ఫలితం ఈ రోజు... ఎవరో మారాజు
eenadu telugu news
Published : 19/09/2021 04:22 IST

ఫలితం ఈ రోజు... ఎవరో మారాజు

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
ఈనాడు-గుంటూరు, జిల్లాపరిషత్తు(గుంటూరు)-న్యూస్‌టుడే
గుంటూరులో లెక్కింపు కేంద్రంలో సరంజామా

జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. కొంతకాలంగా పలు అవాంతరాలతో వాయిదా పడుతున్న వచ్చిన ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు వెల్లడి కానున్నాయి. ప్రాదేశిక నియోజకవర్గాలు ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి అడుగడుగునా అవాంతరాలు ఎదురయ్యాయి. ఎన్నికల ప్రకటన విడుదల చేసినప్పటి నుంచి ఎన్నికల కమిషన్‌, ప్రభుత్వం మధ్య వివాదాలు, న్యాయస్థానాల్లో కేసులు, మధ్యలో కరోనా పరిస్థితులతో ఏడాదిన్నరగా పరిషత్‌ ఎన్నికలు ప్రహసనంగా సాగాయి. 2020, మార్చిలో జరగాల్సిన ఎన్నికలు పలు అవాంతరాల మధ్య 2021 ఏప్రిల్‌ 8న ఎన్నికలు జరిగాయి. న్యాయ వివాదాలు ముగిసి ఆదివారం ఓట్ల లెక్కింపుతో ఫలితాలు తేలనున్నాయి. అభ్యర్థుల విజయం తేలిన తర్వాత ఎంపీపీ, జిల్లా పరిషత్‌ పదవులపై స్పష్టత రానుంది. ఫలితాల రాకతో ప్రజాతీర్పు ఎలా ఉంటుందో తేలనుంది.

కొవిడ్‌ మార్గదర్శకాల ప్రకారం భౌతికదూరం పాటించడం, మాస్క్‌ తప్పనిసరిగా ధరించడం, అందుబాటులో శానిటైజర్‌, అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్లు కరోనా వ్యాక్సినేషన్‌ రెండు డోసులు వేయించుకోవాలి.

మొత్తం పోలింగ్‌ కేంద్రాలు 2,542

మొత్తం ఓటర్లు 20,11,514

ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు 11,51,616

పోలింగ్‌ నమోదు 57.25 శాతం

శావల్యాపురంలో అత్యల్ప పోలింగ్‌

జిల్లాలో 47 మండలాల పరిధిలో ప్రాదేశిక ఎన్నికలు జరిగాయి. మొత్తం 2542 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. జిల్లావ్యాప్తంగా 57.25 శాతం పోలింగ్‌ నమోదయింది. జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల్లో శావల్యాపురం మండలంలో అత్యంత తక్కువగా పోలింగ్‌ శాతం నమోదయింది. ప్రధాన ప్రతిపక్షం తెదేపా ఎన్నికలను బహిష్కరించడం, అధికారపార్టీకి ధీటుగా ఎవరూ పోటీలో లేకపోవడంతో ఎన్నికలు ఏకపక్షంగా జరగడంతో ప్రజలు ఓటింగ్‌కు ఆసక్తి చూపలేదు. దీంతో ఇక్కడ 42.88 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదయింది. కాకుమాను మండలంలో 45.36, మాచవరం 46.13, భట్టిప్రోలు 47.94, నకరికల్లు 48.03 శాతం మాత్రమే ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. అత్యధికంగా దుర్గి మండలంలో ఒక్క ఎంపీటీసీ స్థానానికి ఎన్నిక జరగ్గా అక్కడ వైకాపా, జనసేన నడుమ నువ్వానేనా అన్నట్లు పోటీ జరగడంతో 70.45 శాతం పోలింగ్‌ నమోదయింది. దుగ్గిరాల 69.77, యడ్లపాడు 66.03, అమరావతి 65.75 శాతం మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ప్రధాన ప్రతిపక్షం పోటీని బహిష్కరించడంతో జనసేన, ఇతర పార్టీలు పోటీలో ఉన్నచోట మాత్రమే ఆసక్తిగా జరిగాయి. మిగిలిన స్థానాల్లో ఎన్నికలు ఏకపక్షంగా జరగడంతో పల్లెవాసులు అంతగా ఆసక్తి చూపలేదు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని