క్షయ.. వెంటాడుతోంది..!
eenadu telugu news
Updated : 02/08/2021 13:57 IST

క్షయ.. వెంటాడుతోంది..!

కొవిడ్‌ వచ్చి తగ్గిన వారిలో లక్షణాలు

జిల్లాలో గత రెండు నెలల్లో 40 కేసులు

ఈనాడు, అమరావతి - గుణదల, న్యూస్‌టుడే

‘విజయవాడకు చెందిన నాగరాజుకు కొవిడ్‌ వచ్చి తగ్గింది. నెల రోజులు గడిచినా బాగా నీరసంగా ఉండడంతో.. వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. క్షయ వ్యాధి ఉన్నట్టు తేలింది. పుట్రేలకు చెందిన లక్ష్మయ్యకు కూడా కరోనా వచ్చి తగ్గింది. ఆ తర్వాత బాగా నీరసంగా ఉండడం, రాత్రివేళ దగ్గు తగ్గకపోవడంతో పరీక్షలు చేయించుకుంటే.. క్షయ బయటపడింది. యనమలకుదురుకు చెందిన నాగార్జునకు మే చివరి వారంలో కరోనా వచ్ఛి. తగ్గింది. నెలన్నర దాటుతున్నా.. నీరసం తగ్గలేదు. నాలుగు అడుగులు వేయలేకపోవడంతో పరీక్షలు చేయించుకుంటే.. క్షయ సోకిందన్నారు. దీంతో ఆరు నెలలు కచ్చితంగా మందులు వాడాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు వీరికి సూచించారు.’

జిల్లాలో కరోనా బారినపడి కోలుకున్న వారిని క్షయ వ్యాధి వెంటాడుతోంది. బాగా నీరసం, చిన్నగా దగ్గు, కళ్లె ఉండడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, కొంచెం దూరం నడిచినా ఆయాసం, శ్వాస సంబంధ సమస్యలు.. వంటివి వెంటాడుతున్నాయి. కొంతమందిలో తక్కువ ఉష్ణోగ్రతతో జ్వరం కూడా వస్తోంది. రాత్రిపూట చెమటలు పట్టడం, తలనొప్పి లాంటి సమస్యలు అధికంగా ఉంటున్నాయి. వైద్యుల వద్దకు వెళితే పరీక్షలు నిర్వహిస్తుండగా.. కొందరిలో క్షయ వ్యాధి ఉన్నట్టు తేలుతోంది. జిల్లాలో కొవిడ్‌ వచ్చి తగ్గిన 320 మందికి గత రెండు నెలల్లో టీబీ పరీక్ష నిర్వహించగా.. 40 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. జూన్‌లో 249 మందికి పరీక్షలు చేయగా.. 34 మందికి వ్యాధి ఉన్నట్టు తేలింది. జులై 15 వరకు 72 మందిని పరీక్షించగా ఆరుగురికి క్షయ ఉన్నట్టు తేలింది.

పోషకాహారం తీసుకోవాలి..

క్షయ వ్యాధి బారినపడిన వారు మంచి పోషకాలు ఉన్న ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. అప్పుడే వ్యాధి నుంచి త్వరగా బయటపడేందుకు వీలుంటుందని వైద్యులు సూచిస్తున్నారు. తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను అధికంగా తీసుకోవాలి. వీటితో పాటు పప్పులు, డ్రైఫ్రూట్స్‌ లాంటివి తీసుకోవడం ద్వారా శరీరానికి తగినంత శక్తి వస్తుంది. విజయవాడ, గుంటూరు నగరాల్లో వరల్డ్‌ విజన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఆధ్వర్యంలో క్షయ బాధితులకు ప్రతి నెలా పోషకాహారం అందిస్తున్నారు. విజయవాడలో ఉండే వంద మందికి, గుంటూరులో 75 మందికి ఈ సంస్థ ఉచితంగా పంపిణీ చేస్తోంది. వీరు అందించే సరకుల్లో కందిపప్పు, శెనగలు, రాగిపిండి, ఖర్జూరం ప్యాకెట్లు, వేరుశెనగ, బెల్లం, సెనగ నూనె వంటివి ఉంటున్నాయి. వైద్యుల సలహా మేరకు ఈ పోషకాలను అందిస్తున్నారు.


అనుమానం వస్తే అప్రమత్తమవ్వాలి..

కరోనా వచ్చి తగ్గిన వారిలో క్షయ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఉన్నట్టు అనుమానం వస్తే.. వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. క్షయ వ్యాధి ఉన్నట్టు నిర్థరణ అయితే... క్రమం తప్పక ఆరు నెలలు మందులు వాడితే పూర్తిగా నయమవుతుందన్నారు. కృష్ణా జిల్లాలో 19 క్షయ వ్యాధి నిర్ధారణ, చికిత్స కేంద్రాలున్నాయి. వీటిలో విజయవాడ నగరంలోనే నాలుగు యూనిట్లు ఉన్నాయి. జిల్లాలో కళ్లె పరీక్ష కేంద్రాలు 158 వరకు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటికే అనేకమంది ఈ వ్యాధి బారిన పడి మందులు వాడుతున్న వారున్నారు. 2019లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో క్షయ వ్యాధికి మందులు వాడుతున్న వారు 8345 మంది ఉన్నారు. గత ఏడాది నుంచి కరోనా వల్ల ఆసుపత్రులకు ఓపీ కేసులు భారీగా తగ్గిపోయాయి. అయినప్పటికీ 2020లో 4960, 2021 జులై వరకు 3507 మంది వ్యాధి బారినపడి చికిత్స పొందుతున్నారు. వీరిలో కొవిడ్‌ బారినపడి కోలుకున్న వారే ఎక్కువ.


త్వరగా గుర్తించి చికిత్స పొందాలి

- డాక్టర్‌ జి.జి.జె.ఎన్‌.లక్ష్మి, జిల్లా క్షయ నియంత్రణ అధికారి

క్షయ వ్యాధి ఊపిరితిత్తులకు సంబంధించినది. కరోనాతో ప్రధానంగా ఊపిరితిత్తులే దెబ్బతింటున్నాయి. అందుకే కొవిడ్‌ వచ్చి తగ్గిన వాళ్లు కచ్చితంగా టీబీ పరీక్షలు చేయించుకోవాలి. కొంతమందిలో క్షయ ఉన్నా.. లక్షణాలు బయటకు కనిపించవు. వ్యాధి బారినపడిన వాళ్లు బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి. పోషకాహారం కోసమే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. క్షయ అంటు వ్యాధి కావడంతో త్వరగా గుర్తించి.. మిగతా వారికి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు కచ్చితంగా మాస్కును ధరించాలి. రోగి ఉపయోగించే వస్తువులు మిగతా వారికి దూరంగా ఉంచాలి. ప్రభుత్వం అందించే మందులు ఆరు నెలలు వాడితే వ్యాధి తగ్గిపోతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని