దూరం.. భారం..
eenadu telugu news
Updated : 28/10/2021 05:38 IST

దూరం.. భారం..

ప్రభుత్వ నిర్ణయంతో ఎయిడెడ్‌కు కష్టాలు

ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు●

* పొన్నూరుకు చెందిన నవీన్‌కుమార్‌ ఓ ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. గత విద్యా సంవత్సరంలో రూ.3300 ఫీజు చెల్లించాడు. ఈ విద్యా సంవత్సరంలో ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాల ప్రైవేటు డిగ్రీ కళాశాలగా మారడంతో రూ.11,500 చెల్లించాలని అధ్యాపకులు చెప్పారు. ఆ విద్యార్థి తండ్రి కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆర్థి.క పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. కుటుంబ జీవనం కొనసాగడమే కష్టమైన తరుణంలో అంత ఫీజు చెల్లించడం తలకు మించిన భారం కావడంతో ప్రత్యామ్నాయం వైపు ఆలోచిస్తున్నారు.●

* పెదనందిపాడు ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలో పద్మలత బీఎస్సీ చదువుతోంది. ఆ విద్యార్థిని తండ్రి కౌలుకు భూమి తీసుకుని అప్పులు చేసి సాగు చేస్తున్నారు. ఈ తరుణంలో కళాశాల ఫీజు రూ.12000 చెల్లించాల్సి ఉందని అధ్యాపకులు చెప్పడంతో చదివిద్దామా వద్దా అని తర్జనభర్జనలు పడుతున్నారు. విద్యార్థిని గుంటూరు మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశం పొందేందుకు ప్రయత్నిస్తోంది. పెదనందిపాడు నుంచి గుంటూరు వెళ్లడానికి 32 కి.మీ ప్రయాణం చేయాల్సి ఉంది. దూరం కావడంతో పాటు రవాణా ఖర్చులు భారం కానున్నాయి. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలనే ఆలోచనలో పడ్డారు.

న్యూస్‌టుడే, పొన్నూరు

సమాజంలో విద్యను అందరికీ అందించాలనే ఆకాంక్షతో నాడు దాతలు ముందుకు వచ్చి విద్యా సంస్థలు నెలకొల్పారు. ఆ విద్యా సంస్థల్లో విద్యనభ్యసించిన ఎంతో మంది విద్యార్థులు నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎయిడెడ్‌ విద్యా సంస్థలు ప్రైవేటు డిగ్రీ కళాశాలలుగా మారిపోయాయి. ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశం పొందే విద్యార్థులకు ఫీజులు తలకు మించిన భారం అవుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. వీటిల్లో ప్రవేశం పొందని విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరాలంటే రవాణా ఖర్చుల భారం తప్పదని చెబుతున్నారు.

జిల్లాలో 24 ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల్లో 22,750 మంది విద్యార్థులు ఆయా కోర్సుల్లో విద్యనభ్యసిస్తున్నట్లు కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంటర్మీడియెట్‌ విద్య ముగిసిన అనంతరం ఎక్కువ మంది విద్యార్థులు ఇంజినీరింగ్‌, ఫార్మసి రంగాల వైపు మొగ్గుచూపుతున్నారు. కొంత మంది నిరుపేద విద్యార్థులు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం పొందుతున్నారు. ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే ఎయిడెడ్‌ కళాశాలల్లో ఏడాదికి ఆయా కోర్సును అనుసరించి రూ.3వేల నుంచి రూ.5వేల లోపు ఫీజు చెల్లించి విద్యను అభ్యసించారు.

* ఇటీవల ప్రభుత్వం ఎయిడెడ్‌ విద్యా సంస్థలను ప్రైవేటు విద్యా సంస్థలుగా మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింద 70 శాతం సీట్లు కేటాయించారు. ఆ సీట్లు ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం నిర్వహిస్తుందని ప్రకటించారు. 30 శాతం సీట్లను కళాశాల యాజమాన్యం కోటాకు కేటాయించారు. కన్వీనర్‌ కోటా కింద వసూలు చేసే ఫీజుల కంటే యాజమాన్య కోటాకు మూడు రెట్లు వసూలు చేసుకునే వెసులుబాటును కల్పించడంతో విద్యార్థులపై పెనుభారం మోపారు.

* ప్రస్తుతం ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులు చేరే కోర్సుకు అనుగుణంగా రూ.10వేల నుంచి రూ.18వేల వరకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని కళాశాల వర్గాలు చెబుతున్నాయి. నిరుపేద విద్యార్థులు పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి రావడం పెనుభారంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రైవేటు కళాశాలలకు ఫీజులు చెల్లించలేని విద్యార్థులు కోఎడ్యుకేషన్‌లో ప్రవేశం పొందవచ్చని చెబుతున్నారు. చేబ్రోలు, రేపల్లె, మాచర్ల, వినుకొండలో మాత్రమే కోఎడ్యుకేషన్‌ సౌకర్యం ఉంది. మహిళా డిగ్రీ కళాశాలలు బాపట్ల, గుంటూరులోనే ఉన్నట్లు అధ్యాపకులు చెబుతున్నారు.

● పొన్నూరు డిగ్రీ కళాశాలలో పొన్నూరు, పిట్టలవానిపాలెం, అమృతలూరు మండలం నుంచి విద్యార్థులు వచ్చి ఈ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు. పెదనందిపాడు డిగ్రీ కళాశాలలో పెదనందిపాడు, కాకుమాను, ప్రత్తిపాడు మండలాలు, తెనాలి డిగ్రీ కళాశాలలో తెనాలి, వేమూరు, అమృతలూరు, కొల్లూరు, కొల్లిపర్ల మండలాలు, గుంటూరు కార్పొరేషన్‌లో గుంటూరు, మేడికొండూరు, ఫిరంగిపురం, పెదకాకాని మండలాల నుంచి వచ్చి విద్యనభ్యసిస్తున్నారు. ఆయా కళాశాలల్లో విద్యార్థులు ఫీజులు చెల్లించని పక్షంలో వారంతా చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రావాల్సి ఉంటుంది. విద్యార్థులకు దూరాభారం కావడంతో పాటు రవాణా ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు తప్పవని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని మండలాల విద్యార్థులు రెండు బస్సులు మారాల్సిన పరిస్థితులు తలెత్తాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని