకటిన్నర బోగీల్లో ఈ సరకు దిల్లీ నుంచి విజయవాడకు వస్తుండగా.. సమాచారం అందుకున్న అధికారులు దాడులు చేశారు. ఎలక్ట్రికల్‌ సామగ్రి, గృహోపకరణాలు, ఫుట్‌వేర్‌, రెడీమేడ్‌ దుస్తులు, మందులు సహా పలు రకాల సరకు ఈ బాక్సుల్లో ఉన్నాయి. రైల్వే నుంచి ప్రైవేటుగా బోగీలను అద్దెకు తీసుకుని కొంతమంది గుత్తేదారులు సరకు తీసుకొస్తున్నారు. పన్నులు చెల్లించిన బిల్లులు ఉన్నాయా.. లేదా అనేది పరిశీలించిన తర్వాత జరిమానా విధిస్తామని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌ కేంద్రంగా దొంగ సరకు రవాణా భారీఎత్తున జరుగుతుంటుంది. గతంలోనూ ఒకేసారి 400కు పైగా రెడీమేడ్‌ దుస్తుల మూటల(బోరేలు)ను స్వాధీనం చేసుకున్నారు. రూ.2.5 కోట్ల విలువైన సరకుగా గుర్తించడంతో.. అరకోటి వరకు ఆదాయం వాణిజ్య పన్నులశాఖకు సమకూరింది. తాజాగా అదేస్థాయిలో భారీఎత్తున మరోసారి సరకు పట్టుబడింది. దీనికి సంబంధించిన యజమానాలు ఎవరూ ఇంతవరకూ రాలేదు. సరకు యజమానులు బిల్లులు తీసుకుని రావాలని అధికారులు సూచించినట్టు తెలిసింది. రైల్వేస్టేషన్‌లో రాత్రి వరకు సరకు ఉంచిన తర్వాత.. అక్కడి నుంచి రాష్ట్ర పన్నుల శాఖ కార్యాలయానికి తరలించారు.

ప్రైవేటు బోగీల్లోనే సరకు.. రైల్వేకు సంబంధించిన బోగీలను కొంతమంది గుత్తేదారులు అద్దెకు తీసుకుని.. ఇలా చెన్నై, ముంబయి, దిల్లీ నుంచి సరకును భారీగా తీసుకొస్తూ ఉంటారు. దీపావళి, దసరా, సంక్రాంతి.. ఇలా పండుగ ఏదొచ్చినా రూ.కోట్ల విలువైన దొంగసరకు బెజవాడకు రైలు బోగీల్లో దిగుమతి అవుతూ ఉంటుంది.. రైల్వే, పన్నుల శాఖ సిబ్బంది మధ్య పరస్పర సంబంధాలు లేకపోవడం దశాబ్దాలుగా దొంగ సరకు రవాణాదారులకు వరంగా మారుతోంది.

విలువ కట్టడంలోనూ తేడా.. దొంగ సరకు భారీగా దొరికిన సమయంలోనూ వాటి యజమానులు అధికారులతో బేరసారాలు చేసుకుని విషయం బయటకు రాకుండా తరలించుకు వెళ్లిపోయిన సంఘటనలు గతంలో అనేకం జరిగాయి. దొరికిన మూటలు, బాక్సుల్లో ఏం ఉన్నాయనేది విప్పి చూసిన తర్వాత.. సరకు విలువ కట్టి.. దానిని బట్టి జరిమానా, పన్ను విధించాల్సి ఉంటుంది. ఒక్కోసారి నామమాత్రంగా జరిమానా కట్టించుకుని వదిలేస్తుంటారు. దీనివల్ల రాష్ట్ర పన్నుల శాఖ ఆదాయానికి భారీగా గండిపడుతుంది. చాలావరకూ ఒకటి రెండు మూటలను విప్పి చూసి.. మిగతా అన్నింటికీ కలిపి ఒకేలా ధరను నిర్ణయించేసి.. వదిలేస్తుంటారు. ఈ సరకులో రోడ్డు పక్కన అమ్మే చిరు వ్యాపారుల నుంచి పెద్ద షాపింగ్‌ మాల్స్‌కు చెందిన విలువైనవి ఉంటాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని