‘ఐ-క్లిక్‌’ కాలేదు
eenadu telugu news
Published : 02/08/2021 02:47 IST

‘ఐ-క్లిక్‌’ కాలేదు

ఎక్కడి నుంచైనా పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం

ప్రచారం, పర్యవేక్షణ కొరవడడంతో నామ్‌కే వాస్తేగా మిగిలిన వైనం

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే


తెనాలి బస్టాండ్‌లో నిరుపయోగంగా ఉన్న ‘ఐ-క్లిక్‌’ కేంద్రం

మీరు ఏటీఎం కార్డు ద్వారా ఎక్కడి నుంచైనా మీ బ్యాంకు ఖాతాలోని నగదును ఎలా డ్రా చేసుకుంటారో అదేవిధంగా ‘ఐ-క్లిక్‌’ కేంద్రం ద్వారా ఎక్కడి నుంచైనా మీ సమస్యను పోలీసులకు తెలియచేయవచ్చంటూ 2016లో ఈ ఆధునిక విధానాన్ని ప్రవేశపెట్టారు. కంప్యూటర్‌ నుంచి ‘వాయిస్‌ మెసేజ్‌’ను పంపడం, రాతపూర్వకంగా రాసి స్కాన్‌ చేయడం, నేరుగా కీబోర్డు ద్వారా టైప్‌ చేయడం ఇలా మూడు విధాలుగా ఫిర్యాదును అందించే వెసులుబాటు కల్పించారు. అంతర్జాలం ద్వారా సంబంధిత ఫిర్యాదు ఉన్నత విభాగానికి చేరి అక్కడి నుంచి అది ఏ పోలీస్‌స్టేషన్‌కు చెందినదైతే అక్కడికి వెళుతుంది. ఆ పోలీసులు ఫిర్యాదుదారుతో చరవాణి ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకుని, కేసు నమోదుచేసి, తోడ్పాటునందిస్తారు. సాధారణంగా ఏ ప్రాంతం ఫిర్యాదు ఆ ప్రాంత పోలీస్‌స్టేషన్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజలు తెలియక మరో ప్రాంత పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా ఇది మా పరిధి కాదు అంటూ వారు పంపేస్తుంటారు. ఇలా ఒకటికి నాలుగు చోట్లకు తిరగకుండా, అసలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లకుండా సమస్యలను ఉన్నతాధికారులకు తెలియచేయడానికి, ఫిర్యాదులను అందించడానికి, తమ ప్రాంతంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు, ఇతర సమాచారాలు రహస్య విధానంలో పోలీసులకు తెలియచేయడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుందని నాడుఅందరూ భావించారు.


లోపలి భాగంలో విలువైన కంప్యూటర్‌, ఇతర పరికరాలు

జిల్లాలో తొలిగా తెనాలి బస్టాండ్‌ ఆవరణలో ఐ-క్లిక్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. అప్పటి పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే గుంటూరులో 2, మంగళగిరి, పిడుగురాళ్లలో ఒక్కొక్కటిగా మొత్తం 5 కేంద్రాలు మొదలయ్యాయి. ఈ కేంద్రాల ఫలితాలు బేరీజు వేస,ి ప్రతి నియోజకవర్గంలో ఒక చోట ఇలాంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. తొలి రోజుల్లో ఒక మోస్తరుగా అందిన ఫిర్యాదులు ఆ తర్వాత పూర్తిగా ఆగిపోయాయి. ఈ కేంద్రాల వినియోగ తీరుపై ప్రజలకు పూర్తిగా అవగాహన రాకపోవడం, అంతర్జాల, సాంకేతిక సమస్యలు అవరోధాలుగా మారాయి. మొత్తం మీద ప్రారంభించిన కొద్ది నెలలకే ఇవి మూలనపడ్డాయి. నాటి నుంచి నేటి వరకు ఈ కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఆనాటి విధానానికి నేటి ఆధునికతను జోడించి సద్వినియోగం చేసుకోవడం లేదా మరో విధంగా వినియోగించుకునే తీరుపై పోలీసు అధికారులు ఆలోచన చేయాల్సి ఉంది. లేకుంటే రూ.లక్షల ప్రజాధనం ఇలా వృథా అవుతుంది. ఈ విషయమై తెనాలి డీఎస్పీ కె.స్రవంతిరాయ్‌ను సంప్రదించగా.. ఐ-క్లిక్‌ కేంద్రం గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటానని, ఇది ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా చేసే విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని