అధికార పార్టీలో ఆధిపత్య పోరు
eenadu telugu news
Published : 19/09/2021 02:06 IST

అధికార పార్టీలో ఆధిపత్య పోరు

కర్రలు, కత్తులతో పరస్పర దాడులు

ఘర్షణ పడుతున్న వైకాపా వర్గీయులు;

నడింపాలెం (ప్రత్తిపాడు), న్యూస్‌టుడే: వైకాపాలో ఆధిపత్య పోరు ఒకరిపై మరొకరు బీరు సీసాలు, కత్తులు, కర్రలతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శనివారం నడింపాలెంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. ప్రత్తిపాడు సమీపంలోని చింతల వనంలో మద్యం సేవిస్తున్న ఒక వర్గంపై మరొక వర్గం బీరు సీసాలతో విరుచుకుపడింది. ఓ వర్గంలోని క్షతగాత్రుడిని తీసుకొని కొందరు పోలీస్టేషన్‌కు వెళ్లి ఏఎస్సై శివశంకర్‌సింగ్‌కు తెలిపారు. అతడిని చికిత్స నిమిత్తం తరలించాలని ఏఎస్సై సూచించడంతో తోడుగా వచ్చిన వారు వైద్యశాలకు తీసుకెళ్లారు. అనంతరం నడింపాలెంలో ఇరు వర్గాలు కర్రలు, కత్తులతో పరస్పరం దాడులకు దిగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. రెండు వర్గాలకు చెందిన అర్జున్‌, వినోద్‌, వినయ్‌కుమార్‌ అనే కార్యకర్తల తల, పొట్ట భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. పలువురు స్వల్పంగా గాయపడ్డారు. కొందరు క్షతగాత్రులను తీసుకొని చికిత్స కోసం ఆసుపత్రులకు పరుగులు తీశారు. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు వాలంటీర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో గ్రామంలో వినాయక నిమజ్జన కోసం బందోబస్తుకు వచ్చిన పోలీసులకు ఘర్షణ గురించి తెలిసింది. వెంటనే వారు ఘటనా స్థలికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో గ్రామంలో పోలీసు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. గుంటూరులోని ఆసుపత్రుల నుంచి అందిన వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఇన్‌ఛార్జి ఎస్సై కోటేశ్వరరావు చెప్పారు. ఆధిపత్యం కోసమే దాడులకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని ఇన్‌ఛార్జి ఎస్సై వివరించారు.

క్షతగాత్రుడిని ఆటోలో తరలిస్తూ..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని