సర్కారు బడుల్లో సీట్లు లేవు
eenadu telugu news
Published : 19/09/2021 04:21 IST

సర్కారు బడుల్లో సీట్లు లేవు

విజయవాడలోని పాఠశాలలకు డిమాండ్‌

ఆ ఏడింటిలో కిక్కిరిసిపోయిన విద్యార్థులు

ఇక చేర్చుకోలేమంటున్న ప్రధానోపాధ్యాయులు

ఈనాడు, అమరావతి

భవానీపురంలోని ఎస్‌.డి.వై.ఎం.ఆర్‌.ఆర్‌. హైస్కూల్‌లో ప్రవేశాలు ముగిశాయని అతికించిన నోటీసు

విజయవాడలోని సర్కారు బడుల్లో సీట్లకు ఈ ఏడాది రద్దీ మామూలుగా లేదు. పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఇప్పటికీ పెద్ద సంఖ్యలోనే వస్తున్నారు. చాలామంది ప్రైవేటు పాఠశాలల్లో నుంచి తమ పిల్లలను తీసుకొచ్చి సర్కారు బడుల్లో చేరుస్తున్నారు. నగరంలోని ఏడు పాఠశాలల్లో సీట్లు ప్రస్తుతం హాటు కేకుల్లా మారాయి. ఏటా ఉండే సాధారణ సీట్లు నిండిపోగా.. అదనంగానూ వచ్చి చేరిపోయారు. ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు ప్రజాప్రతినిధుల సిఫార్సులతో వచ్చి సీట్లు ఇవ్వాలంటూ ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో తరగతి గదిలో కూర్చునేందుకు కూడా చోటులేదంటూ నచ్చజెప్పాల్సి వస్తోంది. అయినా.. వినకపోవడంతో చేసేది లేక చేర్చుకుంటున్నప్పటికీ.. వారిని ఎక్కడ కూర్చోబెట్టాలో తెలియని పరిస్థితి ఉంటోంది. చాలా పాఠశాలల్లో తరగతి గదుల కొరత ఉంది. దీంతో ఉన్న గదుల్లోనే విద్యార్థులు నిండిపోతున్నారు.

విజయవాడ నగరంలోని పది ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో సీట్ల కోసం ఈ ఏడాది తల్లిదండ్రులు బారులు తీరారు. సత్యనారాయణపురంలోని ఎ.కె.టి.పి.మున్సిపల్‌ హైస్కూల్‌, అదే ప్రాంగణంలో ఉన్న ప్రశాంతి ప్రాథమిక పాఠశాల, పటమటలోని జి.డి.ఈ.టి.మున్సిపల్‌ హైస్కూల్‌, ఎలిమెంటరీ స్కూల్‌, పటమట జిల్లా పరిషత్‌ బోయ్స్‌ హైస్కూల్‌, వన్‌టౌన్‌లోని తేలప్రోలు బాపనయ్య ఎయిడెడ్‌ హైస్కూల్‌ అండ్‌ ప్రైమరీ పాఠశాలలు, సింగ్‌నగర్‌లోని వివేకానంద సెంటినరీ ఎయిడెడ్‌ హైస్కూల్‌, అండ్‌ ఎలిమెంటరీ, భవానీపురంలోని ఎస్‌.డి.వై.ఎం.ఆర్‌.ఆర్‌. ఎయిడెడ్‌ హైస్కూల్‌, పటమట జెడ్‌పీ గర్ల్స్‌ హైస్కూల్‌, వీఎంసీ హైస్కూల్‌, ఎలిమెంటరీ పటమట, అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎం.కె.బేగ్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ అండ్‌ ఎలిమెంటరీ స్కూల్‌, న్యూ ఆర్‌ఆర్‌పేటలోని కేర్‌ అండ్‌ షేర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌.. వీటిలో సీట్లకు ఈ ఏడాది డిమాండ్‌ భారీగా పెరిగింది. ఒక్కో పాఠశాలలో గత ఏడాదితో పోలిస్తే.. కనీసం 200 నుంచి 300మంది విద్యార్థులు పెరిగారు.

ఎక్కడో ఓ చోట నెట్టుకొస్తే చాలని..

ఈ పాఠశాలల్లో సామర్థ్యం మేరకు ఉన్న సీట్లన్ని నిండిపోగా.. అదనంగానూ చేరిపోయారు. సత్యనారాయణపురం ఎస్‌.కె.టి.పి హైస్కూల్‌లో గత ఏడాది 1700మంది ఉండగా.. ప్రస్తుతం 2100కు పెరిగారు. ఇలాగే ప్రశాంతి ప్రాథమిక పాఠశాలలోను గత ఏడాది 600 ఉంటే ఇప్పుడు 1100 అయ్యారు. ఏకంగా 500మందికి పైగా విద్యార్థులు పెరిగారు. మిగతా పాఠశాలల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఏడాదికి వంద మంది పెరగడమంటే.. చాలా గొప్ప విషయం అనే పరిస్థితి ఇంతకుముందు ఉండేది. గత ఏడాది పిల్లలను పాఠశాలలో చేర్పించని తల్లిదండ్రులు ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ చేర్చాల్సిన పరిస్థితి. మరోవైపు ఒకటి నుంచి పది వరకు ప్రతి తరగతిలోనూ కొత్త విద్యార్థులు వచ్చి చేరారు. ఎక్కువగా ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు ఈసారి ప్రభుత్వ బడులకు వచ్చారు. ఎలాగూ ప్రైవేటు పాఠశాలల్లోనూ ఆన్‌లైన్‌ తరగతులే నడుస్తుండడంతో.. ఈ ఏడాదికి ప్రభుత్వ బడులే మంచిదనే అభిప్రాయం చాలామంది తల్లిదండ్రుల్లో నెలకొంది. మరికొన్ని పాఠశాలల్లో గత ఏడాది చెల్లించని ఫీజులను కూడా ఈసారి కట్టమంటుండడంతో.. భరించలేక వచ్చేస్తున్న వాళ్లు కూడా ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని