సాగునీరు వృథా.. రైతుకు వ్యథ
eenadu telugu news
Published : 19/09/2021 02:06 IST

సాగునీరు వృథా.. రైతుకు వ్యథ

ఈనాడు-అమరావతి

పెదనందిపాడు వద్ద నల్లమడ వాగులో నీటి ప్రవాహం

ఆగస్టు నెలలో 15వతేదీ నుంచి నీటిని విడుదల చేసి 7టీఎంసీలు వాడుకోవాలని ముందస్తు ప్రణాళిక రూపొందించారు. సాగర్‌ జలాశయం నిండటంతో ఆగస్టు 4 నుంచి నీటిని తీసుకుంటున్నారు. ప్రారంభంలో నారుమళ్లకు తక్కువగా నీటిని విడుదల చేయాల్సి ఉన్నా 7 నుంచి 8వేల క్యూసెక్కులు తీసుకోవడంతో కాలువల్లో నీరు వృథాగా ప్రవహించింది. ప్రస్తుతం 6వేల క్యూసెక్కులపైగా నీటిని తీసుకుంటున్నారు. ఆగస్టు నెల పూర్తయ్యేసరికి 14 టీఎంసీలు నీటివాడకాన్ని లెక్కించిన జలవనరులశాఖ ఉన్నతాధికారులు నీటి పొదుపు పాటించాలని లింగంగుంట్ల, ఒంగోలు సర్కిల్‌ పర్యవేక్షక ఇంజినీర్లను అప్రమత్తం చేశారు.

సాగర్‌ కాలువల కింద రైతులు వరి సాగుచేయడానికి నారుమళ్లు సాగుచేశారు. ఈక్రమంలో కాలువలకు నీటిని విడుదల చేశారు. నారుమళ్లకు కొద్దిపాటి నీరు సరిపోతుంది. అవసరాలకు మించి నీటిని విడుదల చేస్తుండటంతో నీటిని రైతులు డ్రెయిన్లలోకి మళ్లిస్తున్నారు. ఈనీరు వాగులకు చేరి వృథాగా సముద్రంలోకి వెళుతోంది. నాట్లు వేసే ముందు దమ్ము చేయడానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. ఇప్పుడిప్పుడే రైతులు నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. కాలువ కింద 10శాతం మాత్రమే నాట్లు మొదలుకావడంతో నీరు వృథా ఎక్కువగా ఉంటోంది. పల్నాడు ప్రాంతంలో సాగుచేస్తున్న మిర్చి, ఇప్పటికే సాగులో ఉన్న పత్తికి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో నీటితడుల అవసరం లేదు. దీనిని గుర్తించి కాలువలకు నీటి పరిమాణాన్ని తగ్గించాల్సిన యంత్రాంగం క్షేత్రస్థాయిలో లేకపోవడం వృథాకు కారణమవుతోంది. నకరికల్లు మండలం చీమలమర్రి మేజరు కింద నారుమళ్లు మాత్రమే సాగులో ఉన్నాయి. కాలువకు విడుదల చేసిన నీటితో నారుమళ్లు తడిపి మిగిలిన నీరు డ్రెయిన్లలోకి వదులుతున్నారు.

పంట చివరిదశలో ఇబ్బందులు

సాగర్‌ జలాశయం నుంచి కుడికాలువకు 132 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. అయితే నీటి అవసరాలు పెరగడంతో ఏటా సగటున 160 టీఎంసీల వరకు నీరు అవసరమవుతోంది. ఇప్పుడు ప్రారంభంలో నీటిని వృథాగా వాగుల్లోకి వదిలేస్తే ఫిబ్రవరి, మార్చి నెలల్లో మిర్చి పంటకు అవసరమైన నీరు అందుబాటులో లేక రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ప్రధాన వాణిజ్యపంట మిర్చికి ఆఖరులో ఒక తడి తగ్గినా ఎకరాకు సగటున 4 క్వింటాళ్ల వరకు దిగుబడులపై ప్రభావం పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు నీటిని పొదుపుగా వాడుకుంటే పంట ఆఖరిదశలో ఇబ్బందులను అధిగమించవచ్చని జలవనరులశాఖ ఇంజినీర్లు సూచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో లష్కర్లు లేనందున కాలువల నుంచి నీరు వృథాగా వెళుతున్నట్లయితే రైతులు గుర్తించి సంబంధిత ఇంజినీర్లకు సమాచారం ఇచ్చి నీటిపొదుపులో భాగస్వామ్యులు కావాల్సి ఉంది. వర్షపునీటిని సమర్థంగా ఉపయోగించుకోవడంతో పాటు కాలువల నీటిని పొదుపుగా వాడుకుంటే మిర్చి పంట చివరివరకు నీటిని అందించవచ్ఛు

వాగుల్లోకి సాగునీరు

నాగార్జునసాగర్‌ కుడికాలువకు విడుదల చేస్తున్న నీటిలో పంటలకు పెట్టుకోగా మిగిలిన నీటిని వాగులకు వదిలేస్తుండటంతో విలువైన సాగునీరు వృథా అవుతోంది. కాలువల ఆయకట్టు కింద రైతులు కొందరు నారుమళ్లు వేసుకోగా, కొందరు దమ్ము చేసి నాట్లు వేస్తున్నారు. ఈక్రమంలో కాలువలకు విడుదల చేస్తున్న నీటిలో ఎక్కువభాగం వృథాగా వాగుల్లోకి వెళుతోంది. నారుమళ్లకు కొద్దిపాటి నీరు సరిపోతుంది. దీనికితోడు వరుసగా వర్షాలు పడుతుండటంతో నీటి అవసరాలు గణనీయంగా తగ్గాయి. అయినప్పటికీ క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఆయా కాలువల కింద సాగును సమన్వయం చేసుకుంటూ నీటిని విడుదల చేయాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో లష్కర్లు లేకపోవడం, ఇంజినీర్లు కాలువల మీద పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయకపోవడంతో అవసరాలకు మించి నీరు విడుదలవుతోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని