కొల్లేరులో అందాల అతిథులు
eenadu telugu news
Published : 19/09/2021 02:06 IST

కొల్లేరులో అందాల అతిథులు

ఆటపాక పక్షుల కేంద్రానికి విదేశీ విహంగాల రాక

కైకలూరు గ్రామీణం, న్యూస్‌టుడే

కొల్లేరు సరస్సుకు అతిథుల రాక ప్రారంభమైంది. సంతానోత్పత్తి కోసం వివిధ దేశాల నుంచి వచ్చే విహంగాలతో ఆటపాక పక్షుల కేంద్రం కొత్త కళ సంతరించుకుంది. ఏటా అక్టోబరు, నవంబరు నెలల్లో వచ్చే విదేశీ పక్షులు ఈసారి సెప్టెంబరులోనే కనువిందు చేస్తున్నాయి. పెలికాన్‌, పెయింటెడ్‌ స్టాక్‌ వంటివి సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి ఏటా ఇక్కడికి వస్తుంటాయి.

వేసవి ప్రారంభమైన తరవాత పిల్లలతో స్వదేశానికి వెళ్లిపోతుంటాయి. ఈ కేంద్రంలో వాటి ఆవాసాలకు ప్రభుత్వం స్టాండ్లను ఏర్పాటుచేసింది. వాటిపై ఉన్న ఇనుప చక్రాల ఆధారంగా గూళ్లు కట్టుకొని.. గుడ్లు పొదుగుతుంటాయి. ఇప్పటికే కొల్లేరులోకి 20 వేలకు పైగా విహంగాలు చేరాయని, పక్షుల కేంద్రంలో సుమారు ఆరువేల వరకూ ఉన్నట్లు అటవీశాఖ సిబ్బంది చెబుతున్నారు. ఈ ఏడాది సరస్సులో నీరు తగినంతగా ఉండటంతో చేపల పెరుగుదల బాగుంటుందని, పక్షుల ఆహారానికి ఇబ్బంది ఉండకపోవచ్చని పర్యావరణ ప్రేమికులు భావిస్తున్నారు. పక్షుల వసతుల కొరత లేదని, ఈ కేంద్రాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు కాలేదని డీఆర్వో జయప్రకాష్‌ తెలిపారు. ఆటపాక పెలికాన్‌ కేంద్రంలో బోటు షికారు అందుబాటులో ఉందని పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని