పోర్టు పనులు త్వరలో ప్రారంభం
eenadu telugu news
Published : 02/08/2021 02:47 IST

పోర్టు పనులు త్వరలో ప్రారంభం

కోనేరుసెంటరు(మచిలీపట్నం), న్యూస్‌టుడే: ప్రజల చిరకాలవాంఛగా ఉన్న బందరు పోర్టు పనులు త్వరలో ప్రారంభంకానున్నాయని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. మచిలీపట్నంలోని ఆయన కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోర్టుకు అవసరమైన భూముల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవని, ఫైనాన్షియల్‌ క్లోజర్‌ అయిన వెంటనే తగు చర్యలు చేపడతారని, ఆ దిశగా బ్యాంకర్లతో చర్చలు సాగుతున్నాయని తెలిపారు. పోర్టుకు అనుబంధంగా కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రూ.1000 కోట్ల అంచనా వ్యయంతో పరిశ్రమలు నెలకొల్పేందుకు సంసిద్ధంగా ఉందన్నారు. పరిశ్రమలు ఏర్పాటయితే దాదాపు ఏడు వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుందని వివరించారు. మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని గిలకలదిండిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఫిషింగ్‌ హార్బర్‌ అభివృద్ధి పనులు, జిల్లా వాసులకు అధునాతన, మెరుగైన వైద్య సేవలు చేరువ చేసే దిశగా నగరలో వైద్యకళాశాల నిర్మాణం పనులు చేపట్టారన్నారు. నాగాయలంక మండల పరిధిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా డీఆర్‌డీఓ మిస్సైల్‌ టెస్టింగ్‌ కేంద్రం రమారమి రూ.3000 కోట్లతో ఏర్పాటు కాబోతోందని తెలిపారు. గుడివాడలో ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించే క్రమంలో రైల్వే ట్రాక్‌ వద్ద రూ.200 కోట్ల అంచనాతో ఫ్లైఓవర్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మచిలీపట్నం రైల్వేస్టేషన్‌ను మోడల్‌ స్టేషన్‌గా తీర్చిదిద్దారని, కొవిడ్‌ విపత్కర పరిస్థితుల కారణంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆలస్యం చోటుచేసుకుందని తెలిపారు. మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వెళ్లే ప్యాసింజర్‌ రైలును ఎక్స్‌ప్రెస్‌ రైలుగా మార్చడంతో పాటు మచిలీపట్నం నుంచి తిరుపతికి రైలు సర్వీస్‌ను పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని పలువురు పార్టీ నాయకులు, ప్రజలు ఎంపీని కలిసి తమ స్థానిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలను వివరించారు.

ఎంపీని కలిసిన ఎస్పీ

ఎంపీ బాలశౌరిని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి మచిలీపట్నం వచ్చిన ఎంపీని రహదారులు, భవనాలశాఖ అతిథిగృహంలో కలిసిన ఎస్పీ పుష్పగుచ్ఛం అందజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని