పారదర్శకంగా ఓట్ల లెక్కింపు..!
eenadu telugu news
Published : 19/09/2021 01:24 IST

పారదర్శకంగా ఓట్ల లెక్కింపు..!

కొవిడ్‌ నిబంధనలు పాటించడం తప్పనిసరి

ప్రశాంతంగా ప్రక్రియ నిర్వహించేందుకు ఏర్పాట్లు

‘ఈనాడు’తో జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌

ఈనాడు, అమరావతి

జూపూడి నోవా ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టరు నివాస్‌

పరిషత్తు ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్కా కోవిడ్‌ నిబంధనలను అనుసరించి జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ స్పష్టం చేశారు. లెక్కింపు అనంతరం ఎలాంటి ఊరేగింపులకు, విజయయాత్రలకు అనుమతి లేదని వెల్లడించారు. అన్ని లెక్కింపు కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశామని, పర్యవేక్షణ అధికారులను నియమించామని వివరించారు. శనివారంనాడే లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉన్నామని వివరించారు. జిల్లాలో మొత్తం 41 జడ్పీటీసీ, 648 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం జరుగనుంది. పలు లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదివారం లెక్కింపు ప్రక్రియపై ‘ఈనాడు’తో మాట్లాడారు. ఆయన మాటల్లో..

జిల్లాలో పరిషత్తు ఎన్నికల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశాం. కౌటింగ్‌ హాళ్లు సిద్ధమయ్యాయి. టేబుల్స్‌ ఏర్పాటు చేశాం. జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. జిల్లా మొత్తం మీద 63 శాతం పోలింగ్‌ జరిగింది. జిల్లాలో మొత్తం 41 జడ్పీటీసీ స్థానాలకు, 648 ఎంజపీటీసీల స్థానాలకు లెక్కింపు జరుగుతుంది. బ్యాలెట్‌ పత్రాల ప్రక్రియ కావడంతో లెక్కింపు జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు సమాంతరంగా జరుగుతుంది. తక్కువ పోలింగ్‌ ఉన్న ప్రాంతాల్లో ఫలితాలు ముందుగా వచ్చే అవకాశం ఉంటుంది. లెక్కింపు కోసం దాదాపు 4వేల సిబ్బంది పాల్గొంటున్నారు. ఒక్క టేబుల్‌కు అయిదుగురు సిబ్బంది వరకు ఉంటారు. గతంలో వారికి శిక్షణ ఇచ్చాం. శనివారం ఆర్‌ఓల పరిధిలో సూచనలు చేశాం. 17 కేంద్రాలలో లెక్కింపు జరుగనుంది. వీటిని క్లస్టర్‌లుగా విభజిరచి జిల్లా సంయుక్త కలెక్టర్‌లు ముగ్గురు, సబ్‌కలెక్టర్‌లు, ఆర్డీఓలను ఇంఛార్జిలుగా నియమించాం. ప్రతి కేంద్రానికి ఒక పర్యవేక్షక అధికారిని నియమించాం. విజయవాడలో ఒక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశాం. అక్కడ పోలీసు, రెవెన్యూ సిబ్బందితో బృందాలను ఏర్పాటు చేశాం. అన్ని కేంద్రాల నుంచి సమాచారాన్ని కంట్రోల్‌ రూంకు వచ్చేలా ఏర్పాట్లు చేశాం. పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలను అవసరం మేరకు ఏర్పాటు చేశాం. కంట్రోల్‌ రూం నుంచి పర్యవేక్షించే విధంగా అనుసంధానం చేశాం.

● ఓట్ల లెక్కింపు సందర్భంగా కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంది. టీకా వేయించుకున్న వారినే నియమించాం. ఏజెంట్లు కూడా టీకా వేయించుకున్నట్లు రుజువులు చూపించి పాసులు తీసుకోవాల్సి ఉంది. ప్రతి కేంద్రం వద్ద సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ప్రతి రౌండ్‌ ఫలితాలను వెల్లడిస్తారు. ఆయా మండలంలో ఎన్ని ఎంపీటీసీ కేంద్రాలు ఉంటే అన్ని టేబుళ్లు ఏర్పాటు చేస్తాం. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్లు సమాంతరంగా లెక్కింపు జరుగుతుంది. అన్ని టేబుళ్లు లెక్కింపు పూర్తయిన తర్వాత రిటర్నింగ్‌ అధికారి ఫలితం ప్రకటిస్తారు. సమసస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలను కొన్ని గుర్తించారు. ఫలితాల సందర్భంగా వచ్చే వివాదాలపై పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది. ముందస్తు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. విజయయాత్రలు, ఊరేగింపులు నిషేధం. కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో ప్రజలు గుమికూడవద్ధు గత ఏప్రిల్‌లో పోలింగ్‌ జరిగింది. దాదాపు అయిదు నెలలు స్ట్రాంగ్‌ రూంలలో బ్యాలెట్‌ బాక్సులు భద్రపరిచారు. తాము పరిశీలన వరకు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. విజయవాడ మాంటిస్సోరి కేంద్రంలో కొన్ని బాలెట్‌ బాక్సులకు కిందకు నీరు వచ్చాయి. కానీ బాక్సులకు నీరు చేరినట్లు దాఖలాలు లేవు. బాక్సులు తెరిచిన తర్వాత అలాంటి సంఘటనలు ఉంటే ఎన్నికల సంఘం సూచన మేరకు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లాలో ప్రశాంతంగానే లెక్కింపు జరుగుతుందని ఆశిస్తున్నాం. అన్ని వర్గాలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

షెడ్యూల్‌ తర్వాతే..!

జిల్లాలో ఏకగ్రీవ ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓట్ల లెక్కింపు ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రానికి ముగుస్తుందని అంచనా వేస్తున్నాం. ఫలితాల అనంతరం జడ్పీ ఛైర్‌పర్సన్‌, ఎంపీపీలను పరోక్ష పద్దతిలో ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించాల్సి ఉంది. రిజర్వేషన్‌ కేటగిరి ప్రకారం ఎంపీటీసీలు ఎంపీపీలను, జడ్పీటీసీలు జడ్పీ చైర్‌పర్సన్‌ను ఎన్నుకుంటారు.


నేడు మద్యం అమ్మకాలు బంద్‌

ఇబ్రహీంపట్నం గ్రామీణం: జూపూడి నోవా ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రాన్ని కలెక్టర్‌ జె.నివాస్‌ శనివారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో ఆదివారం డ్రై డేగా ప్రకటించినట్లు చెప్పారు. మద్యం అమ్మకాలు నిషేధించి షాపులను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశామన్నారు. మద్యం అక్రమ రవాణా జరగకుండా పక్కాగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇందు కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక నోడల్‌ అధికారిని నియమించినట్లు వివరించారు. అవసరమైన వారికి కొవిడ్‌ ర్యాపిడ్‌ టెస్టులు చేసేందుకు మండల కేంద్రంలో ఏర్పాట్లు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు సమాచారాన్ని పర్యవేక్షించేందుకు జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌ కూడా ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట ఇబ్రహీంపట్నం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎం.దివాకర్‌, తహసీల్దార్‌ సూర్యారావు తదితరులున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని