జంట మృతదేహాలపై కొనసాగుతున్న దర్యాప్తు
eenadu telugu news
Published : 02/08/2021 02:47 IST

జంట మృతదేహాలపై కొనసాగుతున్న దర్యాప్తు

తాడేపల్లి, న్యూస్‌టుడే: తాడేపల్లిలోని ఓ నివాసంలో గత నెల 29న వెలుగుచూసిన జంట మృతదేహాల వివరాల కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నాలుగు రోజులు గడిచిపోయినా ఇంతవరకూ ఎలాంటి సమాచారం లభించలేదు. మృతుల నివాసంలో లభించిన కీప్యాడ్‌ చరవాణులు రెండింటి ఐఎంఈఐ నంబర్లు ఆధారంగా వాటిలో ఏ నెట్‌వర్క్‌నకు చెందిన సిమ్ములు వాడారో పరిశీలిస్తున్నారు. నాలుగు రకాల కంపెనీలకు సంబంధించి డేటాను సేకరిస్తున్నారు. ఇప్పటికే రెండు కంపెనీల నుంచి సమాచారం సేకరించారు. సిమ్ములు వాడి ఏడాది గడిచినట్లు దర్యాప్తులో తేలింది. వారు నివాసం ఉన్న గృహాన్ని దశాబ్దం క్రితం సీతానగరానికి చెందిన వ్యక్తి నుంచి కొనుగోలు చేశారని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఇల్లు కొన్నవ్యక్తి ఎవరో తెలియదని.. విక్రయించినవారు చెప్పడం పట్ల పోలీసులు విచారణ చేస్తున్నారు. తెలియని వ్యక్తులకి ఇంటిని ఎలా విక్రయించారనే అంశంపై ఆరా తీస్తున్నారు. సీతానగరానికి చెందిన వ్యక్తి ఇల్లు విక్రయించగా మరో వ్యక్తి మధ్యవర్తిత్వం వహించడంతో వారిద్దర్నీ విచారించేందుకు స్టేషన్‌కు రావాల్సిందిగా సమాచారం పంపారు. చనిపోయిన వ్యక్తులు ఎలాంటి ఆధారాలు లేకుండా చేయడంవెనుక ఎలాంటి మిస్టరీ దాగివుందనే అంశాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. చనిపోయినవారు వ్యవహరించిన తీరు అంతుపట్టడ్డం లేదని.. శవ పరీక్ష నివేదిక వస్తేగానీ కచ్చితమైన కారణాలు చెప్పలేమని పోలీసులు పేర్కొంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని