కృష్ణమ్మ తరలివచ్చె..
eenadu telugu news
Published : 02/08/2021 02:47 IST

కృష్ణమ్మ తరలివచ్చె..

నాగార్జునసాగర్‌ 14 గేట్ల ఎత్తివేత

పర్యాటకులతో సందడిగా మారిన ప్రాజెక్ట్‌ పరిసరాలు

మాచర్ల, న్యూస్‌టుడే

నాగార్జునసాగర్‌ జలాశయం నిండుకుండలా మారింది. శ్రీశైలం నుంచి భారీగా వస్తున్న వరద నీటితో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో అధికారులు జలాశయం నుంచి నీటిని క్రస్ట్‌గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం రాత్రికి 14 గేట్లను పైకెత్తి వరద నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. ఆదివారం సెలవు రోజుకావడంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పర్యటకులు భారీగా తరలివచ్చారు. సాగర్‌ గేట్లు ఎత్తుతారనే సమాచారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ కావడంతో నాగార్జునసాగర్‌ ప్రాంతంలో కార్లు బారులుదీరాయి. కొత్తవంతెన ఫైలాన్‌ కాలనీ, విజయపురిసౌత్‌, ప్రాజెక్టు ముందు ప్రాంతం ట్రాఫిక్‌ స్తంభించింది. వరుసగా మూడో ఏడాది కూడా ఎగువ ప్రాంతాల్లో నుంచి వరద నీటి చేరికతో కృష్ణమ్మ పరవళ్లు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేశాయి.

వారం రోజుల్లోనే జలకళ

వారం రోజుల క్రితం నాగార్జునసాగర్‌ నీటిమట్టం 540 అడుగుల లోపలే ఉంది. విద్యుదుత్పాదనకు నీటిని వినియోగించడంతో నీటిమట్టం 535 అడుగుల దిగువకు వెళ్లింది. ఆ తరువాత కర్ణాటక రాష్ట్రంలోని ప్రాజెక్టుల నుంచి వరద నీరు రావడం మొదలైంది. ఎగువ నుంచి 30వేల క్యూసెక్కుల నుంచి 5.50 లక్షల క్యూసెక్కుల మేర సాగర్‌కు చేరింది. వారం రోజుల వ్యవధిలో సాగర్‌ జలాశయం నిండుకుండలా మారింది.

నాలుగు రోజుల్లో రోజుకు 10 అడుగుల మేర నీటిమట్టం పెరుగుతూ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు చేరువకావడంతో క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. గత ఏడాది సాగర్‌ క్రస్ట్‌గేట్లను 100 రోజుల పాటు పైకెత్తి దిగువకు కృష్ణా జలాలను విడిచిపెట్టారు. 2009లో భారీగా వరద నీటి చేరిక నేపథ్యంలో 11 లక్షల క్యూసెక్కుల నీరు గేట్ల నుంచి పరుగులు తీయగా, గతేడాది మాత్రం 9.50 లక్షల క్యూసెక్కుల నీరు గేట్ల ద్వారా దిగువ ప్రాజెక్టుల నీరు వెళ్లింది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి వస్తున్న వరద నీటిని అంచనావేస్తూ సాగర్‌లోని మరిన్ని గేట్లను పైకెత్తే అవకాశం ఉంది. మరోవైపు కుడికాలువకు నీటివిడుదల ఎప్పుడన్న దానిపై ఉన్నతాధికారులు సమీక్షలు చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో జలవనరులశాఖ అధికారులు స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.


సముద్రంలోకి నీటి విడుదల

గుంటూరు, న్యూస్‌టుడే: ఎగువ నుంచి వరద నీరు రావడంతో పులిచింతల ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. 1,40,000 క్యూసెక్కులను నేరుగానూ, విద్యుత్తు ఉత్పత్తి ద్వారా మరో 10 వేల క్యూసెక్కులు కలిపి 1.50 లక్షల క్యూసెక్కులను ఆదివారం రాత్రి 9.15 గంటలకు విడుదల చేశారు. ఇప్పటికే పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీకి ఆదివారం రాత్రి 8 గంటలకు 36,069 క్యూసెక్కుల మేర వరద రాగా, 36 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి సముద్రంలోకి 26,820 క్యూసెక్కులను, కాల్వలకు 9,249 క్యూసెక్కులు విడుదల చేశారు.


తెరుచుకున్న సత్రశాల 18 గేట్లు

రెంటచింతల: సత్రశాల టెయిల్‌పాండ్‌ డ్యాం నుంచి 1,86,995 క్యూసెక్కుల వరద నీరు దిగువనున్న పులిచింతల రిజర్వాయరుకు విడుదల చేస్తున్నట్లు ఏఈ నరసింహారావు తెలిపారు. ఎగువనున్న నాగార్జునసాగర్‌ జలాశయం నుంచి వరద నీరు దిగువనున్న టెయిల్‌పాండ్‌ డ్యాంకు వచ్చి చేరుతున్నట్లు వెల్లడించారు. వరద ప్రవాహం నేపథ్యంలో 18 గేట్లు ద్వారా 1,78,995 క్యూసెక్కులు, రెండు యూనిట్ల ద్వారా 7180 క్యూసెక్కుల నీరు దిగువకు పంపిస్తున్నామన్నారు. డ్యాంలో 75.15 మీటర్ల నీరు నిల్వ ఉంది. ఇది 6.84 టీఎంసీలకు సమానం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని