ఆటస్థలంలో ఇసుక నిల్వ తగదు
logo
Published : 15/06/2021 04:06 IST

ఆటస్థలంలో ఇసుక నిల్వ తగదు

అడ్డుకున్న దోనేపూడి యువకులు

తహసీల్దార్‌ జాన్‌పీటర్‌కు వినతిపత్రం ఇస్తున్న యువకులు

దోనేపూడి(కొల్లూరు), న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాల ఆటస్థలంలో ఇసుక నిల్వ చేస్తే ఊరుకునేది లేదంటూ స్థానిక యువకులు అడ్డుతగిలారు. దీంతో వారికి, ఇసుక నిలవ చేసేందుకు ప్రయత్నించిన జేపీ పవర్‌ సెక్యూర్‌ సంస్థకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దోనేపూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆట స్థలంలో ఇసుక నిల్వ చేసేందుకు అనువుగా సోమవారం జేపీ సంస్థ సిబ్బంది పొక్లెయిన్‌తో చదును చేసేందుకు ఉపక్రమించారు. గమనించిన స్థానిక యువకులు అడ్డుకున్నారు. తమకు అనుమతులున్నాయని.. అడ్డుకుంటే పోలీసులకు పిర్యాదు చేస్తామని సిబ్బంది హెచ్చరించడంతో యువకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యాపార సంస్థకు ప్రభుత్వ స్థలాలు ఎలా కేటాయిస్తారంటూ నిలదీశారు. దీంతో ఉద్రిక్తతకు దారి తీసింది. చేసేదిలేక జేపీ సంస్థ వర్గాలు అక్కడి నుంచి నిష్క్రమించాయి. ఈ వివాదం స్థానిక అధికారుల వద్దకు చేరింది. ఉభయ పక్షాల వాదనలు విన్న ఎస్‌ఐ ఉజ్వల్‌కుమార్‌ శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించి వివాదాన్ని తహసీల్దార్‌, ఇతర అధికారుల వద్ద తేల్చుకోవాలని వారికి సూచించారు. రెండు వర్గాల వాదనలు విన్న తహసీల్దార్‌ జాన్‌ పీటర్‌ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి, వారి ఆదేశాల మేరకు పరిష్కరిస్తానని.. అప్పటి వరకూ యథాతథస్థితిని కొనసాగించాలని తేల్చి చెప్పారు. దీంతో ఉద్రిక్తతకు తాత్కాలికంగా తెరపడింది. రాతపూర్వక అనుమతులేవీ జేపీ సంస్థవారు తమకు చూపించలేదని తహసీల్దార్‌, ఎస్‌ఐ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. సమీపంలోని కృష్ణా నది నుంచి లక్ష క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తరలించి నిల్వ చేసేందుకు ప్రభుత్వం వద్ద నుంచి తాము అనుమతి పొందామని జేపీ సంస్థ వర్గాలు తెలిపాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని