రుచి ఉండదు.. కడుపు నిండదు..!
eenadu telugu news
Updated : 28/10/2021 12:01 IST

రుచి ఉండదు.. కడుపు నిండదు..!

నూజివీడు, న్యూస్‌టుడే

ఇటీవల చెత్త కుండీలో వేసిన ఊతప్పాలు

మెస్‌ల్లో భోజనం బాగా లేదని నూజివీడు ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రుచీ, పచీ లేని కూరలు, నీళ్ల సాంబారు, పలుచని పెరుగు వడ్డిస్తున్నారని చెబుతున్నారు. అల్పాహారంలో ఒక ఇడ్లీ, సాంబారు తప్ప మిగిలినవి బాగుండటం లేదని, అన్నం, సాంబారు తప్ప మిగిలిన ఏ ఆహార పదార్థాన్ని కూడా రెండో సారి అడిగితే వేయడం లేదని ఆరోపిస్తున్నారు. మెస్‌ కమిటీ సభ్యులు, అధికారులు వచ్చినపుడు మాత్రం అప్రమత్తమవుతున్నారని, మిగిలిన సమయాల్లో పరిస్థితి మొదటికి వస్తోందని పేర్కొంటున్నారు.

ఒకే గుత్తేదారు: ప్రస్తుతం ట్రిపుల్‌ఐటీలో మూడు వేల మంది విద్యార్థులు ఉన్నారు. వెయ్యి మందికి ఒకటి చొప్పున మూడు మెస్‌లు ఏర్పాటు చేయాలి. ముగ్గురు గుత్తేదారులు ఉండాలి. కానీ బినామీ పేర్లతో ఒకే గుత్తేదారు మూడింటినీ నడుపుతున్నారు. ఆయన విజయవాడలో ఉంటారు. ఇక్కడ ఒక సూపర్‌వైజర్‌ని పెట్టారు. మెస్‌ల్లో అనుభవం లేని వంట వాళ్లని నియమించారు. మిగిలిన సిబ్బందిదీ అదే పరిస్థితి. అసలు వంటపై అవగాహన రాని వారిని గుత్తేదారు నియమించడంతో ఆహారం బాగుండడం లేదని చెబుతున్నారు. సుమారు వారం కిందట ఉదయం అల్పాహారంగా ఊతప్పం ఇచ్చారు. అవి ఉడక లేదు. పిండి పిండిగా ఉండటంతో ఆ రోజు ఎక్కువ మంది చెత్త కుండీలో వేసి తరగతులకు వెళ్లినట్లు విద్యార్థులు చెప్పారు.

మెస్‌లో భోజనం చేస్తున్న విద్యార్థులు

కొత్తవారిని రానీయకుండా...

ఇక్కడ మెస్‌ కాంట్రాక్టు దక్కించుకునేందుకు టెండర్లు పిలిస్తే గుత్తేదారులు ఒక్కటవుతున్నారు. కొత్తవారిని రానివ్వడం లేదు. సుమారు మూడేళ్ల కిందట టెండర్లు ముగిశాయి. తరువాత టెండర్లు పిలిచినా లిటిగేషన్లు పెట్టడం, కోర్టును ఆశ్రయించడం వంటి చర్యలతో పాత వారికే నామినేషన్‌ పద్ధతిన టెండర్లు కట్టబెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత గుత్తేదారుకు పాత ధరకే నామినేషన్‌ పద్ధతిలో కాంట్రాక్టు ఇచ్చారు. గతంలో అల్పాహారం, భోజనం, స్నాక్స్‌కు కలిపి ఒక్కో విద్యార్థికి రూ.78 చొప్పున చెల్లించేవారు. కరోనా నేపథ్యంలో సరకుల ధరల్లో తేడా రావడం వల్ల గుత్తేదారు నాణ్యమైన ఆహారం అందించలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. కానీ ఆ ధరకు భోజనం సరఫరా చేస్తానని ఒప్పుకున్న గుత్తేదారు.. మెనూ అమలు చేయాల్సిందే. కాంట్రాక్టు నిబంధనను గాలికి వదిలివేయడం, కనీసం వంట చేతగాని వారిని నియమించడం, సరిగా ఉడకకుండా, సరిపడా పెట్టకుండా చేయడం వంటి చర్యల పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త టెండర్లు పిలిచారు. ఈ నెల 29న ఖరారు కానున్నాయి.

వెంటనే చర్యలు తీసుకుంటా

- ఆచార్య జీవీఆర్‌ శ్రీనివాసరావు, ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌

భోజనం బాగా లేదనే విషయం విద్యార్థులు ఇంతవరకూ నా దృష్టికి తీసుకురాలేదు. నేను మెస్‌ వాళ్లకి సమాచారం ఇవ్వకుండా తరచూ తనిఖీకి వెళ్తుంటాను. వెంటనే మెస్‌ కమిటీ సభ్యులతో సమావేశమై తగిన చర్యలు తీసుకుంటాను. విద్యార్థులకు మంచి భోజనం అందేలా చూస్తాను.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని