పోరాడి అమరావతిని సాధించుకుంటాం
eenadu telugu news
Updated : 02/08/2021 02:49 IST

పోరాడి అమరావతిని సాధించుకుంటాం


మాట్లాడుతున్న తెనాలి శ్రావణ్‌కుమార్‌, దళిత ఐకాస నాయకులు

తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఊపిరి ఉన్నంతవరకు పోరాడి అమరావతిని సాధించుకుంటామని గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. వెంకటపాలెంలో ఆదివారం అమరావతి దళిత ఐకాస ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అమరావతి ఆస్తుల పరిరక్షణ కమిటీ ఎంపికపై సమావేశంలో చర్చించారు. ముఖ్య అతిథిగా శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ అమరావతిలో కొనసాగుతున్న అక్రమాల గురించి ఏఎంఆర్డీఏ, పోలీసులకు ఫిర్యాదు చేసినా చోరీలకు అడ్డుకట్ట పడటం లేదన్నారు. రాజధానిలో అధికార పార్టీ నాయకుల అండదండలతోనే దుండగులు రోడ్లు తవ్వుకొని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. అసైన్డ్‌ రైతులకు కౌళ్లు చెల్లించకుండా ప్రభుత్వం వారి పట్ల వివక్ష చూపుతోందని మండిపడ్డారు.ఐకాస నాయకులందరూ సమన్వయంతో అమరావతిలో కొనసాగుతున్న దోపిడీలను అడ్డుకోవాలన్నారు. దీనిపై త్వరలోనే అమరావతి ఐకాస నాయకులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఒక రోజు నిరాహార దీక్ష: ఉద్దండరాయునిపాలెం సమీపంలో సీడ్‌యాక్సిస్‌ మార్గం పక్క నుంచి అఖిలభారత ఉద్యోగుల భవనాల సమీపం వరకు గత ప్రభుత్వంలో నిర్మించిన రహదారిని తవ్వి కంకర తోలుకెళ్లిన విషయం ఆదివారం వెలుగులోనికి వచ్చింది. దీనికి నిరసనగా అక్కడ దళిత ఐకాస ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు దళిత ఐకాస కన్వీనర్‌ గడ్డం మార్టిన్‌ తెలిపారు. ఐకాస నాయకులు చిలకా బసవయ్య, ముళ్లముడి రవి, బేతపూడి సుధాకర్‌, అంకం సువర్ణకమల తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని