సౌర విద్యుత్తుకు.. హైటెన్షన్‌
eenadu telugu news
Published : 02/08/2021 02:49 IST

సౌర విద్యుత్తుకు.. హైటెన్షన్‌

నున్న సబ్‌స్టేషన్‌కు లైన్‌ ఏర్పాటులో ఆటంకాలు

ఈనాడు, అమరావతి

పాతపాడులో సిద్ధమైన సౌర విద్యుత్తు ప్లాంటు

విజయవాడ దుర్గగుడి ఆధ్వర్యంలో నున్నలో ఏర్పాటు చేస్తున్న సౌర విద్యుత్తు ప్లాంట్‌ అందుబాటులోకి రావడానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఏప్రిల్‌ నెలాఖరుకే పూర్తవుతుందని గతంలో అధికారులు చెప్పినా, మరో మూడు, నాలుగు నెలలు పట్టే అవకాశముందని తెలుస్తోంది. హైటెన్షన్‌ విద్యుత్తు లైన్‌ ఏర్పాటు విషయంలో జాప్యమే ఇందుకు కారణమని చెబుతున్నారు.

పాతపాడు గ్రామంలో విద్యుత్తు స్తంభాల ఏర్పాటు విషయంలో వివాదం ఇంకా కొనసాగుతోంది. హైటెన్షన్‌ విద్యుత్తు సరఫరా లైన్‌ను ఏర్పాటు చేయడానికి గ్రామస్థులు అంగీకరించకపోవడంతో.. పనుల్లో జాప్యం ఏర్పడింది. ఇప్పటికే విద్యుత్తు అధికారులు గ్రామస్థులతో చర్చలు జరుపుతున్నారు. ఈ నెలాఖరు నాటికి సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారు. అనంతరం.. పాతపాడు నుంచి నున్న సబ్‌స్టేషన్‌ వరకు లైన్‌ క్లియర్‌ అవుతుంది.

2018లో ప్రతిపాదనలు

దుర్గగుడికి సౌర విద్యుత్తు వెలుగులను అందించేందుకు ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని 2018లో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అనంతరం ఆరు నెలల్లోనే ప్లాంట్‌ను అందుబాటులోనికి తేవాలని భావించారు. కానీ.. అప్పటినుంచి అనేక ఆటంకాలు, ఈవోలు మారడంతో.. జాప్యం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు పాతపాడులో ఖాళీగా ఉన్న దేవస్థానానికి చెందిన ఐదెకరాల స్థలంలో ఏడాది కిందట ప్లాంట్‌ నిర్మాణం ప్రారంభించి.. నాలుగు నెలల్లో పూర్తిచేశారు. అప్పటి నుంచి విద్యుత్తు లైన్‌ విషయంలో జాప్యం జరుగుతోంది. పాతపాడు నుంచి నున్న సబ్‌స్టేషన్‌ వరకు 33.కె.వి. లైన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే అన్నిచోట్లా వేశారు.ఒక్క పాతపాడు గ్రామంలోనే ఉండిపోయింది. ఈ లైన్‌ ఏర్పాటు పూర్తిచేసి సెప్టెంబర్‌ నుంచి ప్లాంటు అందుబాటులోనికి తీసుకొస్తామని అధికారులు తాజాగా వెల్లడించారు.


రూ.3.71 కోట్లతో నిర్మాణం..

సౌర విద్యుత్తు ప్లాంట్‌ను రూ.3.71 కోట్లతో నిర్మించారు. మొత్తం ప్లాంట్‌కు రూ.4.64 కోట్లు వ్యయమవగా, ప్రభుత్వం నుంచి రూ.92.8 లక్షల రాయితీ వచ్చింది. ఏటా దుర్గగుడికి అయ్యే మొత్తం విద్యుత్తును ఇక్కడి నుంచే ఉత్పత్తి చేయొచ్ఛు ఏటా ఆలయానికి విద్యుత్తు బిల్లులే రూ.82 లక్షలు వరకు వస్తున్నాయి. ఏటా 13.50 లక్షల యూనిట్ల విద్యుత్తు వినియోగం జరుగుతోంది. ప్రస్తుతం ఏర్పాటు చేసిన ప్లాంట్‌ ద్వారా ఏటా.. 16 లక్షల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. దేవస్థానానికి అవసరమయ్యే విద్యుత్తు మొత్తం వినియోగించగా.. ఇంకా అదనంగా ఉన్న 2.50 లక్షల యూనిట్లను గ్రిడ్‌కు అనుసంధానిస్తారు. దీనికి గాను దేవస్థానానికి ఏటా రూ.13.70 లక్షలు ఆదాయం సమకూరనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని